ఇంకెంత దూరం!
ABN , First Publish Date - 2021-12-30T06:42:34+05:30 IST
ప్రాథమిక పాఠశాలలు కనుమరుగు కానున్నాయి.

ప్రాథమిక పాఠశాలల విలీనంలో నిబంధనల సవరణ
‘దూరం’ నిబంధన తొలుత 250 మీటర్లు
తాజాగా మూడు కిలోమీటర్లకు పెంపు
ఒక్కటిగా అంగన్‌వాడీ, 1,2 తరగతులు
టీచర్ల సర్దుబాటులోనూ గందరగోళం
ప్రాథమిక పాఠశాలలు కనుమరుగు కానున్నాయి. ప్రభుత్వ నూతన విద్యావిధానం పుణ్యమా అంటూ ఐదో తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలు ఇక నుంచి ఒకటి, రెండు తరగతులకే పరిమితం కానున్నాయి. మూడు కిలోమీటర్ల దూరంలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలంటూ మూడు రోజుల క్రితం ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను విలీనం చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ దూరాన్ని మూడు కిలోమీటర్లకు పెంచడం ద్వారా పేద పిల్లలను ఉచిత ప్రాథమిక విద్యకు దూరం చేయనుంది.
ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను విలీనం చేయాలని గతంలో నిర్ణయించిన ప్రభుత్వం, తాజాగా ఈ దూరాన్ని 250 మీటర్ల నుంచి మూడు కిలోమీటర్లకు పెంచుతూ జీవో జారీ చేసింది. నూతన విద్యావిధానం అమలు ద్వారా ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వ చర్యలున్నాయని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎయిడెడ్ పాఠశాలల బాటలోనే..
ఇటీవల కాలంలో జిల్లాలోని 357 ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లను ప్రభుత్వ పాఠశాలల్లోకి తీసుకున్నారు. ఆస్తులను తమ వద్దే ఉంచుకున్న అన్ని ఎయిడెడ్ సంస్థల యాజమాన్యాలు టీచర్లను ప్రభుత్వానికి అప్పగించేందుకు దాదాపు అంగీకరించాయి. ఎయిడెడ్ పాఠశాలల సంగతి ఇలా ఉండగా, ఉన్నత పాఠశాలకు 250 మీటర్ల దూరంలో ఉన్న 162 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. తాజాగా ఈ దూరాన్ని మూడు కిలోమీటర్లకు పెంచడంతో జిల్లాలో 2,606 ప్రాథమిక పాఠశాలల మనుగడకు ముప్పు వాటిల్లనుంది. పది సంవత్సరాల్లోపు వయసు విద్యార్థులు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకునేందుకు ఎంత వరకు సిద్ధపడగలరనేది ప్రశ్నార్థకమే. కిలోమీటరు దూరంలోపు అంగన్‌వాడీలను, ఒకటి, రెండు తరగతులను కలిపి ప్రాథమిక పాఠశాలలుగా గుర్తిస్తారు.
టీచర్ల సర్దుబాటులోనూ గందరగోళం
విలీనం చేసే పాఠశాల్లోని టీచర్లను ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేసినట్టు చూపుతున్నారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది అక్టోబరు 18వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్ల సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవాలని ఆ జీవోలో సూచించారు. దీంతో 358 మంది ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాల్లో సర్దుబాటు చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నవంబరు 11న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉపాధ్యాయుల సీనియారీటీని కాక, విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దీనిపై ఇప్పటికే సీనియారీటీ అధారంగా సర్దుబాటు అయిన ఉపాధ్యాయులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. డీవైఈవోలు, ఎంఈవోలతో కమిటీలు వేసి, ఎక్కడిక్కడ సమస్యను పరిష్కరించాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 261 మంది టీచర్లను ఉన్నత పాఠశాలల్లోకి సర్దుబాటు చేశారు. అయినా విద్యార్థులు, ఉపాధ్యాయులు పాత పాఠశాల్లోనే ఉంటున్నారు. కొత్త జీవో ప్రకారం వేలాది మంది టీచర్లను సర్దుబాటు చేయాల్సి ఉంటుందని, దీనిపై విధివిధానాలు ఎలా ఉంటాయోనని టీచర్లు ఆందోళన చెందుతున్నారు.
పరిశీలిస్తున్నాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విలీనం అంశాన్ని పరిశీలిస్తున్నాం. జాతీయ రహదారులు, ప్రధాన కాలువలు, ఇతరత్రా ప్రత్యేక పరిస్థితులు ఉన్న పాఠశాలలకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. కొత్త విధానం అమలుచేసే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని పరిష్కరిస్తాం. - తాహెరా సుల్తానా, జిల్లా విద్యాశాఖాధికారిణి