ఫిల్మ్‌ లేదని రూ.2కోట్ల యత్రాన్ని పక్కన పడేస్తారా?

ABN , First Publish Date - 2021-11-23T06:49:37+05:30 IST

స్థానిక ప్రభు త్వాసుపత్రి వైద్యాధికారుల నిర్లక్ష్య వైఖరి, పరిపాలన, నిర్వహణపరమైన లోపాలు ప్రతిరోజూ ఏదో ఒక మూల బయటపడుతూనే ఉన్నాయి.

ఫిల్మ్‌ లేదని రూ.2కోట్ల యత్రాన్ని పక్కన పడేస్తారా?

అధికారులు, సిబ్బందిపై నిప్పులు చెరిగిన సూపరింటెండెంట్‌ 

తక్షణం అందుబాటులోకి వచ్చిన వైనం 

మొదట తానే ఎక్స్‌రే తీయించుకుని ప్రారంభించిన కిరణ్‌కుమార్‌ 

ఆంధ్రజ్యోతి-విజయవాడ : స్థానిక ప్రభు త్వాసుపత్రి వైద్యాధికారుల నిర్లక్ష్య వైఖరి, పరిపాలన, నిర్వహణపరమైన లోపాలు ప్రతిరోజూ ఏదో ఒక మూల బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఫిల్మ్‌ల సరఫరా లేదనే కారణంతో ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగంలోని సుమారు రూ.2కోట్ల విలువైన డిజిటల్‌ ఎక్స్‌-రే యంత్రాన్ని రెండేళ్లుగా వినియోగించకుండా మూలనపడేసిన వైనం సోమవారం వెలుగులోకి వచ్చింది. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వై.కిరణ్‌కుమార్‌ సూపర్‌ స్పెషాలిటీ బ్లాకును పరిశీలిస్తుండగా విషయం బయటపడింది. సుమారు రూ.150 కోట్లతో నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ బ్లాకులో రోగులకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్యసేవలందించేందుకు రూ. కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చారు. ఇందులో భాగంగానే 2019లో రేడియాలజీ విభాగంలో రూ.2కోట్ల విలువైన అత్యాధునిక డిజిటల్‌ ఎక్స్‌ రే యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి ఫిల్మ్‌ల సరఫరా లేదనే కారణంతో రెండేళ్లుగా యంత్రాన్ని ఉపయోగించకుండా మూలనపడేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సూపరింటెండెంట్‌ రేడియాలజీ విభాగం వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఆసుపత్రికి ప్రతిరోజూ 300 నుంచి 400 మందికి పైగా ఓపీ పేషెంట్లు వస్తున్నారని, వారిలో 100 మందికిపైగా ఎక్స్‌రేలు తీయాలని వైద్యులు సిఫార్సు చేసి పంపిస్తున్నా కేవలం ఫిల్మ్‌ లేదనే కారణంతో రూ.2కోట్ల విలువైన యంత్రాన్ని మూలనపడేసి ఉంచడం ఎంతమాత్రం సరికాదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ యంత్రాన్ని మూలనపడేసి ఉంచడంతో వైద్యులందరూ రోగులను సీటీస్కాన్‌లు తీయించుకోవాలంటూ సిఫార్సులు చేస్తున్నారన్నారు. అప్పటికప్పుడే తానే మొదటి ఎక్స్‌రే తీయించుకుని డిజిటల్‌ ఎక్స్‌రేని డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ ప్రారంభించారు. ‘డిజిటల్‌ ఎక్స్‌రే అందుబాటులో ఉన్నప్పుడు ఫిల్మ్‌లతో పనేముంది? రోగులకు డిజిటల్‌ రిపోర్టులు ఇవ్వండి! డాక్టర్లు ఆ ఎక్స్‌రే రిపోర్టును చూసి రోగులకు వైద్యం చేస్తారు...’ అంటూ సూపరింటెండెంట్‌ కాసేపు క్లాస్‌ తీసుకున్నారు. అదేవిధంగా సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లోని రెండు సీటీ స్కాన్‌ మిషన్లను కూడా 24 గంటలూ రోగులకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ నిత్యం రోగులకు అందుబాటులో ఉండేలా టెక్నీషియన్లకు మూడు షిప్టులు డ్యూటీలు వేయాలన్నారు. అపెండిసైటిస్‌ తదితర నొప్పులతో బాధపడేవారికి అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ సరిపోతుందని, దానికి సీటీ స్కాన్‌లు అవసరం లేదన్నారు. ఆసుపత్రిలోని ఎంఆర్‌ఐ స్కానింగ్‌ను కూడా పేద రోగులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కరోనా బాధితులకు ప్రతిరోజూ సాయంత్రం పీపీఈ కిట్లు వేసుకుని ఎంఆర్‌ఐ స్కానింగ్‌లు తీయాలని, తర్వాత స్కానింగ్‌ రూమును పూర్తిగా శానిటైజ్‌ చేసి మర్నాడు ఉదయం 9 గంటల నుంచి సాధారణ రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. మొత్తానికి సూపర్‌ స్పెషాలిటీ బ్లాకులో గత రెండేళ్లుగా తాళాలు వేసి ఉన్న రేడియాలజీ విభాగాన్ని తెరిపించి డిజిటల్‌ ఎక్స్‌రేను రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చిన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ చొరవను చూసి ఆసుపత్రి వర్గాలే అభినందిస్తున్నాయి.

Updated Date - 2021-11-23T06:49:37+05:30 IST