ఓ కుటుంబ విషాదాంతం

ABN , First Publish Date - 2021-05-30T05:51:49+05:30 IST

ఓ కుటుంబ విషాదాంతం

ఓ కుటుంబ విషాదాంతం
మెట్టు కుమారస్వామి మృతదేహం

ఇది అనాథలా పడి ఉన్న ఓ మృతదేహం కాదు. ఓ కుటుంబ కన్నీటికి సజీవం లేని సాక్ష్యం. కరోనా కర్కశత్వానికి అచేతనంగా పడి ఉన్న ఆ కుటుంబ పెద్ద భౌతికకాయం. నూజివీడులో విషాదానికి నిలువెత్తు నిదర్శనం. మెట్టు కుమారస్వామి.. భార్య జయలక్ష్మి, కుమారుడు శివగోపాల్‌తో చిన్న కుటుంబమైనా చింతలేకుండా జీవించారు. కూతురు భాగ్యలక్ష్మికి వివాహం చేసిన కుమారస్వామి భార్య, కుమారుడితో స్థానిక చిన్న గాంధీబొమ్మ సెంటర్‌లో నివాసం ఉంటున్నారు. ఇంతలోనే ఆ కుటుంబంపై కరోనా కన్నేసింది. 20 రోజుల క్రితం కుమారస్వామి, జయలక్ష్మికి కరోనా సోకగా, తిరువూరు కొవిడ్‌ ఆసుపత్రిలో చేరారు. తర్వాత కుమారుడు శివగోపాల్‌కు కూడా కరోనా నిర్ధారణ కావడంతో విజయవాడలోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. కుమార్తె భాగ్యలక్ష్మి తల్లిదండ్రులకు సేవలు చేస్తూ తిరువూరులో ఉండగా, ఈ నెల 26న జయలక్ష్మి మృతిచెందింది. ఊరు కాని ఊర్లో, ఎవరూ సాయం అందించని స్థితిలో భాగ్యలక్ష్మి తన తల్లికి అంతక్రియలు నిర్వహించింది. ఆ మరుసటి రోజే శివగోపాల్‌ కూడా చనిపోయాడు. తమ్ముడు చనిపోయిన విషాదంలో భాగ్యలక్ష్మికి నిస్సత్తువ, నీరసం రావడంతో కుప్పకూలిపోయింది. భాగ్యలక్ష్మి భర్త ఆమెను ఆసుపత్రిలో చేర్పించాడు. ఇంతలోనే భాగ్యలక్ష్మి తండ్రి కుమారస్వామి కూడా మృతిచెందాడు. తిరువూరుకు చెందిన వెలుగోటి ఆదినారాయణ, సురేశ్‌, రాజు, శేఖర్‌ సహకారంతో భాగ్యలక్ష్మి భర్త రవి మిగతా ఇద్దరి దహన సంస్కారాలు నిర్వహించారు. విషాదమేమిటంటే.. కుటుంబంలో ముగ్గురూ ఒకరికొకరు చనిపోయారని తెలియకుండా కన్నుమూశారు.

- నూజివీడు

Updated Date - 2021-05-30T05:51:49+05:30 IST