ఎంపీ, ఎమ్మెల్యేను అడ్డుకున్న స్టీల్‌ప్లాంట్‌ బాధిత రైతులు

ABN , First Publish Date - 2021-06-22T07:00:11+05:30 IST

మండలంలోని సున్నపురాళ్లపల్లెలో సోమవారం ఉదయం కడప ఎంపీ వైఎస్‌ అవినాశరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, వైసీపీ నాయకులను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. 2013లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇక్కడి భూమి లేని పేదలు 668 మందికి ఒక్కొక్కరికి ఒక ఎకరా చొప్పున పంపిణీ చేశారు.

ఎంపీ, ఎమ్మెల్యేను అడ్డుకున్న స్టీల్‌ప్లాంట్‌ బాధిత  రైతులు
సభాస్థలి వద్ద ఆందోళన చేస్తున్న బాధితులు

సభాస్థలి వద్ద బైఠాయించిన మహిళలు

బాధితులను అడ్డుకున్న పోలీసులు

జమ్మలమడుగు రూరల్‌, జూన 21: మండలంలోని సున్నపురాళ్లపల్లెలో సోమవారం ఉదయం కడప ఎంపీ వైఎస్‌ అవినాశరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, వైసీపీ నాయకులను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. 2013లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇక్కడి భూమి లేని పేదలు 668 మందికి ఒక్కొక్కరికి ఒక ఎకరా చొప్పున పంపిణీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మిస్తుండటంతో అందులో 6వ అసైనమెంట్‌లో ఉన్న 409 మంది రైతులకు చెందిన భూములకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.7.50 లక్షలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. 7వ అసైనమెంట్‌లో మిగిలిన 259 మంది రైతులు కూడా మాకు పాస్‌ పుస్తకాలు ఉన్నాయని పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆదివారం ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని సంప్రదించి వారి సమస్యలను ఆయన ఎదుట ఏకరువు పెట్టారు. ఎన్నికల సమయంలో మీకు న్యాయం చేస్తామని చెప్పి అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే తమను మోసం చేశారంటూ ఆరోపించారు. ఈ నేపధ్యంలో సున్నపురాళ్లపల్లెను సోమవారం ఎంపీ, ఎమ్మెల్యే సందర్శించి సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని అందరికీ ఒకేసారి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వారిని అడ్డుకుని బైఠాయించడంతో పోలీసులు బాధితులను పక్కకు నెట్టేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ అవినాశరెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకుల వద్దకు మీరు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. వెంటనే బాధితులు లేచి టీడీపీ నాయకులు లేకపోతే ఈ సమస్యను గాలికి వదిలేసేవారంటూ ఆరోపించారు. సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే సీఎం జగనమోహనరెడ్డి వద్దకు సమస్యను తీసుకెళ్లి న్యాయం చేసేందుకు ముందుంటామన్నారు. వెంటనే బాధితులు మాట్లాడుతూ ప్రస్తుతం 409 మందికి వచ్చిన చెక్కులను నిలిపివేసి అందరికీ ఒకేసారి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రెండు సంవత్సరాల తర్వాత తమ గ్రామంలోకి వచ్చి మళ్లీ మాయమాటలు చెప్పవద్దని, పరిహారం ఎప్పటిలోగా ఇస్తారని నిలదీశారు. వెంటనే పోలీసు అధికారులు, సిబ్బంది బాధితులను నెట్టివేసి కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. బాధితుల చుట్టూ పోలీసులు చుట్టుముట్టారు. ఏది ఏమైనా తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని మహిళలు గట్టిగా డిమాండ్‌ చేశారు. కొందరు బాధితులు మాట్లాడుతూ తమ గ్రామంలో లేనివారు మైదుకూరు, ప్రొద్దుటూరు, ముద్దనూరు, గూడెం చెరువు తదితర పట్టణాల్లో ఉన్నవారు పరిహారం పొందుతున్నారని ఆరోపించారు. తాము గ్రామంలో నివాసం ఉండి ఒక ఎకరా పొలం ఉన్నప్పటికీ పేర్లు లేవని చెప్పడం మమ్మల్ని మోసం చేయడమేనన్నారు. అందరికీ పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పోలీసు అధికారులు, జమ్మలమడుగు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T07:00:11+05:30 IST