ఏడాదికిచ్చేది రూ.10 వేలు..నెలకు దోచేది రూ.5 వేలు

ABN , First Publish Date - 2021-08-03T05:55:12+05:30 IST

ఏడాదికిచ్చేది రూ.10 వేలు..నెలకు దోచేది రూ.5 వేలు

ఏడాదికిచ్చేది రూ.10 వేలు..నెలకు దోచేది రూ.5 వేలు
పారిశుధ్య కార్మికులకు చీరలు అందజేస్తున్న బొండా ఉమామహేశ్వరరావు

వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా విమర్శ

అజిత్‌సింగ్‌నగర్‌, ఆగస్టు 2: నవరత్నాల పేరుతో ప్రజలకు ఏడాదికి రూ.10 వేలు ఇచ్చి, పలు రూపాల్లో భారాలు మోపి నెలకు రూ.5 వేలు దోచుకుంటున్న వైసీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు సూచించారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, వైసీపీ ప్రభుత్వంలో ధరలను ప్రజలు బేరీజు వేయాలని ఆయన కోరారు. టీడీపీ 58వ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యాన అజిత్‌సింగ్‌నగర్‌ సెంట్రల్‌ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు బొండా ఉమా సోమవారం చీరలు పంపిణీ చేశారు. అధికారంలో ఉన్నా లేకపోయినా టీడీపీ ఓ స్వచ్ఛంద సేవాసంస్థలా నిరంతరం పేదలకు అండగా ఉంటుందని ఆయన అన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహించిన పారిశుధ్య కార్మికులను అందరూ అభినందించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం కార్మికులకు కనీసం ఆరోగ్య భద్రత కల్పించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020 మార్చి నుంచి కరోనాతో రాష్ట్రంలో వేలాది మంది మృతి చెందినా ఒక్క కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితులను ఆదుకోవాలని, నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం టీడీపీ రాజీ లేని పోరాటాలు చేస్తుందన్నారు. పింఛన్‌ రూ.3 వేలు చేస్తానన్న వైసీపీ ప్రభుత్వం రెండేళ్లు గడిచినా హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షుడు ఆలా తారక రామారావు, నవనీతం సాంబశివరావు, సోమేశ్వరరావు, మాజీ కార్పొరేటర్‌ పిరియా జగదాంబ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T05:55:12+05:30 IST