అర్ధరాత్రి హైటెన్షన్‌

ABN , First Publish Date - 2021-03-07T05:42:52+05:30 IST

జిల్లాలో మున్సిపల్‌ పోలింగ్‌కు మరో నాలుగైదు రోజులు గడువు ఉండగా, అధికార పార్టీ ఒత్తిళ్లు, సూచనలతో టీడీపీ నేతల అరెస్టు పర్వానికి తెరతీశారు. టీడీపీ అభ్యర్థులు, కార్యకర్తల్లో భయోత్పాతం సృష్టించే వ్యూహాలకు పదును పెట్టారు.

అర్ధరాత్రి హైటెన్షన్‌
మాట్లాడుతున్న ధనపాల జగన్‌

మైదుకూరులో పోలీసుల అత్యుత్సాహం

టీడీపీ చైర్మన్‌ అభ్యర్థి జగన్‌ ఆరెస్టు 

రాత్రి 1.45 గంటలకు బెయిల్‌ ఇచ్చిన న్యాయమూర్తి

నోటీసు ఇవ్వకుండానే అరెస్టు చేయడంపై భగ్గుమన్న టీడీపీ నేతలు


మైదుకూరులో శుక్రవారం అర్ధరాత్రి హైటెన్షన్‌ చోటు చేసుకుంది. పట్టణమంతా నిద్రలోకి జారుకుంటున్న వేళ.. పోలీసులు టీడీపీ చైర్మన్‌ అభ్యర్థి ధనపాల జగన్‌ ఇంటిని చుట్టుముట్టి ఆయనను అరెస్టు చేశారు. న్యాయమూర్తి ఆర్ధరాత్రి 1.45 గంటలకు బెయిల్‌ మంజూరు చేయడంతో.. 2.25 గంటలకు టీడీపీ నేత ఇంటికి చేరుకున్నారు. ఐదు గంటల హైడ్రామా, హైటెన్షన్‌కు తెరపడింది. ఆ వివరాలు ఇలా...


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో మున్సిపల్‌ పోలింగ్‌కు మరో నాలుగైదు రోజులు గడువు ఉండగా, అధికార పార్టీ ఒత్తిళ్లు, సూచనలతో టీడీపీ నేతల అరెస్టు పర్వానికి తెరతీశారు. టీడీపీ అభ్యర్థులు, కార్యకర్తల్లో భయోత్పాతం సృష్టించే వ్యూహాలకు పదును పెట్టారు. అందుకు మైదుకూరు వేదికగా నిలిచింది. జిల్లాలో ప్రతి మున్సిపాలిటీల్లో అధికార వైసీపీ కొన్ని వార్డులను ఏకగ్రీవం చేసుకుంది. మైదుకూరులో మాత్రం సాధ్యం కాలేదు. 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ చివరిరోజు. విత్‌డ్రా గడువు ముగిశాక, కనీసం ఒక్క వార్డునైనా ఏకగ్రీవం చేసుకోవాలని వైసీపీ నాయకులు ప్రయత్నించగా.. టీడీపీ చైర్మన్‌ అభ్యర్థి ధనపాల జగన్‌ అడ్డుకున్నారు. ఆరోజు ఆర్‌వో విధులకు అటంకం కల్గించారని, భయాందోళనలకు గురి చేశారంటూ మున్సిపల్‌ కమిషనర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ధనపాల్‌ జగన్‌ను శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేసేందుకు వచ్చారు. దీనిని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. రాత్రి 9.25 గంటల నుంచి ఆర్ధరాత్రి 2.25 గంటల వరకు ఉద్రిక్తత నెలకొంది. జనం నిద్రను వీడి రోడ్లపైకి వచ్చి, పరిస్థితిని గమనించారు.


ప్రచారానికి రానివ్వకూడదనే..

3వ తేదీ ఘటన జరిగితే పోలీసులు 4వ తేదీ కేసు నమోదు చేశారు. మూడురోజుల పాటు జగన పట్టణంలోనే ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ మూడు రోజులు కేసు విషయం బయటకు పొక్కనివ్వని పోలీసులు శుక్రవారం రాత్రి ఇంటిని చుట్టుముట్టి అరెస్టు చేయడం వెనుక అంతర్యమేమిటనీ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. శని, ఆదివారాలు కోర్టులకు సెలవు కావడంతో బెయిల్‌ రాదని, సోమవారం బెయిల్‌ తీసుకుని ఇంటికొచ్చే సరికి ప్రచార గడువు ముగుస్తుందని, ఆయనను ప్రచారానికి దూరం చేయాలనే వైసీపీ నాయకుల కుట్రలో భాగంగానే పోలీసులు అర్ధరాత్రి అరెస్టు డ్రామాకు తెరతీశారని టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఆరోపించారు. అయితే కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి అర్ధరాత్రి 1.45 గంటలకు బెయిల్‌ మంజూరు చేయడంతో, అధికార పార్టీ ఎత్తులు చిత్తు అయ్యాయని న్యాయమే గెలిచిందని టీడీపీ నాయకులు అంటున్నారు. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు ముందు అరెస్టుల పర్వానికి తెరతీయడంతో పోలింగ్‌ రోజు ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని పట్టణవాసులు భయాందోళన చెందుతున్నారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలతో మున్సిపల్‌ ఎన్నికల్లో గెలవాలనుకుంటే, ఓటర్లు గుణపాఠం చెబుతారని పుట్టా సుధాకర్‌యాదవ్‌ అన్నారు. 


‘ఓటమి భయంతోనే అక్రమ కేసుల యత్నం’

మైదుకూరు, మార్చి 6: మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే వైసీపీ  నాయకులు తమపై అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మైదుకూరు టీడీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి ధనపాల జగన్‌ ఆరోపించారు. శనివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, టీడీపీ జిల్లా నేత హరిప్రసాద్‌ సమక్షంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. విత్‌డ్రాల సమయం ముగిసిన తరువాత ఇద్దరు అభ్యర్థులతో విత్‌డ్రా చేపించేందుకు వైసీపీ నాయకులు కార్యాలయంలోకి వెళ్లారని, లోపలికి ఎందుకు అనుమతించారంటూ అధికారులను అడిగేందుకు తాను వెళ్లగా తనపై అక్రమ కేసులు బనాయించారని అన్నారు. సంఘటన జరిగిన మూడు రోజులకు తనను అరెస్టు చేయడం ఏంటని, ఓటర్లను, టీడీపీ అభ్యర్థులను భయభ్రాంతులను చేసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. 

Updated Date - 2021-03-07T05:42:52+05:30 IST