ఓటరు తీర్పు నేడే
ABN , First Publish Date - 2021-10-29T05:30:00+05:30 IST
సార్వత్రిక ఎన్నికల్లో ఐదేళ్లకోసారి ఓటర్లకు తీర్పు ఇచ్చే అవకాశం వస్తుంది. ఎమ్మెల్యే మరణం వల్ల బద్వేలు ఓటర్లకు రెండో పర్యాయం వచ్చింది.

బద్వేలు ఉప ఎన్నికకు సర్వం సిద్ధం
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్
పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
భారీ పోలీస్ బందోబస్తు
(కడప-ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో ఐదేళ్లకోసారి ఓటర్లకు తీర్పు ఇచ్చే అవకాశం వస్తుంది. ఎమ్మెల్యే మరణం వల్ల బద్వేలు ఓటర్లకు రెండో పర్యాయం వచ్చింది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇది రెండో ఉప ఎన్నిక. ఉప పోరులో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2,15,292 మందికి ఓటు హక్కు ఉంది. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి రెండున్నర ఏళ్లు పదవిలో ఉంటారు. కీలకమైన ఓటర్ల తీర్పు నేడే. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి 281 పోలింగ్ కేంద్రాలు.. సౌకర్యాలు.. బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. శుక్రవారం సాయంత్రానికే 1,124 మంది పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మరో పక్క నేతలు మిలిగిన ప్రతి క్షణం సద్వినియోగం చేసుకుంటూ ఓటు వేటలో కాసులు కుమ్మరిస్తున్నారు.
బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికలో ఓటర్లు తీర్పు వెలువరించే కీలక ఘట్టం నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నెల 8వ తేది వరకు అర్హులకు ఓటు హక్కు నమోదుకు అవకాశం ఇచ్చిన ఎన్నికల యంత్రాంగం అదే రోజు జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా మేరకు నేడు పోలింగ్ నిర్వహించనున్నారు. 2,15,292 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా.. సగటున 750 మందికి ఒకటి చొప్పున 281 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఈవీఎం, వీవీ పాడ్‌లు సమకూర్చారు. మరో 96 ఈవీఎంలను అత్యసరం కోసం రిజర్వ్‌లో ఉంచారు. 1,124 మంది పోలింగ్ సిబ్బందిని నియమించి ఎన్నిక నిర్వహణపై ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. 212 మందిని రిజర్వ్‌లో ఉంచారు. అలాగే.. కొవిడ్-19 నిబంధనల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సూచన అనుసరించి ప్రతి పోలింగ్ కేంద్రంలో పీపీ కిట్లు, గ్లౌజెస్, శానిటైజర్స్ సమకూర్చి.. అంగన్‌వాడి, ఆశా కార్యకర్తలను నియమించారు. బద్వేలు బాలయోగి గురుకుల పాఠశాలలో శుక్రవారం పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఈవీఎం, వీవీ పాడ్స్, సామగ్రి అందజేసి ప్రత్యేక వాహనాల్లో ఏడు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా సకాలంలో భోజనాలు అందక ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రిటర్నింగ్ అధికారి, రాజంపేట సబ్ కలెక్టరు కేతన్‌గార్గ్ పర్యవేక్షణలో సామగ్రి పంపిణీ చేశారు.
వాహనాల దారి మళ్లింపు
ఉప ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2 వేల మంది పోలీస్ సిబ్బంది, 15 కంపెనీల పారా మిలిటరీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సగటున పదిమందిని బందోబస్తుగా నియమించారు. పోలింగ్ సమయంలో ఆర్టీసీ బస్సులు మినహా ఇతర వాహనాలను బద్వేలు నియోజకవర్గం పరిధిలోకి అనుమతించరు. ఇందుకు గానూ తొమ్మిది చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. బద్వేలు మీదుగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు వెళ్లాల్సిన ప్రైవేటు వాహనాలను కర్నూలు జిల్లా నంద్యాల నుంచి గిద్దటూరు, ఆత్మకూరు మీదుగా.. నెల్లూరు జిల్లాకు వెళ్లాల్సిన ప్రైవేటు వాహనాలను రాజంపేట నుంచి రాపూరు మీదుగా లేదా రేణిగంట మీదుగా దారి మీళ్లిస్తున్నట్లు ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. అక్కడి నుంచి కడప, అనంతపురం జిల్లాలకు రావాల్సిన వాహనాలు కూడా ఇదే దారిలో రావాల్సి ఉంటుంది. శనివారం రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ఓటుకు రేటు?
ఎన్నిక బరిలో ఉన్న ప్రధాన రాజకీయ పక్షాలకు ఓటరు అత్యంత కీలకమైన వ్యక్తి. అధికారపక్షంపై ఉన్న వ్యతిరేక ఓట్లను రాబట్టేందుకు ప్రతిపక్షాలు, తమ ఓటు బ్యాంకు చీలిపోకుండా చూసుకుంటూ.. పోటీలో లేని టీడీపీ ఓటర్లను కూడా ఆకట్టుకోవడానికి ఎత్తులు వేస్తున్నారు. నేడే పోలింగ్ కావడంతో శుక్రవారం రాత్రి వరకు ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన నాయకులు కొందరు ఓటుకు రూ.500 రేటు కట్టి పంపిణీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకుండా ప్రత్యర్థి అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లను గుర్తించి భారీగా బేరం పెట్టినట్లు సమాచారం. ఓటుకు డబ్బులు పంపిణీ చేయమంటూనే మూడో కంటికి చిక్కకుండా రహస్యంగా పంపకాలు పూర్తి చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అదే క్రమంలో నేటి పోలింగ్ ఎంతో కీలకం కావడంతో.. అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కడప నగరంతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సరిహద్దు పట్టణాలు, గ్రామాల్లో మకాం వేసి పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా వ్యూహాలు రచించినట్లు తెలిసింది.
అల్లర్లు సృష్టిస్తే రౌడీషీట్
- కేకేఎన్ అన్బురాజన్, ఎస్పీ, కడప
బద్వేలు ఉప ఎన్నిక ప్రశాంత నిర్వహించేలా అన్ని చర్యలు చేపట్టాం. 2 వేల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నాం. ఏ గ్రామంలోనైనా సరే పోలింగ్ సందర్భంగా అల్లర్లు సృష్టించినా.. ఘర్షణల్లో బాగస్వామ్యమైనా కఠినమైన చట్టాల కింద కేసులు నమోదు చేసి రౌడీషిట్ తెరుస్తాం. ప్రశాంత పోలింగ్‌కు అందరూ సహకరించాలి. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా డయల్ 100కు లేదా నా ఫోన్ నెంబరు 9440796900కు కాల్ చేస్తే తక్షణమే స్పందిస్తా.
ఉప ఎన్నిక పోలింగ్ వివరాలు
------------------------------------------------
నియోజకవర్గం : బద్వేలు (ఎస్సీ రిజర్వ్)
మొత్తం ఓటర్లు : 2,15,292
పురుషులు : 1,07,915
మహిళలు : 1,07,255
థర్డ్ జండర్ : 22
పోలింగ్ కేంద్రాలు : 281
అత్యంత సమస్యాత్మకం : 148
సమస్మాత్మక కేంద్రాలు : 83
సాధారణ కేంద్రాలు : 50
పోలింగ్ సిబ్బంది : 1,124
పోలీస్ బందోబస్తు : 2,000
బరిలో ఉన్న అభ్యర్థులు వీరే
-----------------------------------------------------
అభ్యర్థి పార్టీ
------------------------------------------------------
దాసరి సుధ వైసీపీ
పీఎం కమలమ్మ కాంగ్రెస్
పనతల సురేశ్ బీజేపీ
ఓ.ఓబులేశ్ తెలుగు జనతా పార్టీ
జి.రమేష్ నవతరం పార్టీ
పి.నాగరాజు ఇండియా ప్రజాబంధు పార్టీ
పి.పెద్ద చెన్నయ్య మన పార్టీ
ఎస్.సుదర్శన్ జన సహాయక పార్టీ
ఎస్.మనోహార్ మహాజన రాజ్యం పార్టీ
పి.వెంకటేశ్వర్లు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ
కె.నరసింహులు స్వతంత్ర అభ్యర్థి
డి.చిన్నా స్వతంత్ర అభ్యర్థి
రత్నం స్వతంత్ర అభ్యర్థి
జె.రాజేష్ స్వతంత్ర అభ్యర్థి
టి.హరిప్రసాద్ స్వతంత్ర అభ్యర్థి
జోరు వానలోనూ పోలింగ్ ఏర్పాట్లు
బద్వేలు, అక్టోబరు 29: జోరు వానలోనూ ఉప ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను అధికారులు పటిష్టంగా చేపట్టారు. శనివారం బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్‌కు ఆయా కేంద్రాలకు ఈవీఎంలతో పాటు పోలింగ్ సామగ్రిని తరలించాల్సి ఉంది. అయితే శుక్రవారం ఉదయం నుంచే జిల్లావ్యాప్తంగా వాన మొదలైంది. బద్వేలు నియోజకవర్గంలోను జోరుగా వర్షం కురిసింది. ఈ వర్షాన్ని లెక్కచేయకుండా పోలింగ్ సిబ్బంది నియోజకవర్గ కేంద్రమైన బద్వేలులోని బాల యోగి గురుకుల పాఠశాలనుంచి 281 పోలింగ్ కేంద్రాలకు సామగ్రి తరలించారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ సిబ్బందికి గొడుగులను మంజూరుచేసింది. జాయింట్ కలెక్టర్ గౌతమి, అభివృద్ధి జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, హౌసింగ్ జేసీ ధ్యాన్‌చంద్ర, రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్‌గార్గ్‌ల పర్యవేక్షణలో ఎన్నికల సిబ్బందిని, సామగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా కేతన్‌గార్గ్ మాట్లాడుతూ పోలింగ్ అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించి ఎలాంటి అవరోధాలకు తావులేకుండా విజయవంతంగా పోలింగ్ ప్రక్రియ పూర్తిచేయాలని కోరారు.
బ్యాలెట్ పోరుకు సర్వం సిద్ధం
పర్యవేక్షణకు 28 మంది రూట్ ఆఫీసర్లు
బద్వేలు ఉప ఎన్నికకు అధికారులు సర్వర సిద్ధం చేశారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అవరోధాలకు తావులేకుండా ఉండేందుకు గట్టి పోలీసు బందోబస్తుతో పాటు సుశిక్షితులైన పోలింగ్ సిబ్బందిని నియమించారు. నియోజకవర్గంలోని 28 రూట్లలోని 281 పోలింగ్ స్టేషన్లలో ఎలాంటి లోటుపాట్లులేకుండా జాగ్రత్తలు చేపట్టారు.సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన 148 పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక నిఘా ఉంచారు. పోలింగ్‌ను పర్యవేక్షించేందుకు 28రూట్లుగా విభజించి ప్రతి రూటుకు ఓ అధికారిని నియమించారు. 2వేల మంది పోలీసు సిబ్బందితో 58 బస్సులలో వారిని, సామగ్రిని పోలింగ్ స్టేషన్‌కు తరలించారు.
