యాప్‌..సోపాలు

ABN , First Publish Date - 2021-10-31T05:52:05+05:30 IST

యాప్‌..సోపాలు

యాప్‌..సోపాలు

యాప్‌ల పేరుతో ఆన్‌లైన్‌ బిజినెస్‌

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ రాబడి అంటూ ఎర

రూ.లక్షల్లో పెట్టుబడులు పెడుతున్న అమాయకులు

కొంతకాలం లాభాలు.. ఆనక ఆదాయానికి బ్రేకులు

జిల్లాలో పెరుగుతున్న కేసులు

ఇప్పటివరకు 500 మంది బాధితులు


యనమలకుదురుకు చెందిన ఓ యువకుడు చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆన్‌లైన్‌లో ఉన్న ఓ యాప్‌పై కొంత పెట్టుబడి పెడితే అదనపు ఆదాయం వస్తుందని స్నేహితుడు చెప్పాడు. పెట్టుబడి, వచ్చే ఆదాయాన్ని లెక్కలు వేసుకుంటే లాభం భారీగానే కనిపించింది. నిర్వాహకులు ఎవరో తెలియకుండానే ఆ యువకుడు ముందు రూ.వేలల్లో పెట్టుబడి పెట్టాడు. తర్వాత దాన్ని రూ.లక్షకు పెంచాడు. కొంతకాలంగా యాప్‌ నుంచి క్రమం తప్పకుండా వచ్చిన చెల్లింపులు ఆగిపోవడంతో ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. భవానీపురానికి చెందిన ఓ వ్యక్తి రియల్‌ ఎస్టేట్‌ చేస్తున్నాడు. కరోనా సమయంలో రియల్‌ వ్యాపారం తగ్గడంతో స్నేహితుల సూచన మేరకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే యాప్‌ల గురించి తెలుసుకున్నాడు. లాభం అధికంగా వస్తుందని లెక్కలు తేలడంతో కష్టపడకుండా సొమ్ము సంపాదించు కోవచ్చనుకున్నాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో సంపాదించిన డబ్బును ఆన్‌లైన్‌ యాప్‌లపై పెట్టుబడిగా పెట్టాడు. విడతలవారీగా డబ్బు అందుకున్న ఆయనకు తర్వాత చెల్లింపులు ఆగిపోయాయి. ఎవరిని అడగాలో తెలియదు, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు, బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలపట్టుకున్నాడు.


(విజయవాడ, ఆంధ్రజ్యోతి) : యాప్‌ల పేరుతో పెట్టుబడి పెట్టించి చివరకు మోసం చేసిన కేసులు జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో 20 కేసులు నమోదు కాగా, దాదాపు 500 మంది వరకూ బాధితులు బయటపడ్డారు. వారంతా రూ.లక్షల్లో సొమ్ము పోగొట్టుకున్నారు. వారిలో కొంతమంది మాత్రమే పోలీసులను ఆశ్రయించారు. మిగిలిన వారంతా జరిగిన మోసాన్ని తలచుకుని ఎవరికి చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు. 

అత్యాశే ప్రధాన కారణం

నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. ఇంధన ధరలూ అదే స్థాయిలో ఉన్నాయి. ఒకరి సంపాదనపై సంసార నావ నడిచే పరిస్థితి లేదు. వేడినీళ్లకు చన్నీళ్లు తోడవ్వాల్సిందే. లేకపోతే ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుంటాయి. ఇలాంటి ఆలోచనలతోనే ఇప్పుడు చాలామంది ఆదాయం వచ్చే అదనపు మార్గాలపై దృష్టి పెడుతున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఒకరిని చూసి మరొకరు, ఒకరి తర్వాత ఇంకొకరు ఆన్‌లైన్‌ సంపాదనకు ఆకర్షితులవుతున్నారు. ప్రజల ఆసక్తిని గ్రహించిన సైబర్‌ నేరగాళ్లు వివిధ రకాల కంపెనీల పేర్లతో ఆన్‌లైన్‌ ఆదాయపు యాప్‌లను గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వదులుతున్నారు. బంధువులు, మిత్రులకు వాటి గురించి వివరిస్తూ ఖాళీ కాగితాలపై ఆదాయపు లెక్కలు వేసి చూపిస్తుంటే ఆశలు రెక్కలు తొడుగుతున్నాయి. ఆసక్తి పుట్టిందే తడువుగా ఆన్‌లైన్‌ పెట్టుబడులు పెట్టేస్తున్నారు. ఆయా కంపెనీలకు ఆన్‌లైన్‌లో చెల్లించేస్తున్నారు. 

మారిన సైబర్‌ నేరగాళ్ల లెక్క

ప్రజల బలహీనతలను బేరీజు వేసుకుని సైబర్‌ నేరగాళ్లు అడుగులు వేస్తున్నారు. తొలి రోజుల్లో వివిధ రకాల లింక్‌లను ఈ-మెయిల్‌, వాట్సాప్‌లకు పంపి ఖాతా వివరాలను సేకరించి మొత్తం ఖాళీ చేసేవారు. తర్వాత ఓటీపీ (వన్‌టైం పాస్‌వర్డ్‌) ట్రెండ్‌ నడిచింది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వివరాలు, బ్యాంక్‌లో వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని సందేశాలను వినిపించేవారు. తర్వాత ఓటీపీలను పంపి ఖాతాల్లోని నగదును దారి మళ్లించారు. కరోనాతో అన్ని రంగాలు కుదేలు కావడం, ఆర్థిక పరిస్థితి అతలాకుతలం కావడంతో సైబర్‌ నేరగాళ్లు కొత్త ట్రెండ్‌కు తెరలేపారు. కరోనా కారణంగా ఎక్కువ మంది అదనపు ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టారు. దీంతో వివిధ ఉత్తరాది కంపెనీల పేర్లతో యాప్‌లు పుట్టుకొచ్చాయి. అదే పనిగా ప్లేస్టోర్‌లో కొత్త యాప్‌ల కోసం గాలిస్తున్న వారు వాటిల్లో సభ్యులుగా చేరారు. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మాదిరిగానే రోజులు, నెలలు, సంవత్సరాలు ఇలా పెట్టుబడులు పెట్టిన వారికి ఆదాయాన్ని చూపిస్తూ చివరికి మోసం చేస్తున్నారు. 

రకరకాల యాప్‌లతో..

మెడికల్‌ పరికరాలు, విద్యుత్‌ ప్లాంట్లు ఇతర కంపెనీల పేర్లతో ఈ యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇందులో పెట్టుబడులు పెట్టిన వారికి తొలిరోజుల్లో కొన్నాళ్లపాటు క్రమం తప్పకుండా నగదు జమ అవుతోంది. ఇలా చేరిన వారంతా తమ స్నేహితులనూ సభ్యులుగా చేరుస్తున్నారు. తోటి స్నేహితుడు తక్కువ పెట్టుబడి పెట్టి అంత ఆదాయం సంపాదిస్తే తాను ఇంకా ఎక్కువ పెట్టుబడిని పెట్టాలనుకుంటున్నారు. వెనుకేసుకున్న డబ్బు తెచ్చి ఆన్‌లైన్‌లో యాప్‌లకు ధారపోస్తున్నారు. కంపెనీల నుంచి నగదు జమ అవుతున్నంత కాలం ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారు. జమ ఆగిపోయిన మరుక్షణం నుంచి లబోదిబోమంటున్నారు. 

ఆ యాప్‌లను నమ్మొద్దు

వివిధ రకాల యాప్‌లలో పెట్టుబడులు పెట్టి, చివరికి డబ్బు కోల్పోయిన వారు మాకు ఫిర్యాదు చేస్తున్నారు. తక్కువ మొత్తంలో సొమ్ము కోల్పోయిన వారూ మా వద్దకు వస్తున్నారు. వాటిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఉండే ఇలాంటి యాప్‌లను నమ్మొద్దు. 

- బత్తిన శ్రీనివాసులు, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌

Updated Date - 2021-10-31T05:52:05+05:30 IST