చివరి అస్త్రం..!
ABN , First Publish Date - 2021-10-29T05:50:59+05:30 IST
బద్వేలు ఉప ఎన్నికలో మొత్తం ఓటర్లు 2,12,730 మంది ఉన్నారు. వారిలో పురుషులు 1,06,650, మహిళలు 1,06,069, ఇతరులు 20 మంది ఉన్నారు. ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏడు మండలాల్లో 281 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పోలింగ్ వ్యూహాలకు పదును
సరిహద్దు జిల్లాల్లో మకాం వేసిన కీలక నేతలు
అక్కడి నుంచే బద్వేలు ఉపపోరుకు చక్రం తిప్పుతున్న వైనం
మరోపక్క పకడ్బందీ ఏర్పాట్లల్లో ఎన్నికల యంత్రాంగం
బందోబస్తుకు 2 వేల పోలీసు సిబ్బంది
రేపే పోలింగ్
బద్వేలు ఉప ఎన్నిక కీలక ఘట్టమైన ఓటరు తీర్పుకు మరికొన్ని గంటలే మిగిలింది. శనివారం ఉదయం పోలింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల నియామవళికి అనుగుణంగా పకడ్బందీ ఏర్పాట్లు, బందోబస్తు చర్యలు దాదాపుగా పూర్తి చేశారు. మిగిలిన ప్రతి క్షణాన్ని ఓటరును ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రచారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ఉద్దండులే కాదు... జాతీయ నాయకులు సైతం రాజకీయ వేడి రాజేశారు. ప్రచార పర్వం ముగియడంతో ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించిన కీలక నాయకులు నియోజకవర్గాన్ని దాటి వెళ్లిపోయారు. సరిహద్దు జిల్లాల్లో మకాం వేసి అక్కడి నుంచే పోలింగ్ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు సమాచారం.
(కడప-ఆంధ్రజ్యోతి): బద్వేలు ఉప ఎన్నికలో మొత్తం ఓటర్లు 2,12,730 మంది ఉన్నారు. వారిలో పురుషులు 1,06,650, మహిళలు 1,06,069, ఇతరులు 20 మంది ఉన్నారు. ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏడు మండలాల్లో 281 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి కేంద్రానికి ఈవీఎం మిషన్, వీవీ ప్యాడ్స్ సమకూర్చడంతో పాటు ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే తక్షణం సమకూర్చేందుకు 10 శాతం మిషన్లు అదనంగా సమకూర్చారు. పోలింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్ సిబ్బందితో కలిపి 1124 మంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీరు, క్యూలైన్లు, షామియానా, మరుగుదొడ్లు, విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక ర్యాంప్స్ వంటి ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయరామరాజు, బద్వేలు ఉప ఎన్నిక అధికారి, రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్‌గార్గ్ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల సామాగ్రి, ఈవీఎం యంత్రాలు, వీవీ ప్యాడ్స్ సరఫరా చేసి ప్రత్యేక వాహనాల్లో శుక్రవారం సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు తరలించే సన్నాహాలు చేస్తున్నారు.
భారీ బందోబస్తు
ఉప ఎన్నికల్లో 281 పోలింగ్ కేంద్రాలు ఉంటే అందులో సగానికి పైగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 148 ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2 వేల మంది పోలీసు సిబ్బందితో ఎస్పీ కేకేఎన అన్బురాజన్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పోలీసు సిబ్బందితో పాటు 15 కంపెనీల సెంట్రల్ ఫోర్స్ విధుల్లో పాల్గొననుంది. 11 మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, 119 మంది ఎస్‌ఐల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసీ ఎన్నికల నిబంధనల మేరకు అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
రూ.కోటి నగదు సీజ్
సెప్టెంబరు 28న ఉప ఎన్నికల షెడ్యూలు జారీతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచే ఎస్పీ పర్యవేక్షణలో 20 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న రూ.కోటి నగదును సీజ్ చేశారు. అక్రమ మద్యం రవాణాపై దాడులు చేసి 94 కేసులు నమోదు చేశారు. 500 లీటర్ల అక్రమ మద్యం సీజ్ చేశారు. నాటుసారా స్థావరాలపై దాడులు చేసి బెల్లంఊట, సారాను ధ్వంసం చేశారు. అలాగే ఎలాంటి రికార్డులు లేకుండా రవాణా చేస్తున్న రూ.60 లక్షల విలువ చేసే బంగారు, వెండి తదితర ఆభరణాలను సీజ్ చేశారు.
సరిహద్దు జిల్లాల్లో తిష్ఠవేసి
ఉప ఎన్నిక ప్రచార పర్వం బుధవారం సాయంత్రం 7 గంటలకు ముగిసింది. అప్పటి వరకు ప్రధాన పార్టీలు వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచార స్టార్ క్యాంపెయినర్లుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ప్రచారాలతో హోరెత్తించారు. బుధవారం రాత్రికి ప్రచారానికి తెరపడింది. ఎన్నికల నిబంధనల మేరకు ప్రచారం ముగిశాక స్థానికేతరులు నియోజకవర్గంలో ఉండకూడదు. దీంతో బుధవారం రాత్రికే వారు నియోజకవర్గం కేంద్రం దాటి వెళ్లిపోయారు. అధికార పార్టీ ఇన్‌చార్జిలుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం తమ ప్రాంతాలకు చేరుకున్నారు. అయితే కీలక నాయకులు, వైసీపీ వ్యూహకర్తలు చివరి అస్త్రంగా పోలింగ్ వ్యూహాలకు పదును పెట్టారు. సరిహద్దు జిల్లాల్లో అక్కడక్కడా మకాం వేసి అక్కడి నుంచే చక్రం తిప్పుతున్నారు. అదే క్రమంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లను నియమించి అధికార పార్టీ పోలింగ్ దౌర్జన్యాలను అడ్డుకోవాలని బీజేపీ నాయకులు వ్యూహాలు రచిస్తుంటే, మెజార్టీ పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యర్థి అభ్యర్థులకు ఏజెంట్లు కూడా లేకుండా చేసి పోలింగ్ ఏకపక్షం చేసుకోవాలని ఆధికార పక్షం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.