వైసీపీ దౌర్జన్యానికి పోలీసుల మద్దతు
ABN , First Publish Date - 2021-03-03T04:42:43+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో దౌర్జన్యం చేసి అభ్యర్థులను బలవంతంగా విత్‌డ్రా చేయిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి.ఆదినారాయణరెడ్డి తెలిపారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి
జమ్మలమడుగు రూరల్, మార్చి 2: రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో దౌర్జన్యం చేసి అభ్యర్థులను బలవంతంగా విత్‌డ్రా చేయిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి.ఆదినారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం జమ్మలమడుగులోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జమ్మలమడుగు, ఎర్రగుంట్ల నగర పంచాయతీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు పోలీసులు మద్దతుగా నిలుస్తున్నారని విమర్శించారు. అందులో జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలో 18వ వార్డులో స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన మున్నా అనే వ్యక్తిని తాము దౌర్జన్యంగా కిడ్నాప్ చేశామని పోలీసులు తమ గ్రామానికి వచ్చి దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. జమ్మలమడుగు చరిత్రలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ లేదన్నారు. నామినేషన్లు వేసే ముందు దౌర్జన్యం చేయడం, అడ్డుపడడం, ఉపసంహరణ సమయంలో బలవంతంగా ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేయడం జరిగిందన్నారు. ఎన్నడూ లేనివిధంగా సర్పంచ్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని సీట్లు వైసీపీకే రావాలని దౌర్జన్యకాండ చేస్తున్నారన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు శివనారాయణరెడ్డి, కె.మోహన్‌రెడ్డి, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.