‘లే’కున్నా..

ABN , First Publish Date - 2021-03-23T05:12:36+05:30 IST

రియల్టర్ల తియ్యటి మాటలు నమ్మి.. నివాస స్థలాలు కొనుగోలు చేసిన జనం త్రిశంకు స్వర్గంలో తేలియాడుతున్నారు.

‘లే’కున్నా..
రింగు రోడ్డు ప్రాంతంలో వెలసిన లేఔట్లు

ల్యాండ్‌ కన్వర్షన్‌ లేకుండానే వెంచర్లు

కడపలో విచ్చలవిడిగా అనుమతుల్లేని లేఔట్లు

రింగు రోడ్డు చుట్టూ రూ.500 కోట్ల వ్యాపారం.. ?


(కడప - ఆంధ్రజ్యోతి): రియల్టర్ల తియ్యటి మాటలు నమ్మి.. నివాస స్థలాలు కొనుగోలు చేసిన జనం త్రిశంకు స్వర్గంలో తేలియాడుతున్నారు. కొనుగోలు చేసిన ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ కాక ఇల్లు కట్టుకుందామంటే ప్లాను రాక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇదెక్కడో జరగలేదు. కడప కార్పొరేషన్‌ పరిధిలోనే చోటు చేసుకుంది. ఇక్కడ రింగురోడ్డు చుట్టూ సుమారు రూ.500 కోట్ల మేర లావాదేవీలు సాగినట్లు అంచనా. వీటిలో చాలా వాటికి అనుమతుల్లేకపోవడంతో ఇప్పుడు వీరంతా రిజిస్ర్టేషన్లు కాక వీరు ఆందోళన చెందుతున్నారు.

కడప నగరంలో 2019లో జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగింది. నగరం నలువైపులా జెట్‌ స్పీడులో రియల్టర్లు వ్యాపారం నడిపారు. జగన్‌ సీఎం అవుతున్నాడని పరిశ్రమలు, కొత్త కొత్త సంస్థలు వస్తున్నాయంటూ ప్రచారం చేశారు. అందుకు తగ్గట్లుగానే కడప సిటీలో మొదలుకుని చుట్టుపక్కల భూముల్లో రంగురంగు రాళ్లు నాటి వెంచర్లు వేశారు. అప్పట్లో ఇటు కర్నూలు రోడ్డు, అటు రాయచోటి రోడ్డు, ఇటు రాజంపేట రోడ్డు వెంబడి వెళుతుంటే ఖాళీ స్థలాలన్నీ రంగురాళ్లతో కనిపించేవి. ఇక రింగు రోడ్డు చుట్టూ అయితే  ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాలు, ఖద్దరు వేసుకున్న రియల్టర్లు కనిపించేవారు. అక్కడ వ్యవసాయ భూముల్నే చాలా వరకు కన్వర్షన్‌ చేయకుండా వెంచర్లుగా మార్చేశారు.


అనుమతులు ఏవీ

కార్పొరేషన్‌ పరిధిలో ఇంటి నిర్మాణం చేపట్టాలన్నా, లే ఔట్లు వేయాలన్నా సిటీ ప్లానింగ్‌ అనుమతి తీసుకోవాలి. లేఔట్లలో 40 అడుగుల రహదారి, కార్పొరేషన్‌ పేరిట 13 శాతం స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించాలి. ఎకరా స్థలంలో లే అవుట్‌ వేస్తే 13 సెంట్లు కార్పొరేషన్‌ పేరిట రాయించాలి. ఈ స్థలాన్ని పార్కులు, పాఠశాలలు, మందిరాలు తదితర వాటికి ఉపయోగిస్తారు. రహదారులు, డ్రైన్స్‌ నిర్మించాలి. నిబంధన ప్రకారం వెలసిన లేఔట్లలో ఇళ్ల నిర్మాణం సాగితే అక్కడ అవసరమైన నీరు తదితర మౌలిక సదుపాయాలను కార్పొరేషన్‌ కల్పిస్తుంది. అయితే చాలామంది రియల్టర్లు సిటీ ప్లానింగ్‌ అనుమతి తీసుకోకుండానే లేఔట్లు వేశారు. 40 అడుగులకు బదులు 20 నుంచి 30 అడుగుల్లోపు రహదారినే వేసి మమ అనిపించారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకోవాలంటే ల్యాండ్‌ కన్వర్షన్‌ జరగాలి. అందుకు అవసరమైన మూడు శాతం ఫీజును రెవెన్యూకు చెల్లిస్తే రెవెన్యూ అధికారులు ఆ భూమిని పరిశీలించి వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు ఇబ్బంది లేదని అనుమతినిస్తేనే అక్కడ వాణిజ్య కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. అయితే రింగు రోడ్డుతో పాటు అలంఖాన్‌పల్లె, వినాయకనగర్‌, కమలాపురం రోడ్డు ప్రాంతాల్లో వెలసిన చాలా మటుకు భూముల్లో ల్యాండ్‌ కన్వర్షన్‌ జరగకుండానే లేఔట్లు వేశారు. చెన్నూరు మండలం రుద్రభారతిపేట పరిధిలోని సర్వే నెంబరు 36, 37, 38, 39. 40తో పాటు మరికొన్ని సర్వే నెంబర్లలో అనుమతులు లేకుండానే లేఔట్లు వేశారు. ఈ సర్వే నెంబర్లలో ల్యాండ్‌కన్వర్షన్‌ జరిగిందా..? లేఔట్‌కు అనుమతి ఇచ్చారా అంటూ కొందరు చెన్నూరు తహసీల్దారు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. అనుమతులు లేవంటూ అధికారులు సమాధానమిచ్చారు. వీటితో పాటు మరికొన్ని సర్వే నెంబర్లలో కూడా అనుమతి లేకుండానే వెలిశాయి.


రూ.500 కోట్ల వ్యాపారం

కార్పొరేషన్‌ పరిధిలో సుమారు 250 ఎకరాల్లో అనుమతుల్లేని లేఔట్లు వెలసినట్లు సిటీ ప్లానింగ్‌ అధికారులు గుర్తించారు. ఎకరం లేఔట్లలో రహదారుల నిర్మాణానికి 25 సెంట్లు మినహాయిస్తే మిగతా 75 సెంట్లలో మూడుసెంట్ల చొప్పున సుమారు 25 ప్లాట్లు వేయవచ్చని రియల్టర్లు చెబుతున్నారు. రింగు రోడ్డు చుట్టూ ఒక్కో ప్లాటు రూ.20లక్షల ధర పలుకుతున్నట్లు సమాచారం. అంటే సగటున ఎకరం విస్తీర్ణం లేఔటులో రెండుకోట్ల రూపాయల వ్యాపారం జరిగిందనుకున్నా 250 ఎకరాలకుగాను సుమారు రూ.500 కోట్ల లావాదేవీలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. కొన్ని లేఔట్లకు అనుమతులు ఉన్నాయో లేవో అని తెలుసుకోకుండానే కొందరు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ ప్లాట్లను రిజిస్టరు చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్‌ జరగడంలేదు. ఇల్లు కట్టుకుందామని ప్లాను వేసుకుందామన్నా ప్లాన్‌ అప్రూవల్‌ రాని పరిస్థితి నెలకొంది. సొంతింటి కల నెరవేర్చుకోవాలన్న ఆశతో ఇంటిస్థలం కొనుగోలు చేస్తే కట్టుకునేందుకు ఉపయోగం లేకుండా పోయిందని కొందరు భోరుమంటున్నారు.


రిజిస్ట్రేషన్లు జరగవు

- క్రిష్ణసింగ్‌, సిటీ ప్లానింగ్‌ ఆఫీసరు

కార్పొరేషన్‌ పరిధిలో అనుమతులు లేని లేఔట్లను గుర్తించాం. సుమారు 250 ఎకరాల్లో లేఔట్లు వెలిశాయి. వాటిని రిజిస్ట్రేషన్‌  చేయవద్దంటూ సర్వేనెంబర్ల వారీగా రిజిస్ర్టేషన్‌ శాఖకు అందించాం. వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు ఎటువంటి ప్లాన్లు ఇవ్వం.

Updated Date - 2021-03-23T05:12:36+05:30 IST