కాల్వలోకి దిగి కంప్యూటర్ ఆపరేటర్ మృతి
ABN , First Publish Date - 2021-03-22T04:19:15+05:30 IST
ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందాలని సోమశిల ప్రాజెక్టు కాల్వలో దిగిన కె.రవిశంకర్ (40) మృత్యువాత పడ్డాడు, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

గోపవరం, మార్చి21: ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందాలని సోమశిల ప్రాజెక్టు కాల్వలో దిగిన కె.రవిశంకర్ (40) మృత్యువాత పడ్డాడు, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం మేరకు వివ రాల్లోకెళితే... స్థానిక కృష్ణదేవరాయ నగర్ వాసులు కె.రవిశంకర్ ఇద్దరు మిత్రులు వినోద్, విష్ణుతో కలిసి పని నిమిత్తం సోమశిల ఉత్తరకాల్వ కట్ట మీదుగాల సోమశిలకు బైకులో వెళుతున్నారు. అయితే నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం చిలకలమర్రి వద్దకు వెళ్లే సమయానికి మధ్యాహ్నం ఒంటిగంట అవుతోంది. కాగా ఎండవేడిమి తీవ్రంగా ఉండడంతో వేడిమి నుంచి ఉపశమనం పొందాలని సోమశిల ప్రాజెక్టు కాల్వలో ముగ్గురూ ఈతకోసం దిగారు. కాగా కాల్వలో నీటి ఒరవడి ఎక్కువకావడంతో ముగ్గురూ కొట్టుకు పోయారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నంలో ఇద్దరిని ఒడ్డుకు చేర్చగలిగినా రవిశంకర్ మృత్యువాత పడ్డాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడు రవిశంకర్ 15 ఏళ్లగా గోపవరం ఎంఈఓ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న అనంతసాగరం పోలీసులు, సోమశిల ఎస్‌ఐ సుబ్బారావు సంఘటనా స్థలానికిచేరుకుని పరిశీలించారు. సోమశిల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రవిశంకర్ మృతితో గోపవరం మండల ఉపాధ్యాయ సంఘనేతలు, పలువురు ఉపాధ్యాయులు సంఘటనాస్థలానికి బయలుదేరి వెళ్లారు. ఎంఈఓ చెన్నయ్య ఈ సంఘటన పట్ల దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూరుకు తరలించారు.