ఆర్టీపీపీలో ఆగిన విద్యుత్ ఉత్పత్తి
ABN , First Publish Date - 2021-05-09T04:42:39+05:30 IST
రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో బొగ్గు నిల్వలు లేక ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.

బొగ్గులేదు... డిమాండ్ లేదు
ఎర్రగుంట్ల, మే 8: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో బొగ్గు నిల్వలు లేక ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. 210 మెగావాట్ల సామర్థ్యం గల 5 యూనిట్లు, 600 మెగావాట్ల సామర్థ్యం గల ఒక యూనిట్‌కు రోజుకు సుమారు 24 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. అయితే బొగ్గు నిల్వలు పూర్తిగా అడుగంటి పోయాయి. ఆర్టీపీపీకి సింగరేణి నుంచి వ్యాగన్ల ద్వారా, తాల్చేర్ నుంచి క్రిష్ణపట్నం పోర్టు ద్వారా అక్కడి నుంచి వ్యాగన్ల ద్వారా ఆర్టీపీపీకి బొగ్గు సరఫరా అవుతోంది. వారం రోజులుగా బొగ్గు రవాణా ఆగిపోవడంతో నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో ప్లాంటులోని ఆరు యూనిట్లను ఆపివేశారు. దీనికి తోడు విద్యుత్ డిమాండ్ కూడా లేకపోవడంతో 1650 మెగావాట్ల సామర్థ్యం గల అన్ని యూనిట్ల ఉత్పత్తిని నిలిపివేశారు. శనివారం సుమారు 20 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఆర్టీపీపీకి చేరుకుంది. అయినప్పటికి ఇది ఒక రోజుకు సరిపడే నిల్వ మాత్రమే. విద్యుత్ డిమాండ్ లేకపోవడంతో ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో శనివారం సాయంత్రం వరకు ఎలాంటి పనులు ఆర్టీపీపీలో ప్రారంభించలేదు.
ఆదేశాలొస్తేనే ఉత్పత్తి
ఆర్టీపీపీలో బొగ్గు నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయని సీఈ మోహన్‌రావు తెలిపారు. దీంతో అన్ని యూనిట్లను నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. శనివారం 20 వేల మెట్రిక్ టన్నులు బొగ్గు వచ్చినప్పటికి యూనిట్లు రన్ చేయాలని ఆదేశాలు రాలేదని, దీంతో ఉత్పత్తిని ప్రారంభించలేదని తెలిపారు.
ఆర్టీపీపీ ఉద్యోగులను కబళిస్తున్న కరోనా
ఆర్టీపీపీలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. శుక్రవారం ఇద్దరు, శనివారం ఒకరు ప్లాంటులో పనిచేసే ఉద్యోగులు మృతి చెందారు. దీంతో ఆర్టీపీపీలో కరోనా కలకలం మరింత పెరిగింది. ఇప్పటికే ప్లాంటులో 17 మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 100 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్లాంటుల్లోని ఆసుపత్రిలో కరోనాకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆర్టీపీపీలో కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని సీఈ మోహన్‌రావు తెలిపారు. కాలనీ అంతటా బ్లీచింగ్ రెండుసార్లు చల్లించి కార్యాలయాల్లో స్ర్పే చేశామన్నారు.