35 రోజులే..!

ABN , First Publish Date - 2021-02-25T05:41:30+05:30 IST

జిల్లాలో 621 రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో కేంద్రానికి రూ.21.80 లక్షలు చొప్పున రూ.135.38 కోట్లు కేటాయించారు. అందులో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు 90 శాతం ఇస్తే మరో 10 శాతం నిధులు వ్యవసాయ శాఖ విడుదల చేస్తుంది. ఏడాదిన్నర క్రితం వీటిని మంజూరు చేశారు.

35 రోజులే..!
రైల్వేకోడూరులో పిల్లర్లు, స్లాబుతో ఆగిపోయిన ఆర్‌బీకే

సా..గుతున్న రైతు భరోసా కేంద్రాల నిర్మాణం 

40 శాతం కూడా పూర్తి కాని వైనం

వేధిస్తున్న ఇసుక, నిధుల కొరత

సచివాలయాలు, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌లది అదే పరిస్థితి

మార్చి 31లోగా పూర్తి చేయాలని ఆదేశం

ఎలా సాధ్యం అంటున్న ఇంజనీర్లు


రైతులకు అన్ని సేవలు ఒకేచోట అందించాలనే లక్ష్యంగా రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అధికార పార్టీ నాయకులే ఈ పనులు చేస్తున్నారు. ఇసుక, నిధుల కొరత, కరోనా, ఎన్నికలు ఇలా వివిధ కారణాలతో పురోగతి పడకేసింది. ఏడాది దాటినా ఇప్పటికీ 40 శాతం కూడా పనులు పూర్తి కాలేదు. గ్రామ సచివాలయాలు, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌ నిర్మాణాలు ముందుకు మూడడుగులు వెనక్కి ఆరడుగులు.. చందంగా మారింది. మార్చి 31లోగా పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యాలను నిర్ధేశించింది. మిగిలిన గడువు 35 రోజులే. వంద శాతం పూర్తి చేయడం సాధ్యమా..? ఇంజనీర్లు, పనులు చేపట్టిన ఏజెన్సీలు అసాధ్యమే అంటున్నారు. జిల్లాలో ఆర్‌బీకే నిర్మాణాల తీరును పరిశీలిస్తే.. 


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో 621 రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో కేంద్రానికి రూ.21.80 లక్షలు చొప్పున రూ.135.38 కోట్లు కేటాయించారు. అందులో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు 90 శాతం ఇస్తే మరో 10 శాతం నిధులు వ్యవసాయ శాఖ విడుదల చేస్తుంది. ఏడాదిన్నర క్రితం వీటిని మంజూరు చేశారు. పంచాయతీ ఎంపిక చేసిన ఏజెన్సీల ద్వారా పనులు చేపట్టారు. పంచాయతీరాజ్‌ (పీఆర్‌) ఇంజనీర్ల పర్యవేక్షణలో చేపట్టిన ఆర్‌బీకే నిర్మాణాలు నెలలు గడిస్తున్నా 40 శాతం కూడా పూర్తి కాలేదు. పనులు మొదలు కాగానే కరోనా మహమ్మారి విజృంభణ వల్ల నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. నవంబరులో నివార్‌ తుఫాన, నదుల్లో వరద ప్రవాహం వల్ల ఇసుక కొరత వల్ల పురోగతి పడకేసింది. దీనికి తోడు నిధుల కొరత సరేసరి. ఎనఆర్‌జీఎ్‌స నిధులతో చేపట్టడం వల్ల నిధుల కొరత సమస్య లేదని జిల్లా ఇంజనీరింగ్‌ అధికారులు అంటున్నా.. ఎనిమిది నెలలుగా బిల్లులు రాలేదని, పనులెలా చేయాలని పనులు చేసే ఏజెన్సీలు, పర్యవేక్షించే ఇంజనీర్లు వాపోతున్నారు. స్థలం కొరత, కోర్టు వివాదాల కారణంగా నేటికి 45 భవనాల నిర్మాణాలకు పునాదులు కూడా తీయలేదు. 576 భవనాల పనులు మొదలైనా 25 మాత్రమే అన్ని అంగులతో నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. 40 శాతం కూడా పురోగతి సాధించలేదు. మార్చి 31లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. 35 రోజుల్లోగా 60 శాతం పనులు పూర్తి చేయడం ఎలా సాధ్యం..? నిధులు సకాలంలో విడుదల కావడం లేదు. ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం.. మళ్లీ అప్పులు చేసి పనులు చేయమంటే ఎలా సాధ్యమని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


60 శాతం దాటని సచివాలయాలు

జిల్లాలో 806 పంచాయతీలుంటే 2,000-4,000 జనాభాకు ఒకటి ప్రకారం 633 గ్రామ సచివాయాలు ఏర్పాటు చేశారు. 11 మంది సచివాలయ సిబ్బంది, సర్పంచి, పనుల కోసం వచ్చే ప్రజలకు అనుకూలంగా జీ+1 తరహాలో 2620 చదరపు అడుగుల విస్థీర్ణంలో నూతన భవన నిర్మాణాలను ఉపాధి హామీ పథకం కన్వర్జేషన నిధులతో చేపట్టారు. ఒక్కో భవనానికి రూ.40 లక్షల ప్రకారం రూ.252.40 కోట్లు కేటాయించారు. 412 భవనాలు పంచాయతీరాజ్‌ (పీఆర్‌), 219 గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) ఇంజనీర్ల పర్యవేక్షణలో చేపట్టారు. ఇప్పటి వరకు 130 నిర్మాణాలు పూర్తయితే మరో 250 స్లాబ్‌, చివరి దశలో ఉన్నాయి. 233 భవనాలు పిల్లర్లు, పునాదులు, గోడల దశలోనే ఉన్నాయి. మొత్తంగా 60 శాతం పురోగతి సాధించామని, రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని ఇంజనీర్లు అంటున్నారు. అలాగే.. విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌లు 500 మంజూరు చేశారు. ఒక్కో క్లీనిక్‌కు రూ.17.50 లక్షల ప్రకారం రూ.87.50 కోట్లు మంజూరు చేశారు. ఇందులో 50 శాతం ఎనఆర్‌ఈజీఎ్‌స నిధులు, మరో 50 శాతం వైద్య ఆరోగ్య శాఖ కేటాయిస్తుంది. ఇప్పటికీ కేవలం 15 క్లీనిక్‌లు మాత్రమే సగ్రమంగా పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. గ్రామంలో ఆర్‌బీకే, సచివాలయం, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌ మూడు కూడా ఒకే కాంట్రాక్టరు (ఏజెన్సీ)కు అప్పగించడం, సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో నిధుల కొరత కారణంగా పనుల్లో పురోగతి లేదు.


వాస్తవాలు కొన్ని

- బి.కోడూరు మండలంలో 10 రైతు భరోసా కేంద్రాలు మంజూరయ్యాయి. అందులో 9 ఆర్‌బీకేలు నిర్మాణాలు చేపట్టారు. 7-8 నెలలుగా ఒక్క రూపాయి కూడా బిల్లులు మంజూరు కాలేదని ఇంజనీర్లే అంటున్నారు. దీంతో అక్కడ పురోగతి నత్తనడకన సాగుతోంది. సచివాలయాలది అదే పరిస్థితి. బిల్లులు రాక పనులు ఆగిపోయాయి. 

- బి.మఠం మండలంలో 14 ఆర్‌బీకేలు మంజూరు కాగా 10 భవనాల పనులు మొదలు పెట్టారు. కొన్ని స్లాబులు పూర్తయ్యాయి. ఇసుక కొరత, ఎన్నికల వల్ల పనులు మందగించాయని అంటున్నారు. 

- పెండ్లిమర్రి మండలంలో 16 ఆర్‌బీకేలు మంజూరయ్యాయి. 9 భవనాలు మాత్రమే పనులు మొదలయ్యాయి. ఒక భవనం మాత్రమే పూర్తయ్యింది. ఏడు భవనాల పనులు మొదలే కాలేదు. ఇసుక కొరత, కరోనా, ఎన్నికల కారణంగానే పురోగతి మందగించిందని అధికారుల వాదన. 

- లక్కిరెడ్డిపల్లె మండలంలో 11 ఆర్‌బీకేలు మంజూరయ్యాయి. నిర్మాణాలు స్లాబ్‌ దశలో ఉన్నాయి. మూడు మాత్రం చివరి దశలో ఉన్నాయి. సకాలంలో నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పనులు వేగంగా జరగడం లేదు. 

- రైల్వేకోడూరు మండలంలో 20 ఆర్‌బీకేలకు నూతన భవనాలకు నిధులు మంజూరు చేశారు. వివిధ దశల్లో పనులు ఉన్నాయి. 40-50 శాతం పురోగతి సాధించారు. డిసెంబరులో బిల్లులు మంజూరయ్యాయి. ఇసుక కొరత వల్లనే పనుల ప్రగతి మందగించదని ఇంజనీర్లే అంటున్నారు. 


గడువులో పూర్తి చేస్తాం 

- సుబ్బారెడ్డి, ఎస్‌ఈ, పంచాయతీరాజ్‌, కడప

జిల్లాలో 621 రైతు భరోసా కేంద్రాలు మంజూరయ్యాయి. 576 భవనాల పనులు మొదలు పెట్టాం. 40 శాతం పురోగతి సాధించాం. 25 భవనాలు అన్ని రకాలుగా పూర్తయ్యాయి. ఆర్‌బీకే, సచివాలయాలు, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌ భవనాలు నిర్మాణాలు మార్చి ఆఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నిధుల కొరత సమస్య లేదు. 



Updated Date - 2021-02-25T05:41:30+05:30 IST