పరిశ్రమ ఈవెంట్లపై నేతల కన్ను

ABN , First Publish Date - 2021-10-29T05:47:00+05:30 IST

పరిశ్రమ ఈవెంట్లపై నేతల కన్ను

పరిశ్రమ ఈవెంట్లపై నేతల కన్ను
పరిశ్రమల శాఖ కార్యాలయం

సబ్సిడీ సొమ్ము కోసం అడ్డదారులు

బినామీ పేర్లతో దరఖాస్తు

ఇదీ పరిశ్రమల తీరు


నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంపై రాజకీయ నేతల కన్నుపడింది. నిరుద్యోగుల ముసుగులో సబ్సిడీ సొమ్మును కాజేసేందుకు పన్నాగం పన్నుతున్నారు. సిఫారసులు, పైరవీలతో యూనిట్లు తెప్పించుకుని అడ్డదారిలో ప్రభుత్వ సబ్సిడీని బొక్కేసేందుకు మాస్టర్‌ప్లాన వేస్తున్నారు. యువత నోట్లో మట్టికొట్టే విధంగా కొందరు వ్యవహరిస్తున్న తీరు పరిశ్రమల శాఖలో చర్చనీయాంశంగా మారింది. 


కడప, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా జిల్లాకు 36 యూనిట్లు మంజూరయ్యాయి. ప్రాజెక్టు విలువ రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమ స్థాపిస్తే 15 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగలు, వెనకబడిన తరగతులు, మహిళలు, మైనార్టీలు, మాజీ సైనికులకైతే పట్టణ ప్రాంతాల్లో 20 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం సబ్సిడీ ఇస్తుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో బలహీనవర్గాలకు చెందిన వారు రూ.10 లక్షలతో పరిశ్రమ పెడితే రూ.3.50 లక్షలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. 18 సంవత్సరాల వయసు దాటినవారు, స్వయం సహాయ సంఘాలు, సహకార సంఘాలు, ఛారిటీ ట్రస్టులకు అర్హత కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్ధిదారుడి వాటాగా ప్రాజెక్టు విలువలో వెనకబడిన తరగతులు 5 శాతం, ఇతరులు 10 శాతం వాటా చెల్లించాలి. ఫ్లైయాష్‌ ఇటుకలు, తదితర పరిశ్రమలు స్థాపించుకోవచ్చు. మూడేళ్లు పరిశ్రమ కంటిన్యూగా నడిస్తేనే సబ్సిడీ వస్తుంది. 


నేతల కన్ను

ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంపై కొందరు నేతలు కన్నేశారు. సబ్సిడీని కాజేసేందుకు వక్రమార్గాలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తును లబ్ధిదారులు ఆనలైనలో నమోదు చేసుకోవాలి. దరఖాస్తుదారుడి పేరు, ఆధార్‌కార్డు, ఇతర వివరాలను నమోదు చేయాలి. దరఖాస్తు సక్రమంగా ఉన్న వాటిని రుణం కోసం బ్యాంకుకు పంపిస్తారు. బ్యాంకు దరఖాస్తుదారుడి వివరాలు, అతడి సిబిల్‌ స్కోర్‌తో సంతృప్తి చెందితే రుణం ఇచ్చేందుకు సుముఖత చూపితే యూనిట్‌ మంజూరైనట్లే. అయితే కొందరు సబ్సిడీని కాజేసేందుకు బినామీల ద్వారా దరఖాస్తు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడు ఒకరి సూచన మేరకు సుమారు 8 మంది బినామీ పేర్లతో దరఖాస్తు చేసినట్లు ఆరోపణలున్నాయి. దరఖాస్తు ఫారంపై ఉన్న ఫోన నెంబర్ల సిమ్‌లు ఆ కన్సల్టెన్స వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. దరఖాస్తుదారుడి డాక్యుమెంట్లు సరిలేకపోతే మరికొన్ని జత చేయాలని అధికారులు ఆ నెంబర్‌కు ఫోన చేస్తే ఒకే వ్యక్తి లిఫ్ట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అతను ఓ కన్సల్టెంట్‌ అని చెబుతున్నారు. దరఖాస్తుదారుడికి బ్యాంకు రుణం ఇచ్చేందుకు సుముఖత చూపితే ఆ పరిశ్రమల ఏర్పాటుపై శిక్షణ ఇస్తారు. అయితే ఆ కార్యక్రమానికి కూడా ఈ కన్సల్టెంటే వెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎనిమిదే కాకుండా మరికొన్ని బినామీల ద్వారా దరఖాస్తు చేయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సబ్సిడీ సొమ్మును కాజేసేందుకు బినామీల పేరిట లబ్ధిదారులు దరఖాస్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆ బినామీ వెనుక బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న నేతలే కాబట్టి బ్యాంకుల నుంచి ఎలాగైనా సరే రుణమిచ్చేలా లైన క్లియర్‌ చేసుకొని ఈ అక్రమాలకు తెరలేపారని తెలుస్తోంది. ఏదో ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో ఉన్న ఊర్లోనే పరిశ్రమ పెట్టుకుని తాను తన కాళ్ల మీద నిలబడటంతో పాటు పలువురికి ఉపాధి కల్పించవచ్చన్న ఆశతో ఉన్న నిరుద్యోగ యువతకు వీరు తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.


అర్హులకే యూనిట్లు 

- చాంద్‌బాషా, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌

ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా అర్హులైన వారినే ఎంపిక చేస్తాం. దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటిని బ్యాంకుకు పంపిస్తాం. బ్యాంకు రుణం ఇచ్చేందుకు సుముఖత చూపిస్తే యూనిట్‌ మంజూరు చేస్తాం. మూడేళ్ల పాటు పరిశ్రమను రన చేస్తేనే సబ్సిడీ వస్తుంది. 8 దరఖాస్తులకు సంబంఽధించి ఫోన నెంబర్లన్నీ ఒకే వ్యక్తి దగ్గర ఉన్న మాట వాస్తవమే.

Updated Date - 2021-10-29T05:47:00+05:30 IST