మైలవరం అయ్యేదెన్నడు..?

ABN , First Publish Date - 2021-05-31T05:23:52+05:30 IST

మైలవరం జలాశయం సామర్థ్యం 10 టీఎంసీలు. ఎగువన గండికోట జలాశయం నిర్మించడంతో 6.70 టీఎంసీలకు తగ్గింది. మైలవరం, జమ్మలమడుగు, పెద్దముడియం, ప్రొద్దుటూరు, రాజుపాలెం,

మైలవరం అయ్యేదెన్నడు..?

మైలవరం ప్రాజెక్టుపై పాలకుల నిర్లక్ష్యం

అసంపూర్తి కాలువలు, డ్యాం మరమ్మతులకు రూ.40 కోట్లతో ప్రతిపాదన

బడ్జెట్లో ఇచ్చింది రూ.2 కోట్లే

కళ్ల ముందు నీళ్లున్నా.. చివరి ఆయకట్టు రైతులకు కన్నీళ్లే

కుంగిపోతున్న జలాశయం ఆనకట్ట రాతిపరుపు

నీళ్లు రావని కాలువలు చదును చేసిన రైతులు


కళ్ల ముందే పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టు ఎగువన గండికోటలో 24 టీఎంసీల కృష్ణా జలాలు నిల్వ చేశారు. ఆ నీటిని కరువు నేలకు మళ్లిస్తే హరిత చందనం పండించవచ్చు. అయితే.. పాలకుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. కళ్లముందే నీటి వనరులు పుష్కలంగా ఉన్నా పంటలు తడపలేని దైన్యం. అసంపూర్తి కాలువులు పూర్తి చేయలేదు. డ్యాం మరమ్మతులకు రూ.37 కోట్లు నిధులివ్వండి అని గతేడాది ప్రతిపాదనలు పంపినా కనికరించలేదు. పెరిగిన ధరలతో అంచనా వ్యయం పెరుగుతుందే తప్పా బడ్జెట్లో నిధుల కేటాయింపులు పిసరంతే. ఈ ఏడాది కేవలం రూ.2 కోట్లే ఇచ్చారు. నిర్వహణకు కూడా సరిపోవు. అసంపూర్తి కాలువులు పూర్తి అయ్యి, ఈ ఖరీఫ్‌కైనా సాగునీరు వస్తుందని ఆశించిన మైలవరం ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులకు కన్నీళ్లే మిగిలాయి. మైలవరం ప్రాజెక్టు తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనం.


(కడప-ఆంధ్రజ్యోతి): మైలవరం జలాశయం సామర్థ్యం 10 టీఎంసీలు. ఎగువన గండికోట జలాశయం నిర్మించడంతో 6.70 టీఎంసీలకు తగ్గింది. మైలవరం, జమ్మలమడుగు, పెద్దముడియం, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఎర్రగుంట్ల, కమలాపురం మండలాలు, కర్నూలు జిల్లా సంజామల, చాగలమర్రి మండలాల్లో 75 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. తుంగభద్ర ప్రాజెక్టు ఎగువ కాలువ (టీబీపీ హెల్‌ఎల్‌సీ) స్టేజ్‌-2లో భాగంగా 1968-69లో చేపట్టి 1981-82లో జలాశయం నిర్మాణం పూర్తి చేశారు. 1985-86లో ఉత్తర, దక్షిణ కాలువలు, డిసి్ట్రబ్యూటరీల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. దీనిని గాలేరు-నగరి ప్రాజెక్టులో విలీనం చేశారు. ప్రాజెక్టు పూర్తయి దశాబ్దాలు గడిచినా నేటికీ చివరి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేని దైన్యం. పాలకుల చిత్తశుద్ధి లోపం, నిధుల కొరతే ఇందుకు ప్రధాన కారణం.


రూ.40 కోట్లు అడిగితే ఇచ్చింది రూ.2 కోట్లే

మైలవరం ప్రాజెక్టు ఆధునికీకరణలో భాగంగా జలాశయం ఇంప్రూవ్‌మెంట్‌, ఉత్తర, దక్షిణ కాలువల ఆధునికీకరణకు 2005 మే 25న అప్పటి ప్రభుత్వం రూ.145.45 కోట్లు ఇచ్చింది. ఉత్తర కాలువ ఆధునికీకరణ ప్యాకేజీ 90 కింద రూ.77.44కోట్లతో చేట్టారు. 94 శాతం పనులు పూర్తి చేసిన కాంట్రాక్ట్‌ సంస్థ పనులు మధ్యలోనే వదిలేసింది. ప్యాకేజీ-91 కింద రూ.75.57 కోట్లతో చేపట్టిన దక్షిణ కాలువ ఆధునికీకరణ, రిజర్వాయరు ఇంప్రూవ్‌మెంటు పనులు హిందుస్థాన, రత్నం సంస్థలు జాయింట్‌ వెంచర్‌గా చేపట్టి 66 శాతం చేసి చేతులెత్తేశాయి. దాదాపు రూ.24-25 కోట్ల పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. అసంపూర్తి పనులకు తాజా రేట్ల ప్రకారం సుమారుగా రూ.30 కోట్లు అవసరమని ఇంజనీర్లు పేర్కొన్నారు. జలాశయం ఆనకట్ట రాతి పరుపు కుంగిపోతోంది. క్రస్ట్‌ గేట్లు తుప్పుపట్టాయి. మరమ్మతులు చేయలేదు. రక్షణ గోడలు ప్రమాదకరంగా మారాయి. డ్యాం నిర్వహణకు మరో రూ.10 కోట్లకు పైగా నిధులు కావాల్సి వస్తుందని ఇంజనీరింగ్‌ అధికారులు వివరిస్తున్నారు. ఈ ప్రతిపాదనలకు కదలిక లేదు. గత ఏడాది బడ్జెట్‌లో తీరని అన్యాయం చేసిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 2021-22 బడ్జెట్లోనైనా అవసరమైన మేరకు నిధులు ఇస్తారని రైతులు ఆశించారు. కేవలం రూ.2 కోట్లు మాత్రమే ఇచ్చారు.


కళ్ల ముందే నీళ్లున్నా.. రైతు కంట కన్నీరే

మైలవరం, గండికోట జలాశయాల్లో గత ఏడాది పూర్తి స్థాయి సామర్థ్యం 33.5 టీఎంసీలు నిల్వ చేశారు. గండికోట గేట్లెత్తితే మైలవరం జలాశయంలోకి నీళ్లు వస్తాయి. ప్రస్తుతం రెండు జలాశయాల్లో సుమారుగా 28 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కళ్ల ముందే నీళ్లు ఉన్నా ఆయకట్టకు పారించలేని దైన్యపరిస్థితి. ఏళ్లు గడిచినా సాగునీరు అందకపోవడంతో ఈ నీళ్లు ఇక రావని కొందరు రైతులు మట్టి కాలువలను చదును చేసి పంట పొలంలో కలిపేసుకున్నారు. అయితే గత ఏడాది సీఎం జగన ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. బలవంతంగా తాళ్లప్రొద్దుటూరు గ్రామాన్ని ఖాళీ చేయించి గండికోటలో 27 టీఎంసీలు నిల్వ చేశారు. తాళ్ల ప్రొద్దుటూరు గ్రామస్తులకు క్షమాపణ కూడా చెప్పారు. అయితే.. కాలువలు లేకపోవడం, ఉన్న కాలువల పూడిక, ముళ్ల కంపలు, జమ్ముతో నిండిపోవడంతో ఆయకట్టకు సాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా పనులు పూర్తిచేసి ఈ ఏడాదైనా సాగునీరు ఇస్తారని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. ప్రతిష్టాత్మకంగా గండికోట ప్రాజెక్టును నీటితో నింపినా కరువు నేల తడపలేని పరిస్థితి. సీఎం జగన క్షమాణకు సార్థకం చేకూరాలంటే అసంపూర్తి కాలువలు పూర్తి చేసేందుకు, ఉన్న కాలువల మరమ్మతులకు తక్షణ నిధులు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.


ప్రతిపాదనలు పంపాం

- మధుసూదనరెడ్డి, ఎస్‌ఈ, గాలేరు-నగరి ప్రాజెక్టు, కడప

మైలవరం జలాశయం మరమ్మతులు, ఉత్తర, దక్షిణ కాలువల అసంపూర్తి పనులు, మరమ్మతులకు తాజా రేట్ల ప్రకారం సుమారుగా రూ.40 కోట్లు కావాలి. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే పనులు చేపడతాం.



Updated Date - 2021-05-31T05:23:52+05:30 IST