అందని ఆరోగ్యశ్రీ!

ABN , First Publish Date - 2021-01-12T06:43:30+05:30 IST

ఆరోగ్యశ్రీకి అర్హత ఫార్సుగా మారిపోయింది. వార్డు సచివాలయాల సిబ్బంది అవగాహన లేమి కారణంగా స్వల్ప సాంకేతిక సమస్యతో అర్హులైన ఎందరో ఇప్పటికీ ఆరోగ్యశ్రీ కార్డును అందుకోలేకపోతున్నారు.

అందని ఆరోగ్యశ్రీ!

అర్హతలున్నా సాంకేతిక కారణాలతో సమస్య

పరిష్కరించలేకపోతున్న వార్డు సచివాలయాలు 

వైద్యం దూరమై పేదలు విలవిల


 ఆరోగ్యశ్రీకి అర్హత ఫార్సుగా మారిపోయింది. వార్డు సచివాలయాల సిబ్బంది అవగాహన లేమి కారణంగా స్వల్ప సాంకేతిక సమస్యతో అర్హులైన ఎందరో ఇప్పటికీ ఆరోగ్యశ్రీ కార్డును అందుకోలేకపోతున్నారు. సాంకేతిక సమస్యలు ఉంటే పరిష్కరించాల్సిన సిబ్బంది, అందుకు విరుద్ధంగా, తోసిపుచ్చటం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి.


(ఆంరఽధజ్యోతి, విజయవాడ)

ఆరోగ్యశ్రీ కార్డుకు సచివాలయ సిబ్బంది రేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకుంటూ, ఇతర అర్హతలను పట్టించుకోకపోవడంతో అర్హత ఉన్నా, ఆరోగ్యశ్రీ కార్డు పొందలేక.. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేక పేదలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల కంటే విజయవాడ నగరంలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఆరోగ్యశ్రీ కార్డుకు అర్హతను నిర్ణయించటంలో రైస్‌ కార్డు ప్రామాణికం కాదు. కానీ అవగాహన లేని వార్డు వలంటీర్లు రేషన్‌ కార్డు, ప్రజా సాధికార సర్వే, మ్యాపింగ్‌ వంటి అంశాలను ఎత్తి చూపుతూ ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వలేమని తేల్చి చెబుతున్నారు. వైద్యారోగ్య శాఖ దీనిపై సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 


ఆరోగ్యశ్రీ కార్డుల మంజూరులో ఎదురవుతున్న ఇబ్బందుల్లో మచ్చుకు కొన్ని...

- విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పదో డివిజన్‌లో  పొట్లూరి రాఘవేంద్రరావు, నళినీకుమారి దంపతులు సెక్టార్‌ - 2 సచివాలయంలో రెండు నెలల క్రితం ఆరోగ్యశ్రీ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ పెద్ద వయసు వారు. వారి ఆదాయం సంవత్సరానికి రూ.5 లక్షల లోపు ఉండటం వల్ల ఆరోగ్యశ్రీ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలల తర్వాత స్థానిక వార్డు వలంటీర్‌ వీరి ఇంటికి వచ్చి, వివరాలను నమోదు చేసుకుని వెళ్ళింది. అయితే వీరి బయోమెట్రిక్స్‌ తీసుకునే క్రమంలో ఇబ్బందులు తలెత్తాయి.  దీంతో ఆరోగ్యశ్రీ కార్డు సంగతిని వార్డు వలంటీర్‌, హెల్త్‌ సెక్రటరీ పక్కనపెట్టేశారు. దీంతో ఆ దంపతులిద్దరూ బయోమెట్రిక్స్‌ అప్‌డేట్‌ చేయించుకునేందుకు ఆధార్‌ కేంద్రానికి వెళ్లారు. ఆధార్‌ కేంద్రంలో కూడా బయోమెట్రిక్స్‌ తీసుకోవటం సాధ్యం కాలేదు. వీరి సమస్య తేలలేదు. వార్డు సచివాలయం పట్టించుకోవటం లేదు. దీంతో ఆరోగ్యశ్రీ కార్డు కోసం వీరు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

 

- 14వ డివిజన్‌కు చెందిన బోగా లక్ష్మీనారాయణది మరో సమస్య. లక్ష్మీ నారాయణ కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో హోంగార్డు. పోలీసులకు ఉన్న ఆరోగ్య భద్రత పథకం పరిధిలో ఆయన లేడు. ఆరోగ్యశ్రీ కోసం దరఖాస్తు చేసుకుంటే.. వార్డు వలంటీర్‌ వివరాలు నమోదు చేశారు. లక్ష్మీనారాయణ రైస్‌ కార్డులో పెన్షనర్‌ అయిన అతని తండ్రి పేరు ఉండటం వల్ల ఆరోగ్యశ్రీ చేయలేకపోతున్నామని చెబుతున్నారు. స్థానిక వీఆర్వో, వలంటీర్‌, హెల్త్‌ సెక్రటరీలు ముగ్గురూ సమస్యను అపరిష్కృతంగానే ఉంచేశారు. కొద్ది రోజుల క్రితం లక్ష్మీనారాయణ కుమార్తెను అనారోగ్యం కారణంగా ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వైద్యసేవలకు రూ.లక్ష ఖర్చు చేయాల్సి వచ్చింది. పెన్షనర్‌గా ఉన్న తండ్రి పేరును రైస్‌ కార్డు నుంచి తొలగించటానికి అవకాశం లేదు. పెన్షనర్‌ అయిన తండ్రి కారణంగా ఆ కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డు అందదు. ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అర్హత ఉన్నా.. సాంకేతిక ఇబ్బందుల కారణంగా పక్కన పెట్టేస్తుండటంతో.. పథకం ప్రయోజనాలకు ఎంతోమంది దూరమవుతున్నారు. 


 ఇవీ ప్రామాణికం 

 పేదల వైద్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్డుల విషయంలో రైస్‌ కార్డు ప్రామాణికం కాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.5 లక్షల ఆదాయంలోపు ఉన్నవారు ఆరోగ్యశ్రీ కార్డుకు అర్హులు. 12 ఎకరాల లోపు మాగాణి భూములు, 35 ఎకరాలలోపు మెట్ట ఉన్నవారు, రెండూ కలిపి 35 ఎకరాలలోపు ఉన్న వారు కూడా ఆరోగ్యశ్రీ కార్డు పొందటానికి అర్హులు. మిగిలిన పథకాలకు మాదిరిగా కారు ఉన్నా ఆరోగ్యశ్రీ కార్డును పొందవచ్చు. వ్యక్తిగతంగా ఒక కారు వరకు అవకాశం ఉంది. ఒక్క కారు కంటే ఎక్కువగా ఉంటే అర్హత ఉండదు. పట్టణ ప్రాంతంలో 3000 చదరపు అడుగుల స్థలంలోపు ఉండవచ్చు. ఇన్ని అర్హతలు ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలను సాకుగా చూపి ఆరోగ్యశ్రీ కార్డులకు నగరంలో ఎంతోమంది అర్హత సాధించలేకపోతున్నారు. 

Updated Date - 2021-01-12T06:43:30+05:30 IST