కోడి పందేల నిర్వహణపై కఠిన చర్యలు : డీఎస్పీ

ABN , First Publish Date - 2021-01-12T05:53:57+05:30 IST

సంక్రాంతి సందర్భంగా అవనిగడ్డ సబ్‌ డివిజన్‌లో ఎక్కడైనా కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ మహబూబ్‌ బాషా హెచ్చరించారు.

కోడి పందేల నిర్వహణపై కఠిన చర్యలు : డీఎస్పీ

అవనిగడ్డ టౌన్‌, జనవరి 11: సంక్రాంతి సందర్భంగా అవనిగడ్డ సబ్‌ డివిజన్‌లో ఎక్కడైనా కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ మహబూబ్‌ బాషా హెచ్చరించారు. సోమవారం అవనిగడ్డలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ కోడి పందేలు వేసే వారిని ఇప్పటికే గుర్తించి బైండోవర్‌ చేశామని, ఎవరైనా కోడి పందేలు, జూదాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇప్పటి వరకు దాదాపు 300కుపైగా కోడికత్తులను స్వాధీనం చేసుకున్నామని  సీఐ భీమేశ్వర రవికుమార్‌ తెలిపారు.  అవనిగడ్డ తహసీల్దార్‌ కార్యాలయంలో కోడి పందేల నిరోధానికి గ్రామ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై తహసీల్దార్‌ శ్రీను నాయక్‌ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో బి.ఎం. లక్ష్మీకుమార్‌, ఎస్సై సురేష్‌, ఇన్‌చార్జి ఆర్‌ఐ శేషుబాబు పాల్గొన్నారు.  

పెద్ద ఎత్తున కోడి కత్తులు స్వాఽధీనం

మచిలీపట్నం టౌన్‌ : కోడి పందేలకు ఉపయోగించే కోడి కత్తులను పెద్ద ఎత్తున సోమవారం ఇనకుదురు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గొడుగుపేట గంగానమ్మ దేవాలయం వద్ద జొన్నలగడ్డ కృష్ణమూర్తిని అరెస్టు చేసి 362 కత్తులు, సానబెట్టేందుకు ఉపయోగించే మోటారు, రెండు చిన్న గ్రైండర్‌ వీల్స్‌, ఒక పెద్ద గ్రైండర్‌ వీల్‌ స్వాధీనం చేసుకున్నారు. బలరామునిపేటకు చెందిన నిందితుడు కృష్ణమూర్తి కత్తులకు సానబెడుతుండగా అరెస్టు చేశారు. కత్తులకు సానబెట్టిస్తున్న వంగర వెంకటే్‌షను కూడా అదుపులోకి తీసుకున్నారు. సీఐ శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-12T05:53:57+05:30 IST