దారి లేదు.. మెటీరియల్‌ రాదు.. పనులు జరిగేదెట్టా..?

ABN , First Publish Date - 2021-08-21T04:53:34+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణ పనులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పునాదుల నిర్మాణానికి రాళ్లు, ఇసుక, సిమెంటుతో పాటు ఇతర సామగ్రి సరఫరా చేయుటకు సరైన రోడ్లు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.

దారి లేదు..  మెటీరియల్‌ రాదు.. పనులు జరిగేదెట్టా..?
జగనన్న కాలనీలో పునాది లెవల్‌లోనే నిలిచిపోయిన పనులు

జగనన్న కాలనీ పనులకు అడ్డంకులు

ఉన్నదారులకు మట్టి, రాళ్లకట్టలు

అవస్థల్లో లబ్ధిదారులు

కడప(నాగరాజుపేట), ఆగస్టు 20: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణ పనులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పునాదుల నిర్మాణానికి రాళ్లు, ఇసుక, సిమెంటుతో పాటు ఇతర సామగ్రి సరఫరా చేయుటకు సరైన రోడ్లు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇతర కాలనీల్లో నుంచి వెళ్దామంటే ఆ ప్రాంత వాసులు రాళ్లు, మట్టికట్టలు అడ్డు వేయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. 

నగరంలోని మూడవ డివిజన్‌ సబ్‌జైలు వెనుకభాగంలో 1600 మంది పేదలకు స్థలం కేటాయించారు. పనులు చకా చకా మొదలు పెట్టాలని అధికారులు లబ్ధిదారులను ఆదేశించారు. ఇదంతా బాగానే ఉన్నా... పునాదులకు బయటి నుంచి రాళ్లు, ఇసుక, ఇటుకల సరఫరాకు సరైన దారి లేదు. ఎటు చూసినా గుంతలు.. మిట్టలే. మొన్న ఈ మధ్య కురిసిన వర్షాలకు అక్కడి ప్రాంతం మరింత దారుణంగా తయారైంది. చిన్న వాహనాలైన ఆటో, మోటారు సైకిలు వెళ్లాలన్నా బురదలో చిక్కుకోవాల్సిందే. ఇక పోలీసు కాలనీ, జర్నలిస్టుల కాలనీల గుండా ఈ స్థలాలకు వెళ్దామంటే ఆ ప్రాంత వాసులు వాహనాలు వెళ్లకుండా రాళ్లు, మట్టికట్టలు అడ్డం వేశారని లబ్ధిదారుల ఆవేదన చెందుతున్నారు.  కొందరు పునాది లెవల్‌ వరకు ఎలాగోలా పనులు చేస్తున్నా.. చాలా మంది అసలు పనులే మొదలు పెట్టలేదు. పనులు పర్యవేక్షించేందుకు వచ్చిన అధికారులకు తమ సమస్యలు చెప్పినప్పటికీ ఫలితం లేదని వాపోతున్నారు. ఇళ్ల నిర్మాణాలకు సరైన రోడ్లు నిర్మించి సమస్యలను పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 


సమస్యను త్వరలో పరిష్కరిస్తాం 

తహసీల్దారు శివరామిరెడ్డి

ఉన్న చిన్నపాటి దారులకు మట్టి, రాళ్లు అడ్డు వేశారని తమ దృష్టికి వచ్చింది. సమస్యను త్వరలో పరిష్కరించాలని మున్సిపల్‌ అధికారులకు చెప్పాం. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గృహ నిర్మాణాలు వేగవంతంగా జరిగేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం. Updated Date - 2021-08-21T04:53:34+05:30 IST