సమస్యను పరిష్కరించరా..?

ABN , First Publish Date - 2021-02-27T04:48:23+05:30 IST

మండల పరిధిలోని గోపవరం పంచాయతీ భగత్‌సింగ్‌ కాలనీలో 33 కెవి విద్యుత్‌ లైన్లు, స్తంభాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నా పట్టించుకునే వారులేరని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సమస్యను పరిష్కరించరా..?
నడిరోడ్డులో ఉన్న 33కేవీ విద్యుత్‌ స్తంభం

భగత్‌సింగ్‌ కాలనీలో ప్రమాదకరంగా మారిన 33 కేవీ విద్యుత్‌ లైన్లు  పట్టించుకోని అధికారులు 

  ప్రతిపాదనలు పంపినా నిధుల లేమితో పనులకు బ్రేక్‌ నూతన పాలక వర్గమైనా దృష్టి పెట్టాలని ప్రజల వినతి

ప్రొద్దుటూరు రూరల్‌, ఫిబ్రవరి 26: మండల పరిధిలోని గోపవరం పంచాయతీ భగత్‌సింగ్‌ కాలనీలో 33 కెవి విద్యుత్‌ లైన్లు, స్తంభాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నా పట్టించుకునే వారులేరని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ సమస్య 40 ఏళ్లుగా   పీడిస్తోందని కాలనీవాసులు వాపోతున్నారు. అంతా రెక్కాడితేకానీ డొక్కాడని నిరుపేదలు కూలినాలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాలనీలో నడిరోడ్డులో,  ఇళ్ల మధ్యలో 33 కేవీ విద్యుత్‌ స్తంభాలు ఉండడంతో ఆవైర్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. 40 ఏళ్లలో సుమారు 10 మంది  విద్యుత్‌ ప్రమాదాలకు గురయ్యారు. ఈ విషయమై పలు మార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా  ఫలితం లేకుండాపోతోందన్నారు. కాగా 2015లో అప్పటి విద్యుత్‌ శాఖ అధికారులు భగత్‌సింగ్‌ కాలనీలో ప్రమాదకరంగా ఉన్న 33 కెవి విద్యుత్‌ లైన్లను గోపవరం గ్రామ పంచాయతీలోనే ఉన్న కాలువకట్ట వెంబడి మార్చేందుకు సుమారు రూ.40 లక్షలు ఖర్చవుతుందని ప్రతిపాదనలు తయారుచేసి ఆ కాపీని గ్రామ పంచాయతీ అధికారులకు పంపగా వారు స్పందించకపోవడంతో ఆ పనులు ముందుకు సాగలేదు. గ్రామ పంచాయతీలో అత్యంత ఎక్కువ భాగం వాణిజ్యపరమైన భవనాలు, ఉండడంతో   పంచాయతీకి ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తున్నప్పటికి సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులు ఆ సమస్యపై దృష్టి సారించడంలేదని భగత్‌సింగ్‌ కాలనీ ప్రజలు పేర్కొంటున్నారు. కాగా నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏర్పడంతో వారైనా సకాలంలో చర్యలు చేపట్టి సమస్యను శాశ్వితంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే  జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమ కాలనీలో ప్రమాదకరంగా ఉన్న 33 కెవి విద్యుత్‌  స్తంభాలను, వైర్లను మార్చాలని ప్రజలు కోరుతున్నారు. 

 40 ఏళ్లుగా  సమస్య పట్టిపీడిస్తోంది

 - హిదాయతుల్లా, స్థానికుడు

భగత్‌సింగ్‌ కాలనీలో 33 కేవీ విద్యుత్‌ స్తంభాలు, లైన్ల సమస్య 40 ఏళ్ల నుంచి పట్టిపీడిస్తున్నా పట్టించుకునేవారు లేరు. ఎంతో మంది ఎమ్మెల్యేలు, సర్పంచులు, అధికారులు మారుతున్నప్పటికి సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది. అధికారులు, ప్రజాప్రతినిధులు  జోక్యం చేసుకుని పేదల సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి.


 అధికారులు ఏమంటున్నారంటే...

భగత్‌సింగ్‌ కాలనీలో ప్రమాదకరంగా ఉన్న 33 కేవీ విద్యుత్‌ స్తంభాలు, లైన్లపై గ్రామ పంచాయతీ కార్యదర్శి గురుమోహన్‌ను వివరణ కోరగా విద్యుత్‌ స్తంభాలను, లైన్లను మార్చేందుకు ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుందని దానిని గ్రామ పంచాయతీ భరించాలంటే ఆర్థికంగా కష్టమవుతోందన్నారు. ఈ విషయమై ప్రజలు తమ దృష్టికి  సమస్యను తీసుకొచ్చారన్నారు. సర్పంచు, వార్డు సభ్యుల తొలి సమావేశంలో ఈ సమస్యపై ప్రస్తావించి చర్చిస్తామన్నారు. 

పంచాయతీ వారు నిధులివ్వకనే..

కాగా ఈ 33 కేవీ విద్యుత్‌ లైన్లు, స్తంభాల విషయమై విద్యుత్‌ శాఖ ఈఈ శ్రీనివాసులరెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా భగత్‌సింగ్‌ కాలనీలో విద్యుత్‌ సమస్య ప్రమాదకరంగా ఉన్న మాట వాస్తవమేనన్నారు. ఈ సమస్య తన దృష్టికి కూడా వచ్చిందని, అందు కోసం వెంటనే  ప్రతిపాదనలు తయారు చేసి పనులు చేపట్టేందుకు విద్యుత్‌ శాఖా సిద్ధంగా ఉన్నప్పటికి  నిధులు మంజూరు చేసేందుకు గ్రామ పంచాయతీ వారు ముందుకు రాకపోవడంతో ఆ సమస్యను పరిష్కరించలేకపోతున్నామన్నారు.  దీనిపై విద్యుత్‌ శాఖ జిల్లా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లానని ఆ సమస్యను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. 



Updated Date - 2021-02-27T04:48:23+05:30 IST