యువతి అదృశ్యం

ABN , First Publish Date - 2021-03-23T04:47:41+05:30 IST

డప నగరం ఎర్రముక్కపల్లెకు చెందిన ఓ యువతి అదృశ్యమైనట్లు వన్‌టౌన్‌ ఎస్‌ఐ-3 హసన్‌ తెలిపారు.

యువతి అదృశ్యం

కడప(క్రైం), మార్చి 22: కడప నగరం ఎర్రముక్కపల్లెకు చెందిన ఓ యువతి అదృశ్యమైనట్లు వన్‌టౌన్‌ ఎస్‌ఐ-3 హసన్‌ తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు.. ఎర్రముక్కపల్లెకు చెందిన కాటా తేజశ్రీ (22) ఈనెల 19న సమీపంలోని స్నేహితురాలు ఇంటికి వెళుతున్నానని తండ్రి తిరుమలదాసుకు చెప్పి వెళ్లినట్లు తెలిపారు. అదే రోజు నుంచి ఆ యువతి అదృశ్యమైందని తల్లిదండ్రులు ఆ యువతి కోసం వెతికినప్పటికీ ఆమె వివరాలు తెలియకపోవడంతో ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి


కడప (క్రైం), మార్చి 22: కడప నగరం అన్నమయ్య విగ్రహం వద్ద ఈనెల 17వ తేదీ జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్దుడు కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వన్‌టౌన్‌ ఎస్‌ఐ-1 మధుసూధన్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు కో-ఆపరేటివ్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ హుసేన్‌ సాబ్‌ (72) ఈనెల 17న సాయంత్రం సొంత పని నిమిత్తం క్రిష్ణా సర్కిల్‌ వైపు వస్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం కడపలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. 


విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ తో ఇల్లు దగ్ధం


జమ్మలమడుగు  రూరల్‌, మార్చి 22: మండలంలోని మోరగుడి గ్రామం కాపువీధి ట్యాంకు చివరిలో సోమవారం విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వలన ధనుంజయుడు అనే చేనేత కార్మికుడి ఇంటిలోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. బాధితుడు చెప్పిన వివరాల మేరకు తమ వీధిలో కరెంటు అప్‌అండ్‌ డౌన్‌ జరగడం వలన మీటరు వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇంటిలోని అన్ని సామాన్లు పూర్తిగా కాలిపోయాయని తెలిపాడు. బీరువాలో ఉన్న రూ.60 వేల నగదుతో పాటు ఫ్రిజ్‌, టీవీ, కూలర్‌ పూర్తిగా దగ్ధమైనట్లు బాధితుడు తెలిపారు. మొత్తం రూ.5 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అధికారులు పరిశీలించి ఆదుకోవాలని ఆయన కోరాడు.


లారీని ఢీకొన్న బొలెరో వాహనం


రైల్వేకోడూరు రూరల్‌, మార్చి 22: మండలంలోని మైసూరివారిపల్లి పంచాయతీ పరిధిలోని చెన్నై-తిరుపతి ప్రధాన రహదారి సోప్‌ ఫ్యాక్టరీ వద్ద కోడూరు నుంచి చెన్నై వెళ్తున్న బొలెరో వాహనం లారీని ఢీకొనడంతో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రధాన రహదరి వద్ద యాక్సిడెంట్‌ జరగడంతో కొంత మేరకు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ పెద్ద ఓబన్న సంఘటనా స్థ్ధలానికి చేరుకుని ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.

Updated Date - 2021-03-23T04:47:41+05:30 IST