మళ్లీ డేంజర్‌లోకి..

ABN , First Publish Date - 2021-03-24T05:35:36+05:30 IST

మళ్లీ డేంజర్‌లోకి..

మళ్లీ డేంజర్‌లోకి..
నగరంలోని ఓ స్కూల్‌లో కరోనా జాగ్రత్తలు

కొత్తగా 63 కరోనా కేసులు నమోదు 

విజయవాడలో ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్‌ 

కరోనా లక్షణాలతో 65 ఏళ్ల వృద్ధుడు మృతి

గుడిమెట్లలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ కూడా..

విజయవాడ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా మహమ్మారి మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. విజయవాడ నగరంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు వైరస్‌ సోకినట్లు గుర్తించారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు హాజరవుతున్న విద్యార్థుల్లో జలుబు, దగ్గు, జ్వరం వంటి కరోనా లక్షణాలు కనిపిస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కరోనా లక్షణాలతో నగర శివారులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 65 ఏళ్లు వృద్ధుడు మంగళవారం మరణించినట్లు తెలిసింది. చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో దంపతులకు కరోనా సోకినట్లు చెబుతున్నారు. నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్న ఆర్‌ఎంపీ వైద్యుడిని మెరుగైన వైద్యం కోసం సోమవారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది. 

అంతటా భయాందోళన

జిల్లాలో 15 రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ రెట్టింపు సంఖ్యలో పెరుగుతుండటంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 63 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,434కు పెరిగింది. కొవిడ్‌ మరణాల సంఖ్య అధికారికంగా 682 వద్ద నిలకడగా ఉంది. కరోనా బారినపడిన బాధితుల్లో ఇప్పటి వరకు 48,443 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 308 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రెండు, మూడు వారాలుగా జిల్లాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నా ఇంకా చాలామంది నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని, కరోనా సెకండ్‌ వేవ్‌ను తేలిగ్గా తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా పట్ల ప్రజలు ఉదాసీనంగా ఉండకుండా అందరూ ముఖానికి మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచూ శానిటైజర్లు లేదా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 


Updated Date - 2021-03-24T05:35:36+05:30 IST