ప్రభుత్వాలు మారినా.. తలరాతలు మారవా..!

ABN , First Publish Date - 2021-05-21T05:00:44+05:30 IST

కాలం మారింది... ప్రభుత్వాలు మారుతున్నాయి... అయినా వారి తలరాతలు మారడం లేదు. ఏళ్ల తరబడి ఆ ఊరికి సరైన దారి ఉండదు. చుట్టూ నీరు, మరోవైపు రైలు కట్ట ఈ గ్రామానికి సరిహద్దులు. దాదాపు 200 కుటుంబాలు, 600 మంది ఓటర్లు ఉన్న సి.గోపులాపురం గ్రామ ప్రజల కష్టాలివి.

ప్రభుత్వాలు మారినా.. తలరాతలు మారవా..!
గ్రామంలోకి వెళ్లేందుకు ఉన్న ఒకే ఒక్క దారి

వర్షం వస్తే నరకమే 

కొన్నేళ్లుగా తీరని సమస్య 

పట్టించుకోని పాలకులు

ఇబ్బందులు పడుతున్న స్థానికులు


కాలం మారింది... ప్రభుత్వాలు మారుతున్నాయి... అయినా వారి తలరాతలు మారడం లేదు. ఏళ్ల తరబడి ఆ ఊరికి సరైన దారి ఉండదు. చుట్టూ నీరు, మరోవైపు రైలు కట్ట ఈ గ్రామానికి సరిహద్దులు. దాదాపు 200 కుటుంబాలు, 600 మంది ఓటర్లు ఉన్న సి.గోపులాపురం గ్రామ ప్రజల కష్టాలివి. 


కమలాపురం(రూరల్‌), మే 20: మండల పరిధిలోని సి.గోపులాపురానికి ఒక పక్క వంక, మరో పక్క చెరువు, ఇంకో పక్క రైల్వే కట్ట. ఉన్నది ఒక్కటే ఒక్క దారి. వర్షాకాలంలో ఆ దారి నిండా 3 అడుగుల లోతు మేర నీరు నిల్వ ఉంటుంది. దారి తగ్గున ఉండటం, గ్రామం పై భాగంలో ఉండటం వలన నీరు పోయేందుకు వీలు లేకుండా ఉంది. ఈ దారి లేకపోతే బయటకు వెళ్లేందుకు మరో దారి లేదు. గ్రామం నుంచి అనునిత్యం కమలాపురానికి చిన్నపని పడినా పోవాల్సిన పరిస్థితి. వర్షం పడితే ఇక వారి బాధలు వర్ణణాతీతం. బయటకు రావాలంటే ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని రైల్వే లైను దాటాల్సిందే. విద్యార్థులు పాఠశాలకు, కళాశాలకు ఈదారి వెంబడే పోవాలి. అలా పోవాలంటే వారి తల్లిదండ్రుల సహకారంతోనే రైల్వే ట్రాక్‌ దాటాల్సి వస్తుంది. తమ గ్రామానికి నాయకులు ఓట్లకోసం వస్తారే తప్ప సమస్యను పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అనేకమార్లు రైల్వే అధికారులకు, రాజకీయ నాయకులకు విన్నవించుకున్నా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా వర్షాలు రాకముందే ఈ దారి సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.


పట్టించుకునే నాథుడే లేరు 

మండలంలో గోపులాపురం గ్రామం ఉందన్న పేరే కానీ మాకు ఎటువంటి సౌకర్యాలు ఇక్కడ లేవు. ఉన్న ఒక్క దారిలో వర్షం నీరు చేరిందంటే గ్రామ స్థులు రైల్వే ట్రాక్‌ పై నుంచి వెళ్లాల్సిందే. నేను గొర్రెలు కాచుకుని జీవనం సాగిస్తుంటాను. వీటికి గ్రామంలో సరైన మేత కూడా దొరకదు. పక్క గ్రామాలకు మేతకు వెళ్లాలంటే ట్రాక్‌ మీదుగా వెళ్లాలి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉంటుంది.  

 - గంగయ్య, మాజీ సర్పంచ్‌


సమస్యను పరిష్కరించండి 

ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య ఇలాగే ఉంది. ఎవ్వరూ పట్టించు కునేవారే లేరు. చిన్న పని ఉన్నా కమలాపురం వెళ్లక తప్పదు. మామూ లుగా అయితే ఎలాగోలా బ్రిడ్జి కింద నుంచి వెళుతున్నాము. వర్షం పడితే నీళ్లన్నీ బ్రిడ్జీ కింద చేరుతాయి. దీంతో రైల్వే ట్రాక్‌ ఎక్కి పోవాల్సిందే. ఇక వృద్ధులు అయితే పాక్కుంటూ వెళ్లాల్సిందే. ఎప్పుడు ఏం జరుగుతుందో నని భయమేస్తుంటుంది. ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో ఏమో. 

- పి.మౌనికా దేవి, గృహిణి

Updated Date - 2021-05-21T05:00:44+05:30 IST