ఉద్యానం.. దయనీయం!

ABN , First Publish Date - 2021-08-21T05:24:11+05:30 IST

కడప అంటేనే గుర్తుకొచ్చేది ఉద్యాన పంటలే. అరటి, మామిడి, బొప్పాయి, చీనీ, దానిమ్మ.. వంటి పండ్ల తోటల సాగులో ప్రసిద్ధి. వ్యవసాయ పంటలు 1.06 లక్షల హెక్టార్లలో సాగు చేస్తే.. ఉద్యాన పంటలు

ఉద్యానం.. దయనీయం!
రైల్వేకోడూరు మండలంలో సాగులో ఉన్న బొప్పాయి

మూడేళ్లుగా అందని సబ్సిడీ

గత టీడీపీ ప్రభుత్వంలో క్రమం తప్పక రాయితీ

2019 సెప్టంబరు నుంచి రైతు ఖాతాలో జమకాని సాయం

జిల్లాలో సుమారు రూ.20 కోట్లకు పైగా బకాయి

రాయితీ డబ్బు అందక ఉసూరుమంటున్న ఉద్యాన రైతులు


వాణిజ్య పంటల సాగుతో రైతులు నష్టపోతున్నారు. జూదంగా మారిన వ్యవసాయంతో పెట్టుబడి కూడా గిట్టుబాటు కాక అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాణిజ్య పంటల స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. మామిడి, అరటి, బొప్పాయి తదితర పండ్ల తోటల సాగుకు 40 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో క్రమం తప్పక రాయితీ డబ్బు అందేది. సీఎం జగన ప్రభుత్వం వచ్చాక మూడేళ్లుగా రాయితీ అందక ఉద్యానం ఉసూరుమంటోంది. జిల్లాలో దాదాపు రూ.20 కోట్లకుపైగా బకాయి ఉన్నట్లు అంచనా. ఆ వివరాలపై ప్రత్యేక కథనం.


(కడప-ఆంధ్రజ్యోతి): కడప అంటేనే గుర్తుకొచ్చేది ఉద్యాన పంటలే. అరటి, మామిడి, బొప్పాయి, చీనీ, దానిమ్మ.. వంటి పండ్ల తోటల సాగులో ప్రసిద్ధి. వ్యవసాయ పంటలు 1.06 లక్షల హెక్టార్లలో సాగు చేస్తే.. ఉద్యాన పంటలు 95,455 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. గత ప్రభుత్వాలు పండ్ల తోటల సాగును ప్రోత్సహించడంతో వివిధ ఉద్యాన పంటల సాగుపై అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. అయితే.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2019 సెప్టంబరు నుంచి ఉద్యాన పంటల సాగులో రైతులకు ఇవ్వాల్సిన 40 శాతం రాయితీ అందడం లేదు. మొక్కలు నాటింది మొదలు పంట చేతికొచ్చి.. ఆ పంటను మార్కెట్లో విక్రయించే వరకు రైతులు పడుతున్న అవస్థలు ఎన్నో. పెట్టుబడి కోసం అప్పులు.. చీడపీడల నుంచి పంటను కాపాడుకోవడం.. తుఫాన, ఈదురు గాలులు, అతి వర్షాలు.. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కొంతైనా భరోసాగా ఉంటుందనుకుంటే మూడేళ్లగా రాయితీ డబ్బు అందక ఆఫీసుల చుట్టూ రైతులు ప్రదిక్షణలు చేస్తున్నారు.


రూ.20 కోట్లకుపైగా బకాయి

గత ప్రభుత్వంలో రైతులకు రాయితీని ఉద్యాన శాఖ అధికారులే ఇచ్చేవారు. ప్రస్తుతం సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా రైతుల ఖాతాలో నేరుగా నగదు చేరుతోంది. ఏ రైతుకు సబ్సిడీ జమ అయ్యిందో.. ఏ రైతుకు జమ కాలేదో.. తమ వద్ద స్పష్టత లేదని అధికారులే అంటున్నారు. అయితే.. ఉద్యాన శాఖ కడప, రాజంపేట డివిజన్ల పరిధిలో సుమారుగా రూ.25 కోట్లకు పైగా రాయితీ  బకాయి ఉందని అంటున్నారు. ఏప్రిల్‌, జూన నెలల్లో కొన్ని పథకాల కింద కొందరు రైతులకు సుమారుగా రూ.5 కోట్ల వరకు జమ అయి ఉంటుందని సమాచారం. నేరుగా సీఎ్‌ఫఎంఎస్‌ నుంచి రైతుల ఖాతాల్లో జమ కావడంతో ఎంత వచ్చింది అనే రికార్డులు అధికారుల వద్ద లేవు. కరోనా సమయంలో రవాణా లేక.. మార్కెట్‌ స్తంభించి ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికితోడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ప్రభుత్వమివాల్సిన రాయితీ ఇవ్వకపోవడంవల్ల ఉద్యాన రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యాన రాయితీ డబ్బు విడుదల చేయాలని కోరుతున్నారు.


రాయితీ కోసం నిరీక్షణ

- కాకర్ల రెడ్డయ్య, బొప్పాయి రైతు, మంగళంపల్లె, ఓబులవారిపల్లె మండలం

తొమ్మిది ఎకరాల్లో బొప్పాయి సాగు చేశాను. ఎకరాకు రూ.60-70 వేలు ఖర్చు చేశాను. ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్‌ ధరపై 40 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. దాదాపుగా రూ.90 వేలకుపైగా సబ్సిడీ రావల్సి ఉంది. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఉద్యాన శాఖ అధికారులను అడిగితే బిల్లు ప్రభుత్వానికి పంపాం.. నేరుగా బ్యాంక్‌ ఖాతాల్లో జమ అవుతుందని అంటున్నారు. ఎప్పుడిస్తారో.. ఏమో. మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే సబ్సిడీ డబ్బు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. 


మా గోడు పట్టించుకోరా

- నన్నపనేని నరసింహులు, బొప్పాయి రైతు, బోటిమీదపల్లె, ఓబులవారిపల్లె మండలం

ఐదున్నర ఎకరాల్లో బొప్పాయి సాగు చేశాను. ఎకరాకు రూ.60 వేలకు పైగా ఖర్చు చేశాను. పంట చేతికొచ్చే సమయంలో దళారులు ఏకమై ధర తగ్గించారు. గిట్టుబాటు ధర అందక తీవ్రంగా నష్టపోతున్నాం. సబ్సిడీతో కొంతైనా ఉపశమనం కలుగుతుందని ఆశిస్తే ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు. అధికారులను అడిగితే ఏదో ఒకరోజు వస్తుంది అంటున్నారు.


సబ్సిడీ ఇవ్వలేదు.. పంట నష్టపరిహారం అందలేదు

- ఏ.దివాకరరెడ్డి, అరటి రైతు, లింగాల

ఆరు ఎకరాల్లో అరటి సాగు చేశాను. ఎకరాకు రూ.లక్షకు పైగా ఖర్చు చేశాను. అరటి నాటే సమయంలో ఎకరాకు రూ.16,500 సబ్సిడీ వస్తుందని అధికారులు చెప్పారు. రూ.లక్ష వరకు సబ్సిడీ రావాలి. ఏడాది దాటినా ఇప్పటికీ ఇవ్వలేదు. గత ఏడాది ఈదురు గాలులు, తుఫానకు పంట భారీగా దెబ్బతిన్నా పరిహారం కూడా అందలేదు. చేతికొచ్చిన అరకొర తొలి గెల పంట అమ్మకానికి వెళితే రూ.14-15 వేలు టన్ను పలకాల్సి ఉంటే.. కరోనా వల్ల రవాణా లేదని కేవలం రూ.2,500లకు అమ్ముకోవాల్సి వచ్చింది. అన్ని విధాలుగా నష్టపోయాను.


రైతుల ఖాతాల్లో జమ అవుతుంది

- ఎల్‌.వజ్రశ్రీ, డీడీ, ఉద్యాన శాఖ, కడప

ఉద్యాన రైతులకు రాయితీ బకాయి ఉన్నమాట వాస్తవమే. బిల్లులన్నీ ప్రభుత్వానికి పంపించాం. సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా నేరుగా రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ అవుతోంది. కొందరు రైతుల ఖాతాల్లో జమ అయింది. మిగిలిన రైతులకు రావాల్సి ఉంది. త్వరలో అందరి రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. 


పంటల వారీగా రాయితీ వివరాలు రూ.లక్షల్లో..

--------------------------

ఉద్యానపంట రాయితీ

--------------------------

మామిడి 13,300

అరటి 40,986

బొప్పాయి 24,662

చీనీ 16,004

దానిమ్మ 26,672

--------------------------


జిల్లాలో ఉద్యాన పంటల సాగు వివరాలు హెక్టార్లలో..

----------------------------------

పంటలు సాగు విస్తీర్ణం

----------------------------------

అరటి 20,000

మామిడి 26,000

చీనీ 18,000

నిమ్మ 3,083

దానిమ్మ 786

బొప్పాయి 5,095

జామ 5,045

--------------------------------

మొత్తం 78,009

కూరగాయలు 13,506

పూల సాగు 3,960

--------------------------------

మొత్తం 95,455

Updated Date - 2021-08-21T05:24:11+05:30 IST