సౌదీలో ఓబులవారిపల్లె వాసి మృతి

ABN , First Publish Date - 2021-08-26T04:58:00+05:30 IST

ఓబులవారిపల్లె మండలంలోని కాకర్లవారిపల్లె అరుంధతివాడకు చెందిన ఈటిమాపురం చెంగయ్య (37) సౌదీ అరేబియాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు.

సౌదీలో ఓబులవారిపల్లె వాసి మృతి
చెంగయ్య (ఫైల్‌)

ఓబులవారిపల్లె, ఆగస్టు 25 : ఓబులవారిపల్లె మండలంలోని కాకర్లవారిపల్లె అరుంధతివాడకు చెందిన ఈటిమాపురం చెంగయ్య (37) సౌదీ అరేబియాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివరాల్లోకెళితే...బోటుమీదపల్లె పంచాయతీ కాకర్లవారిపల్లె అరుంధతివాడకు చెందిన ఈటిమాపురం రామయ్య కుమారుడు చెంగయ్య రెండు సంవత్సరాల క్రితం సౌదీకి వెళ్లి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం స్నానాల గదిలో కాలు జారి పడి దెబ్బ తగిలిందని ఫోన్‌లో తెలిపాడని, గాయం కూడా అంత పెద్దది కాదని తెలిపాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రెండు రోజుల నుంచి ఫోన్‌ చేయడం లేదని, మంగళవారం సౌదీలోని యజమాని ఫోన్‌ చేసి చెంగయ్య చనిపోయాడని చెప్పాడన్నారు. గాయానికి మృత్యువాత పడటం ఏమిటని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారని, వారంతా పది సంవత్సరాల్లోపు వారేనని కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారులు, నాయకులు స్పందించి తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

Updated Date - 2021-08-26T04:58:00+05:30 IST