మోటారు సైకిళ్ల ఢీ ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-02-27T05:17:08+05:30 IST
రెండు మోటారు సైకిళ్లు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.

నెల్లూరు(క్రైం), ఫిబ్రవరి 26 :
రెండు మోటారు సైకిళ్లు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు... బుచ్చిరెడ్డిపాళెం మండలం అనంతనారాయణపురం నాగాయగుంటకు చెందిన బత్తల రమణయ్యకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు లక్ష్మణ్ మహాలక్ష్మి బోర్‌వెల్స్ పేరుతో పలు ప్రాంతాల్లో బోర్లు వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం నెల్లూరులోని కొత్తకాలువ ప్రాంతానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా 3వ మైలు వద్ద మరో మోటారు సైకిల్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మణ్ అక్కడక్కడే మృతి చెందాడు. మరో మోటారు సైకిల్‌పై వస్తున్న వ్యక్తి గాయపడ్డాడు. అతనిని స్థానికులు వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ శ్రీనివాస రెడ్డి, ఎస్ఐ నాగార్జునరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే లక్ష్మణ్ కుటుంబ సభ్యులు మాత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగానే కొట్టి చంపారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరా పుటేజ్‌లు పరిశీలించి రోడ్డు ప్రమాదమేనని నిర్థారించారు.