ప్రేమ వ్యవహారం వద్దన్నందుకు తిండి మానేసింది

ABN , First Publish Date - 2021-07-27T05:17:01+05:30 IST

తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయాలంటూ కుటుంబ సభ్యులను కోరడంతో వారు ససేమిరా అన్నారు. దీంతో ఆ యువతి ఇంట్లోకెళ్లి తలుపులు వేసి మూడు రోజులుగా తిండి మానేసింది.

ప్రేమ వ్యవహారం వద్దన్నందుకు  తిండి మానేసింది

ఎస్పీ చొరవతో ఆ యువతికి దిశ పోలీసుల కౌన్సిలింగ్‌

కడప (క్రైం), జూలై 26 : తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయాలంటూ కుటుంబ సభ్యులను కోరడంతో వారు ససేమిరా అన్నారు. దీంతో ఆ యువతి ఇంట్లోకెళ్లి తలుపులు వేసి మూడు రోజులుగా తిండి మానేసింది. చివరకు పోలీసులు కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో మంకు పట్టువీడింది. వివరాలు ఇలా..

కడప నగరానికి చెందిన ఓ యువతి డిగ్రీ చదువుతోంది. తమ ప్రాంతానికే చెందిన యువకుడిని ప్రేమించింది. ఇంట్లో ఆ విషయం చెప్పి తమకు పెళ్లి చేయాలని కోరింది. ఇంట్లో వాళ్లు వద్దని చెప్పడంతో నాలుగురోజుల క్రితం ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వేట్రాక్‌ వద్దకు వెళ్లింది. గుర్తించిన పోలీసులు యువతిని పోలీస్‌స్టేష్‌నకు తీసుకొచ్చి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాగా చదువుకోవాలని చెప్పి ఇంటికి పంపించారు. అప్పటి నుంచి యువతిపై కుటుంబసభ్యులు కట్టడి పెంచారు. ఇంట్లో వాళ్లు తమ పెళ్లికి ఒప్పుకోలేదని, పోలీసులు కూడా తనకు సహకరించడం లేదంటూ ఆ యువతి గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. మూడురోజులుగా తిండి తినలేదు. దీంతో యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు దిశ డీఎస్పీ రవికుమార్‌, మహిళా ఎస్‌ఐ లక్ష్మీదేవి, సిబ్బంది సోమవారం యువతి ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ప్రేమ వ్యవహారంతో చదువును నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని, చదువు పూర్తిచేసి నీ కాళ్లపై నీవు నిలబడితే మంచి భవిష్యత్తు ఉంటుందని నచ్చ చెప్పారు. ఉద్యోగం తెచ్చుకుంటే తామే దగ్గరుండి పెళ్లి చేస్తామని, తిండి మానివేసి పస్తులు ఉండడం మంచిది కాదని అన్నారు. తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్‌ ఇచ్చారు. చివరకు ఆ యువతి మొండితనం వీడి ఆహారం తీసుకుంది. మహిళలకు ఏవైనా సమస్య ఉంటే దిశ పోలీసుస్టేషన్‌ అండగా ఉంటుందని, 9440796900కు ఫోను చేసి ఫిర్యాదు చేస్తే తక్షణం స్పందిస్తామని ఎస్పీ కేకేఎన అన్బురాజన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2021-07-27T05:17:01+05:30 IST