జగన్‌ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో మూడోస్థానం

ABN , First Publish Date - 2021-10-30T05:22:05+05:30 IST

జాతీయ నేర గణాంకశాఖ నివేదిక 2020 ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్‌ జాతీయ స్థాయిలో మూడో స్థానంలో ఉండడం శోచనీయమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్‌ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో మూడోస్థానం

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి


వేంపల్లె, అక్టోబరు 29: జాతీయ నేర గణాంకశాఖ నివేదిక 2020 ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్‌ జాతీయ స్థాయిలో మూడో స్థానంలో ఉండడం శోచనీయమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నివేదిక ప్రకారం మొదటిస్థానంలో మహారాష్ట్ర, రెండో స్థానంలో కర్ణాటక ఉండగా మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉందన్నారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండోస్థానంలో ఉందన్నారు. జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలే ఇందుకు కారణమన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్‌ సరఫరా పథకాన్ని ఎత్తివేస్తే రైతుల ఆత్మహత్యలు మరింత పెరుగుతాయని, ఆత్మహత్యల్లో రాష్ట్రం మొదటిస్థానానికి చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థులకు మేనమామగా ఒకవైపు ఉంటానంటూ మరొకవైపు శకునిమామలా, కంసమామలా ముఖ్యమంత్రి ప్రవర్తించడం శోచనీయమన్నారు. రేషన్‌ డీలర్ల గోనెసంచులకు కూడా జగన్‌ ప్రభుత్వం కక్కుర్తి పడడం సిగ్గుచేటన్నారు. సుమారు 600 రోజులుగా గాంధేయ, అహింసామార్గంలో ఉద్యమిస్తున్న అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్రకు జగన్‌ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు.

Updated Date - 2021-10-30T05:22:05+05:30 IST