తమిళనాడు తరహాలో ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి: ఏపీ జేఏసీ చైర్మన్

ABN , First Publish Date - 2021-05-13T16:58:56+05:30 IST

ఓవైపు కోవిడ్ విధులు, మరోవైపు శాఖాపరమైన పనులతో ఉద్యోగులు సతమతమవుతున్నారని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

తమిళనాడు తరహాలో ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి: ఏపీ జేఏసీ చైర్మన్

అమరావతి:  ఓవైపు కోవిడ్ విధులు, మరోవైపు శాఖాపరమైన పనులతో ఉద్యోగులు సతమతమవుతున్నారని అమరావతి ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ కరోనా సమయంలో ఉద్యోగులు కుటుంబ సభ్యులను సైతం కోల్పోతున్నారన్నారు. ఉద్యోగుల కనీస అవసరాల గురించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నా... నేటికీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. కరోనా బారినపడ్డ ఉద్యోగులకు  ప్రత్యేక సెలవులు ఎందుకు మంజూరు చేయడం లేదో అర్ధం కావట్లేదన్నారు. కరోనా బారినపడి రాష్ట్ర సచివాలయంలోనే ఇప్పటికి 9 మంది మరణించారని... ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో వందల మంది ఉద్యోగులు చనిపోయారని తెలిపారు. వైద్యం పొందుతున్న అనేక మంది ఉద్యోగుల ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పారు. వైద్యం కొరకు అప్పులు తెచ్చి లక్షలు ఖర్చుపెడితే.. నెలలు తరపడి ప్రభుత్వం నుండి రావాల్సిన డబ్బులు రావడం లేదని అన్నారు. ఏ శాఖలో ఎంతమంది ఉద్యోగులు చనిపోతున్నారో లెక్కలు కూడా తెలియని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడకుండా ముఖ్యమంత్రి భరోసా ఇస్తారని నమ్మకంతో ఎదురు చూస్తున్నారన్నారు. చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్సగ్రేషియా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. వైద్య శాఖలో ఒప్పంద ఉద్యోగి చనిపోతే.. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం లేకపోవడం విచారకరమన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని వెంటకేశ్వర్లు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-05-13T16:58:56+05:30 IST