రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి

ABN , First Publish Date - 2021-10-22T04:57:06+05:30 IST

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య అని కడప పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు లింగారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన  విధించాలి
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న లింగారెడ్డి

మితిమీరుతున్న వైసీపీ నేతల ఆగడాలు : లింగారెడ్డి


బద్వేలు, అక్టోబరు 21: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య అని కడప పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు లింగారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం సాయంత్రం టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ అధ్యక్షతన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో  పరిపాలన లేదని, శాంతి భద్రతలు కరువయ్యాయన్నారు. డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడి చేసినా పోలీసులు వారిని నిలువరించలేకపోవడం పోలీసు వ్యవస్థకే మాయని మచ్చన్నారు.  చంద్రబాబునాయుడు, లోకేశ్‌ను పత్రికల్లో రాయలేని భాషలో మంత్రులు బూతులు తిట్టినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులు తలుపులు పగులకొట్టి టీడీపీ నేత పట్టాభిని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉండడంతో అధికార పార్టీ నేతలు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రౌడీరాజ్యం సాగుతోందని శాంతిభద్రతలు క్షీణించాయని కావున తక్షణమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలో టీడీపీ ఎవరికీ మద్దతు ఇవ్వలేదన్నారు. బద్వేలు మున్సిపాలిటీలో వైసీపీకి చెందిన కాంట్రాక్టర్లకే బిల్లులు మంజూరు చేస్తున్నారని, టీడీపీకి చెందిన వారికి బిల్లులు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు రాజశేఖర్‌, వెంగళరెడ్డి, రవికుమార్‌రెడ్డి, రమణయ్య, మునిరెడ్డి, జహంగీర్‌బాష, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T04:57:06+05:30 IST