ఇసుక వివాదం

ABN , First Publish Date - 2021-10-18T05:30:00+05:30 IST

రాజంపేట మండలం మందరం ఇసుక క్వారీలో సోమవారం వివాదం రేగడంతో ఇసుక రవాణా స్తంభించింది. వాహనాల్లో లోడు చేస్తున్న ఇసుకలో నీటి తడి ఉందని, ఈ తడి ఆరాక ఇసుక తూకం తగ్గుతోందని, దీనికి తోడు నిర్ణీత ధర కన్నా అధికమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, డంపింగ్‌ యార్డు వద్ద చేసిన పనులకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదని క్వారీ నుంచి ఇసుకను రవాణా చేసేవారు ఆరోపిస్తున్నారు.

ఇసుక వివాదం
ఇరువర్గాలకు సర్దిచెబుతున్న పోలీసులు

మందరం క్వారీ వద్ద స్తంభించిన ఇసుక రవాణా

రెండు కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు

రాజంపేట/పెనగలూరు, అక్టోబరు 18: రాజంపేట మండలం మందరం ఇసుక క్వారీలో సోమవారం వివాదం రేగడంతో ఇసుక రవాణా స్తంభించింది. వాహనాల్లో లోడు చేస్తున్న ఇసుకలో నీటి తడి ఉందని, ఈ తడి ఆరాక ఇసుక తూకం తగ్గుతోందని, దీనికి తోడు నిర్ణీత ధర కన్నా అధికమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, డంపింగ్‌ యార్డు వద్ద చేసిన పనులకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదని క్వారీ నుంచి ఇసుకను రవాణా చేసేవారు ఆరోపిస్తున్నారు. దీంతో ఇసుక క్వారీ నిర్వాహకులకు, ఇసుక రవాణాదారులకు మధ్య గురువారం ఉదయం వివాదం రేగింది. మధ్యాహ్నం దాటినా వివాదం కొనసాగడంతో క్వారీ వద్ద ఇసుక ట్రాక్టర్లు, లారీలను నిలిపివేశారు. డంపింగ్‌ యార్డ్‌కు ఇరువైపులా పెనగలూరు-రాజంపేట రహదారి వెంట రెండు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. డంపింగ్‌యార్డ్‌ ముఖద్వారం నుంచి మందరం కొత్తపల్లె వరకు టిప్పర్లు, లారీలు నిలిచిపోయాయి. ట్రాక్టర్‌, ఇతర వాహనాల డ్రైవర్లు ఇసుక డంపింగ్‌యార్డు వద్దే వాహనాలు ఉంచేసి నిరసన వ్యక్తం చేస్తూ అక్కడే వంటావార్పుకు దిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాలబారులు అలాగే ఉండిపోయాయి. విషయం తెలుసుకున్న మన్నూరు ఎస్‌ఐ భక్తవత్సలం, పెనగలూరు ఎస్‌ఐ చెన్నకేశవులు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాల వారితో చర్చలు జరిపి సర్దిచెప్పారు. ఇసుక తూకంలో తక్కువ లేకుండా చూడాలని, పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని, అధిక రేట్లలో డబ్బులు వసూలు చేయవద్దని సర్ది చెప్పారు. దీంతో ఇరువర్గాలు శాంతించాయి.

Updated Date - 2021-10-18T05:30:00+05:30 IST