కర్ఫ్యూ అతిక్రమిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-05-15T05:05:31+05:30 IST

కరోనా కట్టడిలో భాగంగా అమలులో ఉన్న కర్ఫ్యూను అతిక్రమించి బయట తిరిగితే కఠిన చర్యలు తప్పవని రాయచోటి రూరల్‌ సీఐ లింగప్ప హెచ్చరించారు.

కర్ఫ్యూ అతిక్రమిస్తే కఠిన చర్యలు
సుండుపల్లెలో ద్విచక్రవాహనదారులకు జరిమానా విధిస్తున్న రూరల్‌ సీఐ లింగప్ప

సుండుపల్లె, మే14: కరోనా కట్టడిలో భాగంగా అమలులో ఉన్న  కర్ఫ్యూను అతిక్రమించి బయట తిరిగితే కఠిన చర్యలు తప్పవని రాయచోటి రూరల్‌ సీఐ లింగప్ప హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం మండల కేంద్రమైన సుండుపల్లెలో కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా బస్టాండు కూడలిలో వాహనాలను తనిఖీ చేశారు. అత్యవసర పనులు లేకపోయినా ద్విచక్రవాహనాల్లో బయట తిరగరాదని వాహనదారులకు సూచించారు. ఈ సందర్భంగా మాసులు ధరించని, రికార్డులు లేని వాహనదారులకు జరిమానా విధించారు. 

లక్కిరెడ్డిపల్లె..: లక్కిరెడ్డిపల్లె మండలంలో కర్ఫ్యూ అమలు తీరును ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ పరిశీలించారు. శుక్రవారం ఆయన వాహనాలను నిలిపి అనవసరంగా రోడ్డుపైకి వస్తున్న  వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇప్పటికీ చాలాసార్లు అందరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చామని, అయినా కొంత మంది యువత అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారన్నారు. ఇక మీదుట వస్తే వాహనాలకు జరిమానా విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా పోలీసులకు సహకరించాలని, కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రజలందరి సహకారం అవసరమన్నారు. అనంతరం ఆయన కొంత మంది యువకులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్‌ సతీ్‌షకుమార్‌రాజు, రమేష్‌, శుభకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

రైల్వేకోడూరు..: కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని రైల్వేకోడూరు ఎస్‌ఐ-1 పెద్దఓబన్న హెచ్చరించారు. శుక్రవారం కొవిడ్‌ నిబంధనలను దుకాణ దారులు, వివిధ సంస్థలు పాటిస్తున్నాయా లేదా అని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వీధుల్లోకి అనవసరంగా రాకుండా ఉండాలన్నారు. కరోనా వైరస్‌ ఉధృతంగా ఉందని అందు వల్ల ప్రజలు పూర్తిగా సహకరించి ఇంటిలోనే ఉండాలన్నారు. శానిటైజర్లు ఉపయోగించాలని, పరిశుభ్రంగా ఉండాలన్నారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటివి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. కొవిడ్‌-19 నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2021-05-15T05:05:31+05:30 IST