పంట నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన ఏదీ..?

ABN , First Publish Date - 2021-11-26T06:15:09+05:30 IST

భారీ వర్షాల సమయంలో పంట నష్టం అంచనాలను రూపొందించడంలో వ్యవసాయశాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పలువురు ఎంపీటీసీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పంట నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన ఏదీ..?
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ ప్రసన్నకుమారి

విజయవాడ రూరల్‌ మండల సమావేశంలో ఎంపీటీసీ సభ్యుల ఆగ్రహం

విజయవాడ రూరల్‌, నవంబరు 25 : భారీ వర్షాల సమయంలో పంట నష్టం అంచనాలను రూపొందించడంలో వ్యవసాయశాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పలువురు ఎంపీటీసీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ రూరల్‌ మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి అధ్యక్షతన గురువారం జరిగింది. పలువురు మాట్లాడుతూ, అసలు క్షేత్రస్థాయికి రాకుండానే ఇష్టం వచ్చినట్లుగా అంచనాలు వేస్తున్నారని, నిజమైన రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. నష్టం అంచనాల సమయంలో ప్రజా ప్రతినిధులకు సమాచారం అందించాలని డిమాండ్‌ చేశారు. గొల్లపూడి, నున్న తదితర గ్రామాలకు చెందిన సభ్యులు కేతుపల్లి కోటేశ్వరరావు, పోలారెడ్డి ప్రసాద్‌రెడ్డి వ్యవసాయశాఖ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వరుసగా వచ్చిన వరదలకు వేలాది ఎకరాల వరి పంట ముంపునకు గురైందన్నారు. ఎంపీటీసీ సభ్యులుగా ఉన్న తామే వ్యవసాయం చేస్తున్నామని, ఎక్కడా పంట నష్టం అంచనాలకు అధికారులు పొలాల్లోకి రావడంలేదన్నారు. దీనిపై వ్యవసాయశాఖాధికారి వి.హరీష్‌ వారికి వివరణ ఇచ్చారు. ఇటీవల వచ్చిన భారీ వర్షాలకు నష్టపోయిన వరి పంట నష్టం అంచనాలను త్వరలోనే రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ-క్రా్‌పలో నమోదు చేసుకోవాలని, క్షేత్రస్థాయికి అధికారులు, సిబ్బంది వస్తారని తెలిపారు. ప్రభుత్వం వరిని రెండో పంటగా వేయవద్దని ఆదేశించిందన్నారు.  రైతులకు జొన్న, మొక్కజొన్న, ఇతర అపరాలకు సంబంధించిన విత్తనాలు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఎంపీపీ ప్రసన్నకుమారి మాట్లాడుతూ, పంట నష్టాల రూపొందించే సమయంలో తమకు సమాచారం అందించాలన్నారు. తాగునీటి సమస్యపై పలువురు సభ్యులు మాట్లాడారు. అనంతరం అన్ని శాఖలపైనా ఎంపీపీ ప్రసన్నకుమారి సమీక్ష నిర్వహించారు. అంతకుముందు నిడమానూరు-2 ఎంపీటీసీ సభ్యుడు నల్లూరు రవికాంత్‌తో ఎంపీడీవో జె.సునీత ప్రమాణ స్వీకారం చేయించారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు కాకర్లమూడి సువర్ణరాజు, వైస్‌ ఎంపీపీ వేమూరి సురేష్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ శ్రీనివాసరావు, ఎంఈవో ఎ.వెంకటరత్నం, సర్పంచ్‌లు ఉయ్యూరు గోపాలరావు, వేముల సీతారామయ్య, వరి శ్రీదేవి, శీలం రంగారావు, రాచమళ్ల పూర్ణచంద్రరావు, కొలుసు సముద్రవేణి పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-26T06:15:09+05:30 IST