ప్రలోభాలకు సై..!

ABN , First Publish Date - 2021-10-28T05:46:09+05:30 IST

బద్వేలు ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయకపోవడంతో వైసీపీ గెలుపు ఏకపక్షమే అనుకున్నారు. అయితే.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అభ్యర్థులను బరిలో దింపాయి. టీడీపీ అధికారంలో ఉండగా నాటి మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ జిల్లాలో రాజకీయంగా కీలకచక్రం తిప్పారు.

ప్రలోభాలకు సై..!

బద్వేలులో ముగిసిన ప్రచార పర్వం

మిగిలిన గడువు 60 గంటలే

ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ ఎత్తులు

ఓటుకు రేటు కట్టేందుకు సిద్ధం..?

గెలుపు కోసం ప్రధాన పార్టీల చివరి అస్త్రం


బద్వేలు ఉప పోరులో కీలక ఘట్టం ముగిసింది. బుధవారం సాయంత్రం ఏడు గంటలకు ప్రచార పర్వానికి తెరపడింది. ప్రచార రథాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. క్షణం తీరిక లేకుండా గడిపిన ప్రఽధాన పార్టీల స్టార్‌ క్యాంపెయినర్లు విశ్రాంతి తీసుకున్నారు. మిగిలిన సమయం 60 గంటలే. విజయానికి కీలక సమయం. ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రలోభాలకు తెరతీస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాను ముందు పెట్టుకుని ఏ గ్రామంలో బలంగా ఉన్నాం.. ఏ గ్రామంలో బలహీనంగా ఉన్నాం..! అక్కడ ఎలాంటి ఎత్తులు వేస్తే మెజార్టీ ఓట్లు వస్తాయ్‌..? వ్యూహరచన చేయడంతో పాటు తక్షణ అమలుపై దృష్టి పెట్టారు.


(కడప - ఆంధ్రజ్యోతి): బద్వేలు ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయకపోవడంతో వైసీపీ గెలుపు ఏకపక్షమే అనుకున్నారు. అయితే.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అభ్యర్థులను బరిలో దింపాయి. టీడీపీ అధికారంలో ఉండగా నాటి మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ జిల్లాలో రాజకీయంగా కీలకచక్రం తిప్పారు. వారు శాసించిందే జిల్లాలో నాడు జరిగిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. టీడీపీ అధికారం కోల్పోవడం, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో టీడీపీలో చక్రం తిప్పిన ఆ ఇద్దరు నాయకులు బీజేపీలో చేరారు. ఆ పార్టీలో కూడా కీలక నాయకులుగా ఎదిగారు. దీంతో జిల్లాలో వచ్చిన ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో గెలుపు ఏకపక్షమే అనుకున్న వైసీపీ విజయంకోసం పదునైన వ్యూహాలు రచించి అమలు చేయాల్సి వస్తోంది. రాయలసీమలో కీలక మంత్రులు ఇక్కడే తిష్టవేసి ప్రచారంలో దూకుడు పెంచారు. అయినా.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తామేమి తక్కువ కాదని అధికార పార్టీని దీటుగా ఢీకొట్టాయి.


భారీ మెజార్టీ దిశగా వైసీపీ వ్యూహం

బద్వేలు నియోజకవర్గంలో బద్వేలు మున్సిపాలిటీ, గోపవరం, పోరుమామిళ్ల, బి.కోడూరు, కాశినాయన, పోరుమామిళ్ల, కలసపాడు మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో సర్వీస్‌ ఓటర్లతో కలిపి 2,16,139 మంది ఉన్నారు. వారిలో మహిళలు 1,07,340 మంది, పురుషులు 1,08,777 మంది ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నిక తరహాలో భారీగా పోలింగ్‌ జరిగే అవకాశం ఉందని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. 85 శాతం పోలింగ్‌ జరిగితే 1,83,718 ఓట్లు, 75 శాతం పోలింగ్‌ జరిగితే 1,29,683 ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో 1,50,621 ఓట్లు పోలైతే.. వైసీపీ అభ్యర్థి వెంకటసుబ్బయ్యకు 95,482 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్‌కు 50,748 ఓట్లు వచ్చాయి. 44,734 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఆయన మరణం వల్ల వచ్చిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి డాక్టరు సుధాను వైసీపీ బరిలోకి దింపింది. రాజకీయ సంప్రదాయానికి కట్టుబడి టీడీపీ పోటీ నుంచి విరమించుకుంది. దీంతో టీడీపీ ఓట్లను కూడా తమ ఖాతాలోకి వేసుకుని లక్ష పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాలన్నది వైసీపీ వ్యూహం. అది సాకారం కావాలంటే 85 శాతానికి పైగా పోలింగ్‌ జరిగేలా రాజకీయ వ్యూహాలకు అధికార పార్టీ పదును పెడుతోంది. అయితే.. వైసీపీ వ్యూహాలను చిత్తుచేసి టీడీపీ ఓటర్లను తమ వైపు తిప్పుకొని వైసీపీకి భారీగా గండికొట్టాలని ఓ పక్క బీజేపీ, మరోపక్క కాంగ్రె్‌స పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. దీనికి తోడు నిన్నటి వరకు ఎన్నికకు దూరంగా ఉన్న జనసేన స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోమని అధిష్టానం సూచించడంతో జిల్లా నాయకత్వం బీజేపీకి మద్దతు ప్రకటించింది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి సీపీఐ మద్దతు ప్రకటించింది. దీంతో ఈ రెండు పార్టీలకు ఇంకాస్త బలం పెరిగింది.


ప్రలోభాలకు సై అంటున్న నేతలు

అధికార పార్టీ వైసీపీ నాయకులు ఓటర్లను ఆకట్టుకోవడానికి చివరి అసా్త్రలను సంధిస్తున్నారు. 15 రోజుల నుంచి బద్వేలు కేంద్రంగా తిష్ట వేసిన కీలక నాయకులు ఓ పక్క ప్రచారం.. మరో పక్క కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ హామీలకు రెక్కలు తొడిగారు. బాగా పనిచేసిన నాయకులకు వివిధ కులాల కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న డైరెక్టరు పోస్టులు, ఇతర నామినేటెడ్‌ పోస్టులు ఇప్పిస్తామని హామీలు ఇచ్చినట్లు సమాచారం. ఓ మోస్తరు నాయకుడైతే ఏకంగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితోనే మాట్లాడించి వరాలు కురిపించారని విశ్వసనీయ సమాచారం. టీడీపీ పోటీలో లేకపోవడంతో మండల, గ్రామ స్థాయిలో పట్టున్న టీడీపీ నాయకులకు గత ప్రభుత్వంలో చేసిన పనుల బిల్లులను బద్వేలు ఉప ఎన్నిక తరువాత క్లియర్‌ చేస్తాం.. ఈ ఎన్నికలో సహకరించాలని ఆఫర్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. పోలింగ్‌కు ఒకరోజు ముందు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఓటుకు రేటు కట్టి ప్రలోభాలకు తెరతీసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక బీజేపీ నాయకులు కూడా ఓ అడుగు ముందుకేసి ఓటర్లను తమ వైపు తిప్పుకోవడమే కాదు.. ప్రతి గ్రామంలో ఏజెంట్లను నిలబెట్టేందుకు రాజకీయంగా పావులు కదుపుతున్నారు. ఈ బాధ్యతను గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన జిల్లాకు చెందిన బీజేపీ ముఖ్య నాయకుడికి అప్పగించినట్లు సమాచారం. వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ ఓట్ల వేటలో సామాన్య ఓటర్లే కాదు.. టీడీపీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో..? తేలాలంటే 30వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.


బద్వేలులో ఉద్రిక్తత

పోటాపోటీగా నినాదాలు  

బద్వేలు,అక్టోబరు 27: ఉప ఎన్నికకు చివరి రోజు అయిన బుధవారం బద్వేలులోని గుంతపల్లె క్రాస్‌రోడ్డు నుంచి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నగిరి ఎమ్మెల్యే రోజాతో రోడ్‌షో నిర్వహించారు. బీజేపీ కార్యాలయం వద్దకు రోడ్‌షో వాహనం చేరుకోగానే వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వైసీపీ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు కూడా బీజేపీ జిందాబాద్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇరుపార్టీల కార్యకర్తలు బాహాబాహికి దిగారు. వెంటనే  పోలీసులు రంగప్రవేశం చేసి ఇరుపార్టీ కార్యకర్తలను చెదరగొట్టి సమస్యను అదుపులోకి తీసుకువచ్చారు. వైసీపీ, బీజేపీ పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ విజిల్స్‌ వేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం వైసీపీ రోడ్‌షో వాహనం వెళ్లిపోయింది.Updated Date - 2021-10-28T05:46:09+05:30 IST