నేడే ఏపీ సాధారణ బడ్జెట్
ABN , First Publish Date - 2021-05-20T12:20:58+05:30 IST
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ఈరోజు ఏపీ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ఈరోజు ఏపీ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ముందుగా ఉభయసభలనుద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ ప్రసంగించనున్నారు. తర్వాత అసెంబ్లీలో మంత్రి బుగ్గన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆ వెంటనే ఆమోదముద్ర పడనుంది. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడనుంది. అటు శాసనమండలిలోనూ ఈరోజే ఆమోదం లభించనుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ (2021-22)రూ.2.28 లక్షల కోట్ల నుంచి రూ.2.30 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. 2020-21లో రూ.2.28 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి దానిని రూ.2.25 లక్షల కోట్లకు సవరించారు. ఇప్పుడు కూడా ఇదే తీరున ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. వ్యవసాయ బడ్జెట్ తరహాలోనే చిన్నారులకు, మహిళలకు కూడా ప్రత్యేక బడ్జెట్ పేపర్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.వివిధ పథకాల ద్వారా మహిళలు, చిన్నారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంత మేర లబ్ధి పొందుతున్నారో స్థూలంగా ప్రభుత్వం వివరించనుంది.
బడ్జెట్‌కు ముందు ఉదయం ఎనిమిది గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశంకానుంది. రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. అనంతరం శాసనసభ సమావేశాల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఉభయసభలనుద్దేశించి వర్చువల్‌గా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. కరోనా నేపథ్యంలో రాజ్‌భవన్ నుంచి వర్చువల్‌గా ప్రసంగం కొనసాగనుంది. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం జరుగనుంది. నేడు సభ ముందుకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను తీసుకురానుండగా, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు సమర్పించనున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
తర్వాత ద్రవ్య వినిమయ బిల్లు సహా పలు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలుపనుంది. బద్వేలు ఎమ్మెల్యే జి.వెంకటసుబ్బయ్య మృతికి సభ సంతాపం తెలుపనుంది. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడనుంది. శాసనసభ ఆమోదముద్ర తర్వాత వార్షిక బడ్జెట్‌ను శాసనమండలిలో హోంమంత్రి, వ్యవసాయ బడ్జెట్‌ను మండలిలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సమర్పించనున్నారు. శాసనమండలిలో చైర్మన్ షరీఫ్ అధ్యక్షతన ఏర్పడిన మాతృభాషా కమిటీ తొలి నివేదిక మండలి ముందుకురానుంది. చైర్మన్ షరీఫ్ పదవీకాలం ఈ నెలాఖరులో ముగుస్తుండడంతో గురువారమే ఆయనకు వీడ్కోలు పలుకనున్నారు. మరోవైపు నేడు సభ ముందుకు కాగ్ రిపోర్ట్ రానుంది.