న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యం

ABN , First Publish Date - 2021-11-06T05:17:21+05:30 IST

సీఎం జగనమోహనరెడ్డి స్పందించి న్యాయం చేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని పశువైద్య కళాశాలలో పనిచేస్తున్న 16 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు హెచ్చరించారు. ఆమేరకు తామంతా కళాశాల భవనంపైకి ఎక్కి మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామంటూ శుక్రవారం ఆందోళనకు దిగారు. వివరాలిలా..

న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యం
భవనం పైకి ఎక్కి ఆందోళన చేస్తున్న పశువైద్య కళాశాల ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది

పశువైద్య కళాశాల ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల హెచ్చరిక

తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ వేడుకోలు

కళాశాల భవనం పైకి ఎక్కి నిరసన

ప్రొద్దుటూరు రూరల్‌, నవంబరు 5: సీఎం జగనమోహనరెడ్డి స్పందించి న్యాయం చేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని పశువైద్య కళాశాలలో పనిచేస్తున్న 16 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు హెచ్చరించారు. ఆమేరకు తామంతా కళాశాల భవనంపైకి ఎక్కి మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామంటూ శుక్రవారం ఆందోళనకు దిగారు. వివరాలిలా.. ప్రొద్దుటూరు మండలం గోపవరం సమీపంలోని పశువైద్యకళాశాలలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్‌ ద్వారా నియామకాలు సరిగా జరగలేదని, నియామకంలో రోస్టర్‌ పాటించలేదని హైకోర్టు నుంచి వచ్చిన నోటీసుతో 16 మందిని అధికారులు తొలగించారు. దీంతో వారు తమ బతుకులు రోడ్డుపాలయ్యాయంటూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి వెంకటేశ మాట్లాడుతూ శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ పరిధిలో నాలుగు పశువైద్య కళాశాలలు ఉన్నాయని, అందులో 436 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. అయితే మూడు కళాశాలలను వదిలేసి కేవలం ప్రొద్దుటూరు కళాశాలలో పనిచేసే 16 మంది ఉద్యోగులను తొలగించడం ఎందుకని ప్రశ్నించారు. ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలలో కూడా 109 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఉండగా అందులో కేవలం 16 మందిని మాత్రమే తొలగించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కళాశాలల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకం ఒకే విధంగా జరిగిందని, అయితే కేవలం ప్రొద్దుటూరు కళాశాలలోని 16 మందికే రోస్టర్‌ పేరు పెట్టి అన్యాయానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయకపోతే ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2021-11-06T05:17:21+05:30 IST