మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి

ABN , First Publish Date - 2021-02-02T04:51:47+05:30 IST

నేటి నుంచి జరగనున్న రెండవ దశ నామినేషన్‌ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో కొనసాగించి ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సబ్‌ కలెక్టర్‌ పృథ్వీతేజ్‌ అన్నారు.

మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి
సమావేశంలో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ పృథ్వీతేజ్‌

సబ్‌ కలెక్టర్‌ పృథ్వీతేజ్‌

కమలాపురం, ఫిబ్రవరి 1: నేటి నుంచి జరగనున్న రెండవ దశ నామినేషన్‌ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో కొనసాగించి ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సబ్‌ కలెక్టర్‌ పృథ్వీతేజ్‌ అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లకు, ఎంపీడీవోలకు, పోలీసు సిబ్బంది, తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల విజయవంతానికి ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు దిశ, నిర్దేశం చేశారు. నామినేషన్‌ ప్రక్రియ స్ర్కూట్నీ, ఉపసంహరణ, తుది జాబితా రూపొందించుట, పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియల గురించి సూచనలు, సలహాలు ఇచ్చారు. కడప డీఎస్పీ సునీల్‌, నియోజకవర్గ స్పెషల్‌ ఆఫీసర్‌ చిన్నరాముడు, డీఎల్‌పీవో మస్తాన్‌వలి, నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ

మండల పరిధిలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. మండలంలో 18 పంచాయతీలు ఉండగా అందులో సి.గోపులాపురం పంచాయతీ ఎన్నిక వాయిదా పడింది. ఈ పంచాయతీలన్నీ మీనాపురం గ్రామం, కమలాపురం మున్సిపాలిటీలో కలవడంతో అందుకు సంబంధించి పలువురు కోర్టుకు వెళ్లడంతో ఈ పంచాయతీ ఎన్నికను కోర్టు ఆదేశాల మేరకు వాయిదా వేశారు. మిగిలిన పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 


చెన్నూరులో...

మండలంలోని పది గ్రామ పంచాయతీల్లో మంగళవారం నుంచి నామినేషన్లు వేయనున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఎంపీడీవో పి.మహబూబ్‌బీ అన్నారు. ఈ మేరకు సోమవారం తన కార్యాలయంలో రిటర్నింగ్‌ ఆఫీసర్లు, అదనపు రిటర్నింగ్‌ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. మొత్తం 126 పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయని, 28,286 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవచ్చని, అందులో పురుషులు 13804, స్ర్తీలు 14480 మంది, ట్రాన్స్‌జెండర్లు ఇద్దరు ఉన్నారని తెలిపారు. అలాగే ఆర్వో, ఏఆర్వోలకు ఎన్నికల్లో నిర్వహించాల్సిన బాధ్యత గురించి క్షుణ్ణంగా తెలిపారు.


వీరపునాయునిపల్లెలో...

మండలంలోని 21 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న 8 క్లస్టర్ల పరిధిలో నామినేషన్ల ప్రక్రియ మంగళవారం నుంచి మొదలు కానుందని ఎంపీడీఓ విజయమ్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.. ఈ సందర్భంగా క్లస్టర్లను ఏర్పాటు చేసి రిటర్నింగ్‌ ఆఫీసర్లను నియమించామని, నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. 


పెండ్లిమర్రిలో...

మండల పరిధిలోని 19 గ్రామ పంచాయతీలు, 190 వార్డు మెంబర్ల నామినేషన్లకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఎంపీడీవో మాట్లాడుతూ స్టేజ్‌-1 ఆఫీసర్లకు నామినేషన్ల స్వీకరణపై సమావేశం నిర్వహించారు. మండల పరిధిలో 19 గ్రామ పంచాయతీలను 8 క్లస్టర్లుగా విభజించామని, 2 నుంచి 4వ తేది వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ అల్తాఫ్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-02T04:51:47+05:30 IST