ఆటలో బామ్మర్ది

ABN , First Publish Date - 2021-10-25T06:23:57+05:30 IST

జిల్లాలో పేకాట అడ్డాలు పెరిగిపోతున్నాయి.

ఆటలో బామ్మర్ది

మైలవరం నియోజకవర్గంలో యథేచ్ఛగా పేకాట స్థావరాలు

వైసీపీ నేతల తోటలే జూద గృహాలు

వారాంతాల్లో అక్కడే పేకాటరాయుళ్లకు విందు.. మందు 

పొరుగు రాష్ట్రం నుంచి బ్రాండెడ్‌ మద్యం

అంతా స్థానిక ప్రజాప్రతినిధి బామ్మర్ది కనుసన్నల్లోనే

సామాన్యులను రోడ్డున పడేస్తున్న అధికార పార్టీ నేతల ధనదాహం


జిల్లాలో పేకాట అడ్డాలు పెరిగిపోతున్నాయి. ప్రత్యేకించి మైలవరం నియోజకవర్గ పరిధిలో తెలంగాణ సరిహద్దు ప్రాంత తోటల్లోని గెస్ట్‌హౌస్‌ల్లో 24 గంటలూ పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాలన్నీ వైసీపీ ముఖ్య నేత బామ్మర్ది కనుసన్నల్లోనే నడుస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. వారాంతాల్లో ఇక్కడ పేకాటరాయుళ్లకు విందు.. మందు కూడా ఏర్పాటు చేస్తారు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చే బ్రాండెడ్‌ మద్యం ఇక్కడ వరదై పారుతుంది. తాజాగా ఈ నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలంలో వైసీపీ నేతకు చెందిన మామిడితోటల్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు దాడి చేసి, 11 మందిని అరెస్ట్‌ చేసి రూ.3.76 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో వైసీపీలో నియోజకవర్గ నాయకులను పక్కకు తప్పించి, చోటా నాయకులను అరెస్ట్‌ చేశారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రెడ్డిగూడెం మండలంలో రెండేళ్లుగా పేకాట కేంద్రాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇటీవలే స్థానిక సంస్థలకు ఎన్నికైన అధికార పార్టీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే ఇవి నడుస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేంద్రాలు అడ్డాగా జూదం రూపేణా ప్రతినెలా రూ.కోట్లలో చేతులు మారుతున్నాయని విశ్వసనీయ సమాచారం. ఈ కేంద్రాల జోలికి రాకుండా ఉండేందుకు అన్ని స్థాయిల్లో వారికి నెలవారీ మామూళ్లు వెళుతుంటాయి. ఎమ్మెల్యే పీఏ కనుసన్నల్లో ఈ జూదగృహాల జోలికి ఎవ్వరూ రాకుండా పర్యవేక్షణ జరుగుతుంటుంది. దీనికి గాను ఆయనకు ఓ లకారం ప్రతినెలా ముడుతుందని సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు ఏడాది పొడవునా కోడి పందేలు, పేకాట నిర్వహిస్తుంటారు. ఈ కారణంగానే రెండేళ్లుగా ఇక్కడ జూద గృహాలు నడుస్తున్నా, ఎవరూ చర్యలు తీసుకోవడంలేదని చెబుతారు. ఎవరైనా ధైర్యం చేసి ఈ పేకాట స్థావరాల వద్దకు వస్తే, వారిని రాష్ట్రస్థాయి మంత్రుల పేర్లు చెప్పి బెదిరిస్తుంటారు. ఇప్పుడు చేసినట్లే ఏడాది క్రితం కూడా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వారు పేకాట శిబిరాలపై దాడి చేశారు. అప్పట్లో రాజకీయ ఒత్తిళ్లు రావడంతో ఎవరిపైనా కేసు నమోదు చేయకుండా వదిలేశారు. ఆ దాడిలో 80 బైక్‌లు, మూడు కార్లు, సుమారు 18 లక్షల నగదు దొరికినా ప్రజాప్రతినిధి బామ్మర్ది సాయంతో ఒక్క కేసు కూడా లేకుండా బయటపడ్డారు. ఈ విషయం తెలిసిన అప్పటి ఎస్పీ స్థానిక సీఐ, ఎస్‌ఐలను బదిలీ చేసేందుకు ప్రయత్నించి, రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా రావడంతో ఆగిపోయారు. 


పొరుగు మందుపై ఇక్కడ ఆంక్షల్లేవ్‌

రెడ్డిగూడెం మండలంలో నిర్వహించే పేకాట శిబిరాల్లో పొరుగు రాష్ట్రం మందుపై ఎలాంటి ఆంక్షలూ కనిపించవు. వారాంతాల్లో ఇక్కడ పేకాటరాయుళ్లకు నాన్‌వెజ్‌ వంటకాలతో రుచికరమైన భోజన సదుపాయం కల్పించడంతోపాటు, పొరుగు రాష్ట్రం నుంచి బ్రాండెడ్‌ మందు కూడా సరఫరా చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు దగ్గరుండి ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. పేకాట స్థావరాలను వైసీపీ నాయకుల తోటల్లోని గెస్ట్‌హౌస్‌ల్లోనే నడిపిస్తుండటం.. కేవలం రిఫరెన్స్‌తో వచ్చే వాళ్లని మాత్రమే లోపలికి అనుమతిస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని జూదగాళ్ల కార్లు వారాంతాల్లో ఈ గెస్ట్‌హౌస్‌లకు క్యూలు కడుతున్నాయి. ఇక్కడ పేకాట క్లబ్‌లలో ఒక టేబుల్‌కు ఆరుగురు సభ్యులు ఉంటారని, 12 శాతం టేబుల్‌ కమిషన్‌ కింద వసూళ్లు చేస్తుంటారని తెలుస్తోంది. మామూలు రోజుల్లో 10 వేలు, రూ.25 వేలు రూ.50 వేలు టేబుళ్లు, వారాంతాల్లో లక్ష, రెండు లక్షలు, ఐదు లక్షల రూపాయలు టేబుళ్లు నడుస్తుంటాయి. ఈ పేకాట క్లబ్బుల గురించి నియోజకవర్గ జనసైనికులు ఇచ్చిన పక్కా సమాచారంతో స్పెషల్‌ టీం శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో దాడి చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా 12 మంది అధికార పార్టీకి చెందిన ప్రముఖులతోపాటు, లక్షల ఖరీదు చేసే తెలంగాణ మద్యం పట్టుబడినట్టు సమాచారం. అయితే బామ్మర్ది రంగప్రవేశంతో ప్రముఖులను పక్కకు తప్పించేసి అనామకులను ఇరికించారని తెలుస్తోంది. 

Updated Date - 2021-10-25T06:23:57+05:30 IST