రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి

ABN , First Publish Date - 2021-12-26T05:30:00+05:30 IST

మండలంలోని పుల్లీడి సమీపంలో తుఫాన్‌ వాహనాన్ని లారీ ఢీకొంది.

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి
ప్రమాదంలో మృతి చెందిన సీతారామయ్య

పుట్టువెంట్రుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా...

తుఫాన్‌ వాహనాన్ని ఢీకొన్న లారీ 

ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు 


పోరుమామిళ్ల, డిసెంబరు 26: మండలంలోని పుల్లీడి సమీపంలో తుఫాన్‌ వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ సంఘటనలో తుఫాను వాహనంలో ఉన్న శివాపురం సీతారామయ్య సువర్ణకుమారి అనే భార్యాభర్తలు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ ఏరియా శ్రీనివాసనగర్‌ ప్రాంతానికి చెందిన లక్ష్మి మెడికల్‌ స్టోర్‌ నిర్వహిస్తున్న శివాపురం సీతారామయ్య, సువర్ణకుమారి అనే వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి గిద్దలూరులోని ఆల్లూరు పోలేరమ్మ దేవాలయానికి పుట్టువెంట్రుకలకు వెళ్లారు. తిరిగి ప్రొద్దుటూరుకు వస్తుండగా ఆదివారం రాత్రి పుల్లీడు సమీపంలో లారీ ఢీకొంది. ఈ సంఘటనలో సువర్ణకుమారి (38) అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడ్డ వారిని పోరుమామిళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి సువర్ణకుమారి భర్త సీతారామయ్య (45) కూడా మృతి చెందాడు. ప్రమాదంలో వాహనంలో ఉన్న మరో ఆరుగురు గాయపడగా వారిలో కొందరిని మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ హరిప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు కూడా గాయాలైనట్లు తెలిపారు. 

 Updated Date - 2021-12-26T05:30:00+05:30 IST