‘పోటీ’త్తారు..
ABN , First Publish Date - 2021-02-01T05:47:10+05:30 IST
సం‘గ్రామం’ తొలి విడత నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేయడమో.. పల్లెపోరులో తలపడాలనే ప్రజల్లో చైతన్యం వచ్చిందో.. పంచాయతీ బరిలో అభ్యర్థులు ‘పోటీ’త్తారు.

తొలి విడతలో పోటాపోటీ
206 పంచాయతీల్లో సర్పంచికి 1565, వార్డులకు 4,142
తొలి విడతలో పోటాపోటీ
ఆరు పంచాయతీలకు సింగిల్ నామినేషన్లు
పలుచోట్ల వైసీపీ రెబల్ అభ్యర్థులు
ధీటుగా నామినేషన్లు వేసిన టీడీపీ మద్దతుదారులు
చిన్నకామసముద్రం టీడీపీ మద్దతు అభ్యర్థి కిడ్నాప్ యత్నం
బందోబస్తు పరిశీలించిన ఎస్పీ అన్బురాజన
(కడప-ఆంధ్రజ్యోతి): సం‘గ్రామం’ తొలి విడత నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేయడమో.. పల్లెపోరులో తలపడాలనే ప్రజల్లో చైతన్యం వచ్చిందో.. పంచాయతీ బరిలో అభ్యర్థులు ‘పోటీ’త్తారు. ఫేజ్-1 కింద ఎన్నికలు జరిగే 206 పంచాయతీలకు 1565, 2068 వార్డులకు 4142 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజైన ఆదివారం ఒక్కరోజే సర్పంచికి 958 మంది, వార్డులకు 3018 మంది అభ్యర్థులు పోరుకు సై అన్నారు. రాజుపాలెం మండలం ఆర్కటవేముల పంచాయతీకి రాత్రి 9 గంటల వరకు నామినేషన్లు వేయడం కొసమెరుపు. పల్లెపోరులో ఇదో ప్రజా చైతన్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దువ్వూరు, చాపాడు మండలాల్లో ఏడు పంచాయతీలకు సింగిల్ నామినేషన్లు వచ్చాయి. దాదాపుగా ఏకగ్రీవమైనా పరిశీలన అనంతరం రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అట్లూరు మండలం చిన్నకామసముద్రం పంచాయతీ సర్పంచిగా నామినేషన వేయడానికి వెళ్లిన టీడీపీ మద్దతు అభ్యర్థిని వైసీపీ నాయకులు అడ్డుకుని కిడ్నాప్ యత్నం చేయడంతో పోలీసుల జోక్యంతో నామినేషన వేశారు. భద్రతా ఏర్పాట్లను ఎస్పీ అన్బురాజన పరిశీలించారు.
సర్పంచికి 1565.. వార్డులకు 4142
ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో తొలి విడత ఎన్నికలు జరిగే 206 పంచాయతీలలో నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ముగిసింది. పల్లెపోరులో తలపడేందుకు అభ్యర్థులు పోటాపోటీగా ముందుకు వచ్చారు. దీంతో రాత్రి 9 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాల్సి వచ్చింది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 30 పంచాయతీలకు సర్పంచి స్థానానికి 211, వార్డు స్థానాలకు 790, మైదుకూరు నియోజకవర్గంలో 90 పంచాయతీలకు సర్పంచి స్థానానికి 603, వార్డులకు 1726, బద్వేలు నియోజకవర్గంలో 86 పంచాయతీలలో సర్పంచి స్థానానికి 751, వార్డులకు 1625 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఆదివారం ఒక్కరోజే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సర్పంచికి 112, వార్డులకు 484, మైదుకూరు నియోజకవ్గంలో సర్పంచికి 293, వార్డులకు 1210, బద్వేలు నియోజకవర్గంలో సర్పంచికి 553, వార్డులకు 1323 నామినేషన్లు వేశారు. సర్పంచి, వార్డు సభ్యులుగా 5707 మంది అభ్యర్థులు పోటీకి సై అన్నారు. వీరిలో ఎందరు అభ్యర్థులు పరిశీలన, వితడ్రా తరువాత బరిలో మిగులుతారో మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే.
ఏడు పంచాయతీలకు సింగిల్ నామినేషన్లు
దువ్వూరు మండలం పెద్దజొన్నవరం, ఎం.ఎర్రబల్లె పంచాయతీలు, సంజీవరెడ్డిపల్లె, చాపాడు మండలంలో సీతారామాపురం, లక్ష్మిపేట, ఎన.ఓబాయపల్లె, విశ్వనాథపురం పంచాయతీలకు సింగిల్ నామినేషన దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్లే. అయితే.. నామినేషన్లు పరిశీలించి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్రువీకరించాల్సి ఉంది. అలాగే.. దువ్వూరు మండలం సంజీవరెడ్డిపల్లెలో 10 వార్డులకు కూడా ఒక్కొక్క నామినేషన వచ్చింది.
బెడిసికొట్టిన కిడ్నాప్ యత్నం
అట్లూరు మండలం చిన్నకామసముద్రం పంచాయతీకి టీడీపీ మద్దతుతో చింతం లక్ష్మిరెడ్డి నామినేషన వేసేందుకు సిద్ధమయ్యారు. బద్వేలులో టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మను కలసి ఆమె మద్దతుతో సర్పంచి స్థానానికి నామినేషన వేసేందుకు బద్వేలు నుంచి బయలుదేరారు. గ్రామానికి అర కిలోమీటరు దూరంలో పెద్దకామసముద్రం సమీపంలో వైసీపీ నాయకులు అడ్డుకుని నామినేషన పత్రాలు చింపేశారు. పెద్దకామసముద్రంలోనే బంధించారు. వారి ఉద్దేశ్యం నామినేషన్ల గడువు దాటేవరకు ఆపాలని. అయితే.. లక్ష్మిరెడ్డి భార్య అనంతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బద్వేలు రూరల్ సీఐ చలపతి, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని వైసీపీ నాయకుల అదుపులో ఉన్న టీడీపీ మద్దతు అభ్యర్థి లక్ష్మిరెడ్డిని చిన్న కామసముద్రం పంచాయతీకి తీసుకెళ్లి నామినేషన వేయించారు. దీంతో కథ సుఖాంతమైంది.
రాత్రి 9 గంటల వరకు...
మైదుకూరు మండలం వనిపెంట క్లస్టర్‌లో వనిపెంట, విశ్వనాథపురం పంచాయతీలు, నంద్యాలంపేట క్లస్టరులో నంద్యాలంపేట, తువ్వపల్లె, ఎర్రపల్లె పంచాయతీలకు నామినేషన్లు స్వీకరించారు. అభ్యర్థులు పెద్దసంఖ్యలో రావడంతో సాయంత్రం 5 గంటల తరువాత కూడా నామినేషన్లు స్వీకరించారు. రాజుపాలెం మండలం ఆర్కటవేముల పంచాయతీకి రాత్రి 9 గంటల వరకు నామినేషన్లు వేయడం కొసమెరుపు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ నామినేషన్ల పక్రియను ఎస్పీ అన్బురాజన తనిఖీ చేశారు. వైసీపీ మద్దతుదారులే పోటీపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులు అన్ని పంచాయతీల్లో నామినేషన్లు వేశారు. దీంతో వైసీపీ ఏకగ్రీవాల వ్యూహం బెడికొట్టింది. పలుచోట్ల వైసీపీ మద్దతు రెబల్స్ బరిలో దిగారు.
మండలాల వారీగా దాఖలైన నామినేషన్లు
మండలం సర్పంచి వార్డు సర్పంచి వార్డు సభ్యుల
స్థానాలు సభ్యులు నిమినేషన్లు నామినేషన్లు
--------------------------------------------------------------------------------------------------------
ప్రొద్దుటూరు నియోజకవర్గం
ప్రొద్దుటూరు 15 182 108 466
రాజుపాలెం 15 146 103 324
---------------------------------------------------------------------------------------------------
మొత్తం 30 328 211 790
----------------------------------------------------------------------------------------------------
మైదుకూరు నియోజకవర్గం:
మైదుకూరు 13 132 113 249
దువ్వూరు 23 220 126 452
ఖాజీపేట 21 206 133 389
చాపాడు 22 208 118 395
బి.మఠం 11 12 113 241
-------------------------------------------------------------------------------------------------------
మొత్తం 90 888 603 1,726
-------------------------------------------------------------------------------------------------------
బద్వేలు నియోజకవర్గం:
బద్వేలు 10 98 107 269
గోపావరం 7 70 77 136
అట్లూరు 12 116 80 228
బి.కోడూరు 10 98 74 156
కలసపాడు 13 130 147 211
కాశినాయన 17 160 117 243
పోరమామిళ్ల 17 180 149 382
--------------------------------------------------------------------------------------------------------
మొత్తం 86 852 751 1,625
--------------------------------------------------------------------------------------------------------
తొలి విడత మొత్తం 206 2,068 1,565 4,142