నష్టం పూడేదెన్నడు..?

ABN , First Publish Date - 2021-12-16T05:06:14+05:30 IST

నష్టం నీటికెరుక... కష్టం మనిషికెరుక అన్నట్టుగా మారింది అక్కడి పరిస్థితి. అన్నమయ్య ప్రాజెక్టు తెగి భారీ వరదతో అతలాకుతలమైన గ్రామాల పరిస్థితి నెలరోజులు అవుతున్నా పెద్దగా మార్పులేదు. వరద మిగిల్చిన నష్టాలు ఎక్కడ చూసినా వెక్కిరిస్తున్నాయి.

నష్టం పూడేదెన్నడు..?
రామచంద్రాపురం వద్ద పొలంలో ఓ షెడ్డు కింద పూడిపోయి నేటికీ దర్శనమిస్తున్న ఫోర్డ్‌ కారు

నెలరోజులు కావస్తున్నా చెల్లాచెదురుగా కనిపిస్తున్న వస్తువులు

కళ్లెదుటే ఉన్నా.. కొరగాకుండా మారిన వైనం

ఇంట్లోని స్పూను మొదలు.. ఫ్రిజ్‌ వరకూ అన్నీ వరదార్పణం

వరద ముంపు గ్రామాల్లో అంచనాలకు అందని నష్టం..

లబోదిబోమంటున్న బాఽధితులు

నష్టం నీటికెరుక... కష్టం మనిషికెరుక అన్నట్టుగా మారింది అక్కడి పరిస్థితి. అన్నమయ్య ప్రాజెక్టు తెగి భారీ వరదతో అతలాకుతలమైన గ్రామాల పరిస్థితి నెలరోజులు అవుతున్నా పెద్దగా మార్పులేదు. వరద మిగిల్చిన నష్టాలు ఎక్కడ చూసినా వెక్కిరిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన అరకొర సహాయం వీరికి కలిగిన నష్టంతో పోల్చుకుటే చాలా స్వల్పం. వరద బాధిత ప్రాంతమైన రామచంద్రాపురం, సాలిపేట, తొగూరుపేట గ్రామాలను మరోసారి ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు కనిపిస్తున్నా.. వాస్తవానికి వారికి కలిగిన నష్టం ఇప్పట్లో పూడ్చలేనిది. వారు యధాస్థితికి చేరుకోవాలంటే ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేం. గూడునిచ్చే ఇళ్లు నేలమట్టమయ్యాయి. బతుకునిచ్చే పొలాల్లో ఇసుక మేటలు వేసింది. దాతలు ఇచ్చిన ఉప్పు, పప్పు, బట్టలు మినహా వారి వద్ద మరేమీ లేవు. ఇళ్లు, పొలాలు అటుంచితే.. ఇంట్లోని సర్వస్వం కోల్పోవడం వల్ల తిరిగి వారు వాటిని పొందడానికి ఎన్నేళ్లు పడుతుందో..?

- రాజంపేట


ఎక్కడ చూసినా కొట్టుకుపోయిన బట్టలే

వరద బాధిత ప్రాంతాల్లో ఎక్కడచూసినా నేటికీ కొట్టుకుపోయిన బట్టలు గుట్టలుగుట్టలుగా కనిపిస్తున్నాయి. సుమారు 2వేలకు పైబడి ఇళ్లల్లో సుమారు పది గ్రామాల్లో ముంచెత్తిన భారీ వరద వల్ల ప్రతి ఇంటిలో బట్టలన్నీ పాడై పోయాయి. మహిళలు ధరించే పట్టుచీరలు, విలువైన ఇతరత్రా చీరలు, పురుషులు ధరించే విలువైన దుస్తులతో పాటు ఉన్న బట్టలన్నీ కొట్టుకుపోయాయి. ప్రతి ఒక్కరికీ కనీసం పది నుంచి 20 జతల బట్టలుంటాయి. ఇవి సుమారు రూ.10 వేలు అనుకున్నా.. ఈ బట్టల విలువే కోట్లల్లో ఉండే అవకాశముంది. 


ఫ్రిజ్‌లు, ఏసీలు, బీరువాలు..

ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుపోయిన ఫ్రిజ్‌లు, ఏసీలు, బీరువాలు కనిపిస్తున్నాయి. ఏసీలు, ఫ్రిజ్‌లు, బీరువాలతో పాటు విలువైన వస్తువులన్నీ ప్రతి ఇంటిలో రూ.లక్షకు తక్కువ లేకుండా కొట్టుకుపోయాయి. చెయ్యేరు వెంబడి, పంట పొలాల్లో, ఇసుక మేటల్లో ఈ వస్తువులు కనిపిస్తున్నాయి. ఇవి ఇక వినియోగానికి పనికిరావు. అందువల్ల ఎవరి వస్తువులు ఎవరివో తెలియక తెలిసినా ఉపయోగపడకపోవడంతో వాటిని వదిలివేస్తున్నారు. కొట్టుకుపోయిన ఈ ఇంటి వస్తువుల విలువ కోట్లల్లో ఉంటుంది.


వినోదాన్నిచ్చే టీవీలన్నీ మటుమాయం

కొట్టుకుపోయి పాడైన ఈ టీవీని చూస్తే అయ్యో అనిపిస్తుంది. పేద ధనిక తేడా లేకుండా నేడు ప్రతి ఒక్కరికీ టీవీ లేనిదే గడవని పరిస్థితి. విలువైన సమాచారాన్ని, వినోదాన్ని పంచే టీవీలన్నీ ఇక్కడ మటుమాయమై పోయాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఏ ఇంట్లోనూ టీవీ లేదు. కొట్టుకుపోయిన టీవీలు పాడైపోయి ఎక్కడికక్కడే దర్శనమిస్తూ.. మీకు వినోదాన్నిచే మా బతుకు ఇప్పుడు ఎలా ఉందో చూడండి అని వెక్కిరిస్తున్నట్లు కనబడుతున్నాయి. రూ.10 వేల నుంచి రూ.50వేల విలువ చేసే ఈ టీవీలు కొన్ని వేలు కొట్టుకుపోయాయి. దీంతో వరద బాధిత ప్రాంతాల్లో చాలామంది పొద్దుపోక ఇబ్బంది పడుతున్నారు. తిరిగి ఇంటికో టీవీ కొనుక్కోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో..?


వేల బస్తాల ధాన్యం కనుమరుగు

ఈ ప్రాంతం కోనసీమను తలపిస్తుంది. ఎప్పుడూ 20 వేల ఎకరాల్లో మూడు కార్లుగా వరిని పండిస్తారు. ప్రతి రైతు ఇంట వరిధాన్యం నిల్వ ఉంటుంది. ఇటీవల పండిన పంటను బస్తాల రూపంలో ఏడాది పొడవునా ఉంచుకోవడానికి, అమ్ముకోవడానికి నిల్వ ఉంచుకున్నారు. వరదల వల్ల వేలాది బస్తాల వరిధాన్యం కొట్టుకు పోయింది. ఒక్కో బస్తా వెయ్యి రూపాయల పైబడి చేస్తుంది. ఒక్కో రైతు ఇంట 20 నుంచి 400బస్తాల వరకు కొట్టుకుపోయాయి. కొన్ని పొలాల్లోనే తడిసి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. వీటినష్టమే కోట్లల్లో ఉంటుంది. వీధుల్లో, దారి పక్కన, పొలాల్లో ఎక్కడచూసినా మొలకెత్తిన ధాన్యమే కనిపిస్తూ అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది.


బోకెబొచ్చె అంతా నీటి పాలే..

ప్రతి ఇంటిలో స్పూన నుంచి తినే కంచం వరకు బిందెలు, అండాలు ఇలా మొత్తం పాత్రలన్నీ కొట్టుకుపోయాయి. మామూలుగా మహిళలు తమ జీవితాంతం ఉండే విధంగా కావాల్సిన సిల్వర్‌, స్టీల్‌ సామాన్లను కొని ఇంటిలో పెట్టుకుంటారు. ఇటువంటి వస్తువులన్నీ ఒక్కటి కూడా లేకుండా కొట్టుకుపోయాయి. ఇలా పోయిన సామాన్లు ప్రతి ఇంట్లో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు విలువ చేస్తాయి. ఇవి ప్రస్తుతం వరద ప్రవహించిన ప్రాంతాల్లో అక్కడక్కడ దెబ్బతిని కనిపిస్తూ వరద తీవ్రతకు ఎంత నష్టపోయారన్నదానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాయి.


ఎక్కడివక్కడే దెబ్బతిన్న వాహనాలు..

వరదతో దెబ్బతిని పూర్తిగా పాడైపోయిన కార్లు, ట్రాక్టర్లు, మోటారు సైకిళ్లు ఎక్కడివక్కడే నేటికీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ పూర్తిగా నీటిలో మునిగి తేలాయి. దీంతో వీటి ఇంజన్లు పూర్తిగా పాడైపోయాయి. ఇవి రీసేల్‌కు కూడా పనికిరావు. కేవలం ఇనుప తూకానికి అడుగుతున్నారు. అందుకని ఎక్కడ కొట్టుకుపోయి ఇరుక్కున్నాయో అక్కడే అలాగే వదిలేశారు. ఇన్సూరెన్స కోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారు. మరి వీరికి ఏమాత్రం ఇన్సూరెన్స వస్తుందో తెలీదు. ఇన్సూరెన్స లేని వాహనాల పరిస్థితి ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.


వేలబస్తాల వడ్లు పాడైపోయాయి

- భీము భాస్కర్‌రెడ్డి, రామచంద్రాపురం

వరదల్లో కొట్టుకుపోయిన వడ్లు ఎందుకూ పనికిరావు. వేలబస్తాల వడ్లు పాడైపోయాయి. అవి ఇప్పుడు ఉన్న స్థానంలోనే మొలకెత్తుతున్నాయి. మా తొగూరుపేట గ్రామంలోనే ఒక్కొక్క ఇంటిలో 50 బస్తాల నుంచి 400 బస్తాల వరకు వరిధాన్యం కొట్టుకుపోయింది.


అవి ఎందుకూ పనికిరావు

- జొన్నా నారాయణ, తొగూరుపేట 

పాడైపోయిన వస్తువులు ఇక ఎందుకూ పనికిరాకపోవడంతో వాటిని అలాగే వదిలివేశారు. రోడ్డు వెంబడి కొట్టుకుపోయిన బట్టలు, టీవీలు, ఫ్రిజ్‌లు, బీరువాలు పడి ఉన్నాయి. అవి తూకానికి తప్ప దేనికీ పనికిరావు. అందువల్లే వాటిని ఎవ్వరూ తిరిగి తీసుకోవడం లేదు.


టీవీ కూడా లేక పొద్దుపోవడం లేదు

- గునిశెట్టి చలపతి, తొగూరుపేట 

మామూలుగా టీవీ ఉంటే పొద్దుపోతుంది. ఇల్లు వాకిలి లేదు.. టీవీ అన్నా ఉంటే ఎక్కడో ఒక చోట పెట్టుకొని చూసేవాళ్లం. అందరి ఇళ్లల్లో టీవీలన్నీ కొట్టుకుపోయాయి. కూలిపోని ఇళ్లల్లో కూడా టీవీలు మిగలలేదు. టీవీలకు అలవాటు పడ్డ జనమంతా పొద్దుపోక రాత్రి వేళ సతమతమవుతున్నారు.

Updated Date - 2021-12-16T05:06:14+05:30 IST