వైభవంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

ABN , First Publish Date - 2021-12-31T05:09:30+05:30 IST

శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

వైభవంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం
శ్రీవారి కల్యాణం నిర్వహిస్తున్న దృశ్యం

కడప(మారుతీనగర్‌), డిసెంబరు 30: గోవిందమాల భక్తబృంద సేవా సమితి కడపవారి ఆధ్వర్యంలో గురువారం స్థానిక మునిసిపల్‌ స్టేడి యంలో నిర్వహించిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పచ్చటి తోరణాలు, మంగళ వాయి ద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, పదకవితా పితామహుడు అన్నమయ్య సంకీర్తనల మద్య సాగిన స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు భారీగా షామియానాలతో చలువ పందిళ్ళు వేశారు. కల్యాణానికి ముందుగా ఉదయం 5 గంటలకు సుప్రభాతం, 6 గంటలకు తోమాలసేవ, 6-30 గంటలకు అర్చన కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాదాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు కోలాటాలు, చెక్కభజనలు, బ్యాండుమేళాలు, బాణాసంచా వెలుగుల మధ్య మునిసిపల్‌ స్టేడియం నుంచి శంకరాపురం, అప్పరా సర్కిల్‌, చిన్నచౌక్‌, ఎన్జీవో కాలనీ, ఆర్టీసీ బస్టాండు, కో-ఆపరేటివ్‌ కాలనీ, అన్నమయ్య సర్కిల్‌ మీదుగా గ్రామోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. 

Updated Date - 2021-12-31T05:09:30+05:30 IST