పాత గొడవను మరిచిపోయాడులే అనుకొని.. స్నేహితుడితో బయటకు వెళ్తే..

ABN , First Publish Date - 2021-05-09T04:55:14+05:30 IST

పాత వివాదం మనసులో..

పాత గొడవను మరిచిపోయాడులే అనుకొని.. స్నేహితుడితో బయటకు వెళ్తే..

ప్రాణం తీసిన పాత వివాదం

నమ్మకంగా తీసుకొచ్చిన స్నేహితులు

ఎర్రకట్ట రైల్వేట్రాక్‌ వద్ద వివాదం

యువకుడిని హత్య చేసి పరార్‌


విజయవాడ/కేదారేశ్వరపేట(ఆంధ్రజ్యోతి): పాత వివాదం మనసులో పాతుకుపోయింది. పైకి ప్రాణ స్నేహితుల్లా కలిసిమెలిసి తిరుగుతున్నా.. లోలోపల పగను పెంచింది. చివరికి ప్రాణాలు తీసింది. ఎర్రకట్ట వద్ద ఉన్న పాత వంతెనకు దిగువన శనివారం మధ్యాహ్నం యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ముగ్గురు యువకులు కలిసి మరో యువకుడిని నమ్మకంగా ఇంటి నుంచి తీసుకొచ్చి చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వించిపేట సీఎస్‌ఐ చర్చి ప్రాంతానికి చెందిన గొల్లపల్లి సూర్య (23) కూలీగా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం సూర్యకు, అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడికి మద్యం మత్తులో వివాదం జరిగింది. ఆ సమయంలో సూర్య ఆయుధంతో అతడిపై దాడి చేశాడు. దీనికి సంబంధించి కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత కొన్నాళ్లకు వారిద్దరూ కలిసిపోయారు. ఇద్దరూ కలిసిమెలిసి తిరగడం, అందుబాటులో ఉన్న పనులకు వెళ్లడం చేస్తున్నారు. పాత గొడవను తన స్నేహితుడు మరిచిపోయాడు అనుకున్నాడు సూర్య.


కానీ, దెబ్బతిన్న ఆ యువకుడు మనసులో పగను పెంచుకున్నాడు. అవకాశం కోసం ఎదురుచూశాడు. శనివారం మధ్యాహ్నం ముగ్గురు యువకులు సూర్య ఇంటికి వెళ్లారు. సరదాగా ఎర్రకట్ట పక్కగా.. రైలు పట్టాల వద్దకు వెళ్దామని బయటకు తీసుకొచ్చారు. వించిపేట నుంచి నడుచుకుంటూ రైలు పట్టాల వద్దకు చేరుకున్నారు. ప్రహరీ దాటుకుని వెళ్లి హైదరాబాద్‌ ట్రాక్‌ వద్ద పక్కన కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉండటంతో చుట్టుపక్కల వారంతా తలుపులు వేసుకుని ఇళ్లలో ఉన్నారు. 3.30 గంటల సమయంలో యువకులు గొడవపడిన కేకలు వినిపించాయి. తర్వాత ఆగిపోయాయి. గొడవ సద్దుమణిగిందని వారంతా అనుకున్నారు. తర్వాత కాసేపటికి సూర్య మృతదేహం పట్టాల పక్కన పడి ఉంది. స్థానికులు గమనించి జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించగా, కుడివైపున కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. పాత గొడవల నేపథ్యంలో హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఆయుధంతో దాడి చేసినట్లు గుర్తించారు. ఆ ముగ్గురు యువకులు ఎవరన్నది ఇంకా తెలియలేదు. పశ్చిమ మండల ఏసీపీ డాక్టర్‌ హనుమంతరావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.  జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-05-09T04:55:14+05:30 IST