రాజీనామా చేసిన ఏడేళ్ళ తరువాత తిరిగి ఉద్యోగం!

ABN , First Publish Date - 2021-03-22T06:31:35+05:30 IST

వడ్డించేవాడు మన వాడైతే బంతిలో ఎక్కడున్నా ఇబ్బంది వుండదనే సామెతను రుజువు చేస్తూ ప్రభుత్వం ఒక అరుదైన నిర్ణయాన్ని తీసుకుంది. సరిగ్గా ఏడేళ్ళ క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసిన ఒకాయన్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటూ ప్రభుత్వం ఆదేశాలు చేయడమే ఇక్కడ విశేషం.

రాజీనామా చేసిన ఏడేళ్ళ తరువాత తిరిగి ఉద్యోగం!

ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

కలికిరి, మార్చి 21: వడ్డించేవాడు మన వాడైతే బంతిలో ఎక్కడున్నా ఇబ్బంది వుండదనే సామెతను రుజువు చేస్తూ ప్రభుత్వం ఒక అరుదైన నిర్ణయాన్ని తీసుకుంది. సరిగ్గా ఏడేళ్ళ క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసిన ఒకాయన్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటూ ప్రభుత్వం ఆదేశాలు చేయడమే ఇక్కడ విశేషం. కడప జిల్లాకు చెందిన వయోజన విద్య డిపార్టుమెంట్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ఎంజా సోమశేఖర్‌ రెడ్డి 2014 ఏప్రిల్‌ 17న ఉద్యోగానికి రాజీనామా చేశారు. దానిని ఆమోదించడం కూడా జరిగిపోయింది. దాదాపు ఏడేళ్ళ తరువాత తనను కడప జిల్లాలో ఎక్కడయినా ఖాళీగా వున్న పోస్టులో తిరిగి నియమించాలని ఆయన 2020 ఆగస్టు 18న దరఖాస్తు చేసుకున్నారు. ఇంకేముంది ఏడేళ్ళుగా దూరమైన పోస్టు కేవలం ఏడు నెలల్లో ఆయన దక్కించుకోగలిగారు. సోమశేఖర్‌ రెడ్డి దరఖాస్తు పైన ఆగమేఘాలపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం చివరికి ఆయన రాజీనామా ఉపసంహరణకు ఆమోదం తెలుపుతూ కడప జిల్లా వయోజన విద్యా ప్రాజెక్టులోనే తిరిగి సూపర్‌వైజరుగా నియమించేందుకు ఆమోదం తెలిపింది. ఇందుకు నిబంధనలు అంగీకరిస్తాయా అని ఎవరికైనా అనుమానముంటే... నిజమే ఏపీ స్టేట్‌ సబార్డినేట్‌ సర్వీసు రూల్‌ 30(బి) ప్రకారం అంగీకరించవు. అందుకే సోమశేఖర్‌ రెడ్డి విషయాన్ని ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ అడ్డొస్తున్న రూల్‌ నుంచి మినహాయించి ఉద్యోగం కల్పించారు. ఈ మధ్య ఏడేళ్ళ కాలాన్ని స్థంభీకృత (డైస్‌-ఆన) కాలంగా పరిగణిస్తూ పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఈ అరుదైన ఉత్తర్వులు జారీ చేశారు. 


Updated Date - 2021-03-22T06:31:35+05:30 IST