నెమ్మదిస్తున్న పెన్నా ఉధృతి

ABN , First Publish Date - 2021-11-22T05:17:24+05:30 IST

గండికోట జలాశయం నుంచి వరద ఉధృతి కొంత మేర తగ్గడంతో మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి 12 గేట్ల ద్వారా 50,000 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు జలాశయ ఏఈఈ గౌతమ్‌రెడ్డి ఆదివారం తెలిపారు.

నెమ్మదిస్తున్న పెన్నా ఉధృతి
మైలవరం నుంచి పెన్నకు ప్రవహిస్తున్న వరద నీరు




 తేరుకుంటున్న పరివాహక ప్రాంతాలు  కొనసాగుతున్న పునరావాస కేంద్రాలు  వరద నష్టాలపై అధికారుల పరిశీలన

మైలవరం, నవంబరు 21: గండికోట జలాశయం నుంచి వరద ఉధృతి కొంత మేర తగ్గడంతో మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి 12 గేట్ల ద్వారా 50,000 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు జలాశయ ఏఈఈ గౌతమ్‌రెడ్డి ఆదివారం తెలిపారు. గండికోట జలాశయం నుంచి మైలవరానికి సా యంత్రానికి 55,000 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నాయని, ప్రస్తు తం మైలవరం జలాశయంలో 3.650 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఏఈఈ తెలిపారు. శనివారం ఉధతంగా ప్రవహించిన పెన్నమ్మ ఆదివారానికి కాస్త నెమ్మదించడంతో తగ్గడంతో సమీప గ్రామాలైన వేపరాల,  దొమ్మరనంద్యాల గ్రామాల లోతట్టు ప్రాంతాల ప్రజలకు కొంత ఊరట లభించింది. మైలవరం జలాశయం నుంచి ఉత్తరకాలువకు 50 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 30 క్యూసెక్కులు, ఆర్టీపీపీకి 36 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే మైలవరం నుంచి పెన్నాకు మరింత నీటిని వదిలే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి నీటి విడుదల కొనసాగుతున్నం దున పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దారు రవి, ఎంపీడీవో రామచంద్రారెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం మైలవరం జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని వారు పరిశీలించి బాధితులకు ఏర్పాటు చేసిన భోజనాన్ని, వసతులను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రంలో దొమ్మరనంద్యాల, వేపరాల గ్రామాలకు చెందిన దాదా పు 500 మంది బాధితులు ఉన్నారని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజన వసతి సౌకర్యాలను కల్పించారు.

పెన్నా పరివాహక ప్రాంతాలు పరిశీలన

జమ్మలమడుగు రూరల్‌, నవంబరు 21:  పట్టణంలోని పెన్నా పరివాహక ప్రాంతాలైన గూడుమస్తాన్‌వీధి, టెక్కాయచేను వీధి, పొన్నతోట రోడ్డు తదితర వీధుల్లో ఎమ్మెల్యే సుదీర్‌రెడ్డి, తహసీల్దారు మధుసూదన్‌రెడ్డి, కమిషనర్‌ వెంకటరామిరెడ్డి పరిశీలించారు. ఆయా వార్డుల్లో ఎమ్మెల్యేతో బాధితు లు మాట్లాడుతూ పెన్నానదికి వరదనీరు ప్రవాహం వల్ల ఇళ్లు, గోడలు దెబ్బతిన్నాయని వస్తువులు నీళ్లలో కొట్టుకుపోయాయని  తెలిపారు. కార్యక్రమంలో ముల్లా జానీ, పోరెడి ్డ మహేశ్వర్‌రెడి ్డ, పోలీసు అధికారులు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, బాధితులు పాల్గొన్నారు.

 పారిశుధ్య చర్యలకు శ్రీకారం

పెన్నానదికి వరద ఉధృతి కాస్త నెమ్మదించడంతో జమ్మలమడుగులో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా కమిషనర్‌ వెంకటరామిరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నూర్‌బాష పారిశుధ్య చర్యలను వేగవంతం చేశారు.  పట్టణంలో మంచినీటి ఇబ్బందులు కలుగకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయించామన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్‌పౌడర్‌ మందు పిచికారి చేశామన్నారు. 

వర్షం ఉధృతికి దెబ్బతిన్న పంటల పరిశీలన

ప్రొద్దుటూరు రూరల్‌, నవంబరు 21: పెన్నానది పరివాహక గ్రామాల్లో వరద ఉధృతికి దెబ్బతిన్న పంటలను ఆదివారం మండల వ్యవసాయాధికారి శివశంకర్‌ పరిశీలించారు. ఆయా గ్రామాల విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్లు పంట నష్టంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికను పంపాలని అగ్రికల్చలర్‌ అసిస్టెంట్లకు సూచించారు.   చౌడూరు గ్రామంలో   కార్యదర్శి శ్రీనివాసులు పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బందితో గ్రామంలో పర్యటించి వర్షపునీరు నిలువ ఉన్న చోట్ల వేస్ట్‌ ఆయిల్‌ను చల్లడంతోపాటు ఆయిల్‌బాల్స్‌ చల్లించారు. పెన్నానది పరివాహక గ్రామాలైన నంగనూరుపల్లె, సోములవారిపల్లె, రేగళ్లపల్లె, కల్లూరు గ్రామాల్లో కార్యదర్శులు మాధవరెడ్డి, బాబు, సర్పంచ్‌ వల్లూరు శివలక్ష్మిలు రోడ్లపై ఉన్న వరద బురదను తొలగించి బ్లీచింగ్‌ చల్లించారు. సోములవారిపల్లె పంచాయతీలోని పెన్నానగర్‌, వినాయకనగర్‌, నంగనూరుపల్లె  గ్రామం ప్రజలకు ఎంపీపీ సానబోయిన శేఖర్‌యాదవ్‌ బాధిత ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేశారు. 

కొండాపురంలో..

కొండాపురం, నవంబరు 21: మండలంలో కురిసిన వర్షాలకు జరిగిన వరదనష్టాన్ని స్పెషలాఫీసర్‌ నేతృత్వంలో అధికారులు ఆదివారం మండలంలో పర్యటించి పరిశీలించారు. తాగునీటి సమస్య దెబ్బతిన్న పంటలను, ఇళ్లను స్పెషలాఫీసర్‌ మురళిమనోహర్‌తో కలిసి తహసీల్దార్‌ శోభన్‌బాబు, ఎంపీడీఓ జయసింహ తదితరులు. మండలంలోని రేగడిపల్లె, వెంకటాపురం, చౌటిపల్లె తదితర గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న గృహాలను, నీటి సమస్యను, దెబ్బతిన్న పంటలను పరిశీలించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు వారు తెలిపారు. 





Updated Date - 2021-11-22T05:17:24+05:30 IST