ఆర్యవైశ్యులను మోసం చేయొద్దు

ABN , First Publish Date - 2021-09-03T06:34:42+05:30 IST

ఆర్యవైశ్యులను మోసం చేయొద్దని జగన్‌మోహన్‌రెడ్డిని కోరుతూ, రద్దుచేసిన స్థలాన్ని తిరిగివ్వాలని డిమాండ్‌ చేస్తూ గురువారం స్థానిక ధర్నాచౌక్‌లో టీడీపీ మద్దతుతో ఆర్యవైశ్యులు ధర్నా చేశారు.

ఆర్యవైశ్యులను మోసం చేయొద్దు
నిరసన ప్రదర్శనలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా

నిరసన ప్రదర్శనలో బొండా ఉమా, బుద్దా వెంకన్న 

వన్‌టౌన్‌, సెప్టెంబరు 2 : ఆర్యవైశ్యులను మోసం చేయొద్దని జగన్‌మోహన్‌రెడ్డిని కోరుతూ, రద్దుచేసిన స్థలాన్ని తిరిగివ్వాలని డిమాండ్‌ చేస్తూ గురువారం స్థానిక ధర్నాచౌక్‌లో టీడీపీ మద్దతుతో ఆర్యవైశ్యులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల  ఆంకాక్షలను నెరవేర్చలేని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు నగరంలో ఉండడం దౌర్భాగ్యమన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్యవైశ్యులకు సత్యనారాయణపురంలో కేటాయించిన వెయ్యి చదరపు గజాల స్థలాన్ని జగన్‌రెడ్డి ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం దుర్మార్గమన్నారు. సెంట్రల్‌లో కల్యాణమండపం, కన్యకాపరమేశ్వరి ఆలయం కోసం తాను ఎమ్మెల్యేగా కౌన్సిల్‌లో తీర్మానం చేయించి వెయ్యి చదరపు గజాల స్థలాన్ని కేటాయించానన్నారు. ఇప్పుడు ఆ స్థలాన్ని వెనక్కి తీసుకుని డంపింగ్‌ యార్డ్‌కు వినియోగిస్తున్నారన్నారు. అదేమని అడిగితే మంత్రి వెలంపల్లి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సెంట్రల్‌లో ఏం అభివృద్ధి జరిగిందో చర్చించేందుకు ఎమ్మెల్యే విష్ణు రావాలని సవాల్‌ విసిరారు. రూ.600 కోట్లతో అభివృద్ధి జరిగితే తాను కట్టుబట్టలతో ఊరివిడిచి వెళ్లిపోతానని ఉమా పేర్కొన్నారు. త్వరలో ఆర్యవైశ్యులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ, ఆర్యవైశ్యులకు టీడీపీ అండగా ఉంటుందని, వారికి కేటాయించిన భూమిని తిరిగి ఇప్పించే వరకు పోరాటం చేస్తామని, ప్రభుత్వం తక్షణం వాటికి ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ మేయర్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య ఐక్య కార్యచరణ వేదిక  కన్వీనర్‌ డూండీ రాకేష్‌,  32వ డివిజన్‌ కార్పొరేటర్‌ చెన్నగిరి రామమోహనరావు, ఆర్యవైశ్య సంఘం నేతలు నాళం కోటేశ్వరరావు, శ్రీనివా్‌సగుప్తా, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కల రఘురామరాజు, విజయవాడ మార్కెట్‌ యార్డ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ తుమ్మలపెంట శ్రీనివాసులు, వైశ్య కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ పేర్ల రవి, దుర్గగుడిట్రస్ట్‌ బోర్డు సభ్యుడు బడేటి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-03T06:34:42+05:30 IST