ఏం తినాలి, ఎలా బతకాలి?

ABN , First Publish Date - 2021-03-23T05:00:31+05:30 IST

పది నెలలుగా వేతనాలు చెల్లించకుంటే ఏం తినాలి, ఎలా బతకాలి అంటూ ప్లేట్లు చేతబట్టుకుని బాలయోగి గురుకుల పాఠశాల కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

ఏం తినాలి, ఎలా బతకాలి?
కలెక్టరేట్‌ వద్ద ప్లేట్లు చేతబట్టి నిరసన తెలుపుతున్న బాలయోగి గురుకుల పాఠశాల కార్మికులు

పది నెలలుగా వేతనాలు చెల్లించకుంటే ఏం తినాలి, ఎలా బతకాలి అంటూ ప్లేట్లు చేతబట్టుకుని బాలయోగి గురుకుల పాఠశాల కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సోమవారం వీరు ఏఐటీయూసీ నాయకులతో కలసి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్‌.నాగసుబ్బారెడ్డి, బాలయోగి గురుకుల పాఠశాల ఉద్యోగుల యూనియన్‌ గౌరవాధ్యక్షుడు కేసీ బాదుల్లా, జిల్లా కార్యదర్శి యాకోబ్‌ మాట్లాడుతూ జిల్లాలో 18 బాలయోగి గురుకుల పాఠశాలల్లో పనిచేసే వంట కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు మొత్తం 180 మందికి పది నెలలుగా వేతనాలు రాలేదన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ నిర్వాహకులు కార్మికులకు ఎంత వేతనాలు చెల్లిస్తున్నారన్న సమాచారం అధికారుల వద్ద లేకపోవడం అన్యాయమన్నారు. వెంటనే బాలయోగి గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.18వేలు అమలు చేసి, అవుట్‌సోర్సింగ్‌ ఏజన్సీ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల పీఎఫ్‌, ఈఎస్‌ఐ డబ్బు కాజేసిన ఏజెన్సీపై క్రిమినల్‌ కేసులు నమోదు  చేయాలన్నారు. బాలయోగి గురుకుల పాఠశాల కార్మికుల యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగాధర్‌, కుళ్లాయమ్మ, నాగమల్లేశ్‌రెడ్డి, ఇషాక్‌, సులోచన, చంద్రావతి, చంద్రకళ, రవి, తులసి, వీరాంజనేయులు, చెన్నయ్య, పుల్లయ్య, బాబ్జి, శారద తదితరులు పాల్గొన్నారు.

- కడప (రవీంద్రనగర్‌)

Updated Date - 2021-03-23T05:00:31+05:30 IST