సీమ సాహితీ శిఖరం కేతు విశ్వనాథరెడ్డి

ABN , First Publish Date - 2021-08-22T05:20:42+05:30 IST

గంజి కరువు, డొక్కల కరువుతో ఒకప్పుడు రాయలసీమలో గ్రామీణుల బతుకు దుర్భరంగా మారింది. వీటన్నింటినీ అక్షరబద్ధం చేశారు ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి. కథలు, నవలలు, వ్యాసాల ద్వారా సీమ జీవితాన్ని, ఇక్కడి ప్రజల సాధకబాధకాలను ప్రపంచానికి తెలియజేశారు.

సీమ సాహితీ శిఖరం కేతు విశ్వనాథరెడ్డి
ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి

రాయలసీమ జనజీనవం ఇతివృత్తంగా కథలు, నవలలు

నేడు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం

(కడప-ఆంధ్రజ్యోతి): రైతు స్వేదాన్ని చిందిస్తేనే దేశానికి బుక్కెడు బువ్వ.. ఆ బువ్వకు ఆధారమైన అన్నదాత కరువు కోరల్లో చిక్కి ఆధారం కోల్పోతున్నారు. పచ్చని పల్లెసీమల్లో ఫ్యాక్షన రక్కసి ఎందరో బతుకులను ఛిద్రం చేసింది. గంజి కరువు, డొక్కల కరువుతో ఒకప్పుడు రాయలసీమలో గ్రామీణుల బతుకు దుర్భరంగా మారింది. వీటన్నింటినీ అక్షరబద్ధం చేశారు ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి. కథలు, నవలలు, వ్యాసాల ద్వారా సీమ జీవితాన్ని, ఇక్కడి ప్రజల సాధకబాధకాలను ప్రపంచానికి తెలియజేశారు. తన రచనలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. తాజాగా విమల స్మారక జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకోనున్నారు.


ఉద్యోగ ప్రస్థానం..

ఎర్రగుంట్ల మండలం రంగసాయిపురం గ్రామానికి చెందిన కేతు విశ్వనాథరెడ్డి ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరులో ప్రాథమికోన్నత, ఉన్నత విద్యను అభ్యసించారు. ఇంటర్మీడియట్‌, డిగ్రీ ప్రథమ సంవత్సరం కడప ఆర్ట్స్‌ కళాశాల, బీఏ రెండో ఏడాది, ఎంఏ (తెలుగు భాషా సాహిత్యం) తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చదివారు. భాషా సామాజిక పరిశీలన, కడప జిల్లా ఊర్లు పేర్లపై ఎస్వీయూలో పీహెచడీ చేశారు. చదువు పూర్తికాగానే ఆంధ్రరత్న తెలుగు దినపత్రికలో కొంతకాలం ఉప సంపాదకులుగా చేశారు. అనంతరం అధ్యాపక వృత్తిలో అడుగిడి.. కడప, శ్రీకాళహస్తి, ప్రకాశం జిల్లా కందుకూరు ప్రభుత్వ కళాశాలల్లో తెలుగు ట్యూటర్‌, రీడర్‌, అధ్యాపకులుగా 1963 నుంచి 1983 వరకు పనిచేశారు. 1983 జూలైలో అంబేడ్కర్‌ యూనివర్సిటీలో రీడర్‌గా చేరారు. 1985లో ఆచార్యులు (ప్రొఫెసర్‌)గా పదోన్నతి పొందారు. 1997లో ఉద్యోగం నుంచి విశ్రాంతి పొందారు. 


సాహిత్య ప్రస్థానం..

కడప ఆర్ట్స్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నప్పుడు 1958లో నిర్వహించిన పోటీలలో కేతు విశ్వనాథరెడ్డి కథకు ప్రథమ బహుమతి వచ్చింది. అంతర్‌ కళాశాలల కథల పోటీల్లో ఈయన రచించిన ‘ఏదీ గర్వకారణం’ కథను 1960లో ఆల్‌ ఇండియా రేడియో’లో ప్రసారం చేశారు. అలా.. కలం పట్టి అక్షర సేద్యంలో రాణిస్తూ.. కేతు విశ్వనాథరెడ్డి దాదాపు వంద కథలు, వందకు పైగా వ్యాసాలు, వేర్లు-బోధి నవలలు రాశారు. వీరి పలు కథలు ఇతర భాషల్లోకి అనువాదం అయ్యాయి. తన రచనలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వావిద్యాలయం అవార్డు, భారతీయ భాషా పరిషత అవార్డు, అజో-విభో-కందాళం ఫౌండేషన ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం.. ఇలా ఎన్నో అవార్డులు అందుకున్నారు.


నేడు విమల స్మారక సాహిత్యజీవిత సాఫల్య పురస్కారం ప్రదానం

అనంతపురం జిల్లాకు చెందిన విశ్రాంత అధ్యాపకులు, సాహితీవేత్త, రచయిత డాక్టరు శాంతినారాయణ ప్రతి ఏటా సాహితీవేత్తలకు పురస్కారాలు ప్రదానం చేస్తూ వస్తున్నారు. ఆయన సతీమణి పేరిట ‘విమలాశాంతి సాహిత్య సేవాసమితి’ స్థాపించారు. ఆ సమితి ఆధ్వర్యంలో ‘విమల స్మారక సాహిత్యజీవిత సాఫల్య పురస్కారం’ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ తొలి పురస్కారానికి కేతు విశ్వనాథరెడ్డిని ఎంపిక చేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు సీపీ బ్రౌన భాషా పరిశోధన కేంద్రం వేదికగా రూ.50వేల నగదు బహుకరణతో పాటు ఘనంగా వీరిని సన్మానించనున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ పుస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయితలు షేక్‌ హుస్సేన (సత్యాగ్ని), ఆర్‌ఎం ఉమామహేశ్వరరావు, డాక్టరు వీఆర్‌ రాసాని, జి.వెంకటకృష్ణ, సడ్లపల్లి చిదంబరరెడ్డి, పలమనేరు బాలాజీ తదితరులు హాజరుకానున్నారు.

Updated Date - 2021-08-22T05:20:42+05:30 IST