ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసుల దాడులు
ABN , First Publish Date - 2021-02-01T05:40:26+05:30 IST
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లర్లపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. మూడు కేసులకు సంబంధించి అంతరాష్ర్ట్ర స్మగ్లరు సింపతి ఫకృద్దీనతో పాటు 11 మంది తమిళనాడుకు చెందిన స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ కేకేఎన అన్బురాజన తెలిపారు.

అంతర్రాష్ట్ర స్మగ్లరుతో సహా 12 మంది అరెస్టు
20 దుంగలు, మూడు కార్లు, బైకు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ అన్బురాజన
కడప(క్రైం), జనవరి 31: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లర్లపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. మూడు కేసులకు సంబంధించి అంతరాష్ర్ట్ర స్మగ్లరు సింపతి ఫకృద్దీనతో పాటు 11 మంది తమిళనాడుకు చెందిన స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ కేకేఎన అన్బురాజన తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలో ఆదివారం ఓఎస్డీ (ఆపరేషన) దేవప్రసాద్, లక్కిరెడ్డిపల్లె సీఐ యుగంధర్‌బాబు, ఎస్బీ సీఐ పుల్లయ్యతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి స్మగ్లర్ల వివరాలను వెల్లడించారు. చాపాడు మండలం ఖాదర్‌పల్లెకు చెందిన సింపతి ఫకృద్దీన (39) తమ బంధువులతో పాటు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతుండేవాడు, కటిగెనహళ్లి, తమిళనాడకు చెందిన బడా స్మగ్లర్లతో అక్రమ సంబంధాలు పెట్టుకుని జిల్లా నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతూ వస్తున్నాడు. గతంలో ఫకృద్దీన పీడీ యాక్టుపై జైలు శిక్ష అనుభవించాడు. బయటకు వచ్చి కూడా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతూ వస్తున్నాడు. జిల్లా వ్యాప్తంగా ఇతడిపై 61 కేసులు ఉన్నాయన్నారు. తమిళనాడు రాష్ట్రం నుంచి కూలీలను తీసుకువచ్చి రాయచోటి, చెన్నూరు, గువ్వలచెరువు, లక్కిరెడ్డిపల్లె, సిద్దవటం అటవీ ప్రాంతాల్లో వదిలి అక్కడ ఎర్రచందనం దుంగలు నరికించి ఒక డంప్‌గా ఏర్పాటు చేసి వాహనాల ద్వారా కటిగెనహళ్లికి చెందిన స్మగ్లర్లకు అమ్ముతుండేవాడు. ఎర్రచందనం దుంగలను ఇన్నోవా కారులో తీసుకుని వెళుతుండగా అతడికి పైలెట్‌గా చాపాడు మండలం ఖాదర్‌పల్లెకు చెందిన షేక్ లతీఫ్ వ్యవహరిస్తూ మోటారుబైకులో వెళుతూ సమాచారం అందిస్తూ వచ్చేవాడు. ఈ నేపధ్యంలో లక్కిరెడ్డిపల్లె సీఐ యుగంధర్‌బాబు ఆధ్వర్యంలో సింపతి ఫకృద్దీనతో పాటు లతీ్‌ఫలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి కారు, ఐదు ఎర్రచందనం దుంగలు, బైకు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే చెన్నూరు ఎస్‌ఐ తులసి నాగప్రసాద్ తన సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా కారు, ఐదు ఎర్రచందనం దుంగలను నరికి డంప్ చేస్తుండగా ఎస్‌ఐ తన సిబ్బందితో దాడులు నిర్వహించి ఐదుమంది తమిళ కూలీలతో పాటు ఐదు దుంగలను, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే సిద్దవటం ఎస్‌ఐ రమేష్ తన సిబ్బందితో మరో ఐదు మంది తమిళ కూలీలను అరెస్టు చేసి కారు, ఐదు దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు 12 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి మూడు కార్లు, మోటారు సైకిలు, మూడు గొడ్డళ్లు, 549 కేజీల బరువున్న 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అరెస్టయిన స్మగ్లర్లు వీరే..
అంతరాష్ర్ట్ర స్మగ్లరు సింపతి ఫకృద్దీనతో పాటు అతడికి పైలెట్‌గా సహకరించిన షేక్ లతీఫ్, తమిళనాడు రాషా్ట్రనికి చెందిన వుడ్ కట్టర్‌లు ముత్తుస్వామి, సేలం జిల్లా నిగమల్లై గ్రామానికి చెందిన శీలం రామారార్ ఎల్లమలై, కె.ధనశేఖర్, ఎల్.మద్యయాన, ఎల్.పండియాన, చిన్నతంబి అన్నామలై, ముత్తుస్వామి, ఆర్.మూర్తి, ఆర్.మదియత్తుమ్, పి.సెంథిల్ రాజ్‌కుమార్ ముత్తు అరెస్టయ్యారు. ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.