శనగను ముంచిన వాన

ABN , First Publish Date - 2021-10-30T05:23:27+05:30 IST

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కురిసిన వర్షం బుడ్డశెనగ సాగు చేసిన రైతన్నను నిలువునా ముంచింది.

శనగను ముంచిన వాన
వల్లూరు మండలం కొత్తగాలివారి పల్లెలో నీట మునిగిన బుడ ్డ శనగ

జిల్లా అంతటా వర్షం 

దెబ్బతిన్న బుడ్డశనగ, మినిము పంట 


కడప, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కురిసిన వర్షం బుడ్డశెనగ సాగు చేసిన రైతన్నను నిలువునా ముంచింది. కొన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురవడంతో చేళ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో మొలక దశలో ఉన్న బుడ్డశనగ, మినుము దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రబీలో సుమారు లక్ష ఎకరాల్లో బుడ్డశెనట సాగుచేస్తారు. పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో నల్లరేగడి భూముల్లో బుడ్డశనగ సాగు చేస్తారు. కొన్నిచోట్ల వారం క్రితం విత్తనం విత్తారు. ఇప్పుడిప్పుడే మొలదక దశలో ఉండగా కొన్ని చోట్ల మొలకెత్తింది. వర్షపు నీరు నిలవడంతో పంట దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. బద్వేలు, గోపవరం, పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన, బీకోడూరు, వేముల, వేంపల్లి, పులివెందుల, కమలాపురం, వల్లూరులలో వర్షం ఏకధాటిగా కురిసింది. పులివెందుల నియోజక వర్గంలో మినుము 5 వేల ఎకరాల్లో, బుడ్డశనగ 20 వేల ఎకరాల్లో సాగు చేశారు. అయితే ఇక్కడ శనగ మొలక దశలో ఉంది. పొలంలో నీరు నిల్వ ఉంటే మొలక కుళ్లిపోతుంది. ఇక మినుముకు తెగుళ్లు ఆశిస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వల్లూరు మండలంలో వరిచేను దెబ్బతింది. కొత్తగాలివారిపల్లెలో మొలకదశలో ఉన్న బడ్డశనగ నీటమునిగింది. ఇలాగే మరో రెండు రోజులు వర్షం కురిస్తే బుడ్డశనగ, మినుము  పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Updated Date - 2021-10-30T05:23:27+05:30 IST